Monday, February 25, 2013

నాశనమైపోతున్నాం

చుక్క చినుకు లేదు.. కరెంటు రానే రాదు
అదను మీద కురవాల్సిన వానలు కళ్లాల మీద పడ్డాయి
మూడేళ్ల నుంచీ అప్పుల బాధలేనంటూ ఆవేదన
ఆదుకునే నాథుడు లేడంటూ ఆక్రందన
త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ షర్మిల భరోసా
ఇప్పుడు కాకపోతే... ఇంకెప్పుడు అవిశ్వాసం పెడతారో చెప్పాలని చంద్రబాబుకు డిమాండ్
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 74, కిలోమీటర్లు: 1,046.8

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కరెంటేమో మూడు గంటలకు మించి రాదు. అది కూడా మూడు సార్లు మాత్రమే ఇస్తారు. పొలానికి పోయి ఎదురు చూసీ చూసీ ఇంటికి వస్తే అప్పుడు కరెంటొస్తది. పరిగెత్తుకొని పొలానికి పోయే సరికి మళ్లీ పోద్ది. పూతల మీద చుక్క చినుకు రాలలేదు.. తీరా పంట కోతకొచ్చాకా కళ్లాల మీద వానలు పడుతున్నాయి. మూడు ఎకరాల్లో.. అన్ని పెట్టుబడులూ కలుపుకొని రూ.2.10 లక్షలు ఖర్చు చేసి మిరప వేస్తే 18 క్వింటాళ్లు వచ్చింది. రూ. లక్ష వచ్చింది. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఏం చేసి నా పిల్లలను బతికించుకోను?’’
... ఇనపరాజుపల్లి గ్రామానికి చెందిన రైతు కోరకూటి వెంకటేశ్వర్లు అవేదన.

‘‘భూమినే నమ్ముకున్న. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడాది పండక పోతుందా! అని అప్పులు చేసి మూడు ఎకరాల్లో మిరప తోట పెట్టినా. అదను మీద వాన పడలేదు. కరెంటు లేక మొక్కలు ఎండిపోయాయి. ఆయిల్ ఇంజన్‌పెట్టి తోట తడిపితే ఎకరానికి రూ. 2,500 కిరాయి. ఆరు తడులు పెట్టినా.. నేను, నా కొడుకూ..నా భార్యా అందరం రెక్కలు ముక్కలు చేసుకుంటే ఎకరానికి 8 క్వింటాళ్ల మిరప పట్టింది. దాన్ని తీసుకొని మార్కెట్‌కు పోతే కాటా పెట్టకముందే వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది. తడిసిన మిరప కొనబోమని చెప్తే తీసుకొచ్చి ఇంటి ముందు పోసినా. పంటను నమ్ముకొని నాశనమై పోయినాం’’... తక్కెళ్లపాడుకు చెందిన మిరప రైతు అంజిరెడ్డి కన్నీళ్లు..

గుంటూరంటే గుర్తుకొచ్చేది మిరపకాయ ఘాటు. దయలేని పాలకుల ఏలుబడిలో ఆ మిరపే ఇప్పుడు అప్పుల పాలు చేసి రైతుల కంట ఇలా కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రజల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో ఇలా రైతన్నలు ఆమె వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్ర 74వ రోజు సోమవారం షర్మిల మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇనపరాజుపల్లి గ్రామ శివారులో షర్మిల మిరప కళ్లాలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అక్కడే ఉన్న రైతులను పలకరిస్తే ‘‘మూడేళ్ల నుంచీ పంట లేదమ్మా.. భూమిని నమ్ముకొని నాశనమై పోయాం.. ఆదుకునే దేవుడు రాకుంటే ఆత్మహత్యలకు అంతే ఉండదమ్మా’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.

రాజన్న రాజ్యంలో రైతే రాజు..

మిరప రైతు కన్నీళ్లను చూసిన షర్మిల గాదెవారిపల్లిలో జరిగిన రచ్చబండలో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీరును ఘాటుగా విమర్శించారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని, రాజన్న రాజ్యంలో రైతే రాజు అని భరోసా ఇచ్చారు. ‘‘ఇది మనసులేని ప్రభుత్వం.. వీళ్లు రైతుల రక్తం పిండుకొని తాగుతున్నారు. వాళ్లకు ఉన్న సమయమంతా పదవులు కాపాడుకోవడానికి, ఢిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు.

బాబూ రైతుల కన్నీళ్లు కనిపించడంలేదా?

‘‘చంద్రబాబూ మీరు కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా? మరి మీకు ఈ ప్రజల కన్నీళ్లూ, కష్టాలూ కనిపించడం లేదా? రైతన్నలు అప్పుల బాధతో ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారు. మరికొంత మంది రైతన్నలు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కాకుంటే ఈ ప్రభుత్వంపై ఎప్పుడు అవిశ్వాసం పెడతారో చెప్పండి. మీరు అవిశ్వాసం పెట్టరు. ఎందుకంటే ప్రజలు ఎటు పోయినా మీకు పట్టదు. మీరు బాగుంటే చాలు. అవిశ్వాసం పెట్టకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడతారు. అందుకు ప్రతిఫలంగా ఈ ప్రభుత్వం మీరు చేసిన అవినీతి పనుల మీద ఎలాంటి విచారణా వేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అది మీ ఇద్దరి మధ్యా కుదిరిన చీకటి ఒప్పందం’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

ప్రాణాలు తీసుకోవద్దు..

రైతులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ..‘‘అమ్మా..! అయ్యా..! ఒక్క మాటైతే భరోసా ఇచ్చి చెప్తున్నా.. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. 9 గంటల ఉచిత విద్యుత్తు వస్తుంది. రైతులు తమ పంటను నష్టానికి అమ్ముకోకుండా రూ. 3000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు. అంత వరకు ఓపిక పట్టండి. దయచేసి మీ విలువైన ప్రాణాలు, భూమిని పోగొట్టుకోవద్దు’’ అని కోరారు.

సోమవారం 74వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తక్కెళ్లపాడు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి మాచర్ల నియోజకవర్గంలోని కాచవరం, ఇనపరాజుపల్లి, గాదెవారిపల్లె గ్రామాల మీదుగా సాగింది. షర్మిల 11.8 కిలోమీటర్ల మేర నడిచి.. రాత్రి 7.15 గంటలకు చిన కొదమగండ్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1,046.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, ఆతుకూరి ఆంజనేయులు, పి. గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్ తదితరులు ఉన్నారు.

ఒక్క చెయ్యీ లేవలేదు..

ఆ ఊరి పేరు గాదెవారిపల్లె. 800 గడపలుంటాయి. షర్మిల వచ్చి ఊరి మధ్య రచ్చబండ మీద కూర్చున్నారు. మహిళలు చెప్తున్న సమస్యలు వింటున్నారు. వెంకటేశ్వర్లు అనే రైతు ముందుకొచ్చాడు. ‘అమ్మా నేను మాట్లాడతా’ అంటూ మైకందుకున్నాడు. ‘ఊరు ఊరంతా వచ్చి ఇక్కడే ఉంది.. గ్రామస్తులకు దండం పెడుతున్నా.. మన ఊరిలో హిందులువులున్నారు.. ముస్లింలు.. క్రిస్టియన్లూ ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, అన్నీ పార్టీలూ ఉన్నాయి. ఇంత మందిలో ఏ ఒక్కరైనా వైఎస్సార్ సంక్షేమ పథకాల నుంచి లబ్ధిపొందని వాళ్లు ఉంటే చేతులు లేపండి’ అని కోరాడు. షర్మిలతో పాటు అక్కడున్న నాయకులు దాదాపు 5 నిమిషాల పాటు వేచి చూశారు. ఒక్క చెయ్యంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేవలేదు. ‘‘అదమ్మా వైఎస్సార్ మాకు చేసిన సాయం, వైఎస్సార్ మా గుండెళ్లో ఉన్నాడమ్మా’’ అని అన్నాడు. ఈ ఒక్క ఊరిలో రూ.1.70 కోట్ల రుణమాఫీ అయినట్లు వెంకటేశ్వర్లు చెప్పాడు.

Sunday, February 24, 2013

కిడ్నీలు అమ్ముకుంటున్నారు

మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఆవేదన
ఈ పాలకుల నిర్లక్ష్యం నిండా ముంచింది
అకాల వర్షాలతో నష్టపోయినవారికి భరోసా ఇచ్చేవారే కరువయ్యారు
అవిశ్వాసంతో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని దించాల్సిన చంద్రబాబు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 73, కిలోమీటర్లు: 1,035

 ‘‘పల్లెలు మళ్లీ కరువు కోరల్లో చిక్కి వల్లకాడుగా మారుతున్నాయి. అప్పులు చేసి భూమిలో విత్తనం వేసినా.. పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట చేతికందలేదు. కొద్దోగొప్పో అందినా గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఆదుకునే దిక్కులేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. అప్పుల బాధలు తాళలేక కిడ్నీలు అమ్ముకుంటున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నదాతకు అండగా నిలబడి ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దింపాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో సాగింది. దాచేపల్లి మండలం గామాలపాడు, నారాయణపురం గ్రామాల్లో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు విన్నారు. ‘‘మూడు ఎకరాల మాగాణిలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినా. అప్పులపాలై అష్టకష్టాలు పడుతున్నా. దేశం మొత్తం రైతులు ఇట్నే ఉన్నారమ్మా..’’ అని నారాయణపురానికి చెందిన నాగేశ్వర్‌రావు అనే రైతు చెప్పడంతో షర్మిల చలించిపోయారు. త్వరలోనే రైతన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. నారాయణపురంలో రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో షర్మిల రచ్చబండ వేదిక నుంచే మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇది రైతుల పట్ల చిత్తశుద్ధి లేని సర్కారు..

ఈ నెలలోనే అకాల వర్షాలు కురిశాయి. ఆరున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలింది. నిజానికి ఇంతకన్నా మూడింతలు ఎక్కువగా నష్టం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. వరి, పత్తి, మిరప, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. నోటి కాడి ముద్ద నేలపాలయినట్లు మార్కెట్ యార్డుకు తెచ్చిన తర్వాత పత్తి, మిరప పూర్తిగా తడిసిపోయి రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా ఏ ఒక్క ఎమ్మెల్యే కాని, మంత్రి కాని, అధికారి కాని నష్టపోయిన రైతు వద్దకు వెళ్లి పలకరించ లేదు. పంట నష్టాన్ని పరిశీలించి, నష్టపరిహారం ఇస్తామని రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పటి అకాల వర్షాలకే కాదు... నీలం తుపానుకు 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లైలా, జల్ తుపాన్ వచ్చినప్పుడు రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందని సర్కారే అంచనా వేసింది. అయినా రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఎంతో తెలుసా? కేవలం రూ.17 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇదీ మన పాలకులకు రైతులు, వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి.

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..

చంద్రబాబు గారు పాదయాత్రలో అన్నీ అబద్ధాలే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కళ్లార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చెప్పగల సమర్థుడు ఆయన. చంద్రబాబు తన పాలన చాలా బాగుందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన గారు ఏ చార్జీలను పెంచలేదట. 8 సంవత్సరాల 8 నెలలు అధికారంలో ఉన్న చంద్రబాబు 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. అవి కట్టలేమని రైతులు మొత్తుకున్నా వినలేదు. ప్రత్యేకంగా కోర్టులు, పోలీసు స్టేషన్లు పెట్టి రైతన్నలను చిత్రహింసలు పెట్టారు. ఆర్టీసీని బాదేశారు. గ్యాస్ ధర పెంచారు. అన్ని రకాల పన్నులు పెంచారు. అయ్యా..! నీ పరిపాలనలో రైతు కుటుంబాలు కుదేలై అప్పుల బాధలు ఒకవైపు, బిల్లుల కోసం పోలీసు స్టేషన్‌కు ఈడ్చితే ఆ అవమానం తట్టుకోలేక మరోవైపు 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

ఇంకో మాట కూడా చెప్తున్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారట! ఈ మాట వింటే నవ్వొస్తుంది. రాష్ట్రంలో మరోసారి చంద్రబాబునాయుడో.. ఈ కాంగ్రెస్ పార్టో అధికారంలోకి వస్తే అంతకన్నా శాపం మరోటి ఉండదు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టాయి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఏదో ఒక రోజున నిజం గెలుస్తుంది. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం స్థాపిస్తారు. రాజన్న కలలుగన్న కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తారు.

ఆదివారం 73వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దాచేపల్లి మండలం శ్రీనగర్ నుంచి ప్రారంభమైంది. గామాలపాడు, నారాయణపురం మీదుగా దాచేపల్లికి చేరింది. అబద్ధపు కేసులతో జగన్‌ను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు కట్టుకొని షర్మిలతో పాటు కదం తొక్కారు. రాత్రి 8.15 సమయంలో తక్కెళ్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం 14 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 1035 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. షర్మిల వెంట నడిచిన నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, తలశిల రఘురాం, ముదునూరి ప్రసాదరాజు, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున,లక్ష్మీరాజ్యం, పి.గౌతంరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Wednesday, February 20, 2013

జగన్ ఒంటరి కాదు...జన సముద్రం


జగన్‌బాబును అరెస్టు చేసి సంబరపడుతున్న కాంగ్రెస్ పెద్దల కుట్రలను, దర్యాప్తు సంస్థల బుద్ధిహీనతను తెలుగు ప్రజలే కాక దేశం మొత్తం గమనిస్తూనే ఉంది. ఎన్నికలొచ్చినప్పుడు తెలుగుజాతి ఉగ్రగోదారై విజృంభించి కుటిల కాంగ్రెస్‌ను ముంచుతుంది. కేవలం జగన్‌బాబునే ఖైదు చేశామని ఢిల్లీపెద్దలు అనుకుంటున్నారు. జగన్‌తో పాటు ఆయనను అభిమానించే కోట్లాదిమందిని ఎమోషనల్‌గా ఖైదు చేశారు. 

జగన్ ఒంటరి కాదు, ఆయన జనసముద్రం. బీదవాడిని, బడుగువాడిని ప్రేమించడం జగన్‌కు తెలిసినట్టు దేశంలో మరే రాజకీయ నాయకుడికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందుకే సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ను తరిమి తరిమి కొట్టడానికి తెలుగుజాతి నిరీక్షిస్తోంది. జగన్‌కు కొంతకాలమే ఈ కష్టాలు. వీటన్నిటినీ ఆయన అధిగమిస్తారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడతారు. 
- ఈరెల్లి రాజబాబు, రాజమండ్రి

పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకో


టీడీపీ అధినేత చంద్రబాబుపై షర్మిల మండిపాటు
ప్రజల మధ్య ఉన్నపుడేమో చేతగాని ప్రభుత్వం అని తిడతారు
అక్కడ్నుంచి వెళ్లగానే ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారతారు
అవిశ్వాసం పెట్టమంటే పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
ఇంకా ఎంతకాలం ఈ నాటకాలు..?
చిరంజీవిలాగా పార్టీని కాంగ్రెస్ హైకమాండ్‌కు అమ్ముకోండి
 ‘‘చంద్రబాబుగారూ.. మీ తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు. ఇప్పుడు అవే పల్లెల వెంట తిరుగుతూ పాదయాత్ర అంటూ డ్రామాలాడుతున్నారు. మాకు చెప్పినట్టే మీకు కూడా ప్రజలు కష్టాలు కన్నీళ్లు చెప్పుకుంటున్నారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు మీరే ఇది చేతగాని ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదని ప్రజలకు చెప్పి అక్కడ్నుంచి తప్పించుకుంటున్నారు. అక్కడ్నుంచి బయట పడగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారతావు. చంద్రబాబు గారు.. ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలు? మీ డ్రామాలు ఆపండి. ఇన్ని నాటకాలు వేసే బదులు చిరంజీవిలాగా మీరు కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు మీ పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకోండి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అంటూ నాలుగు వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. దామరచర్ల మండల కేంద్రంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ప్రజలతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
కిరణ్, బాబు మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు..
కిరణ్‌కుమార్‌రెడ్డి గారు ప్రజలను, ప్రజా సమస్యలను ఏనాడో గాలికి వదిలేశారు. ఆయనకు ఉన్న సమయమంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పదవిని కాపాడుకోవడానికే సరిపోతోంది. చంద్రబాబు నాయుడు 8 ఏళ్ల పాలనలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచితే.. కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల పాలనలో మూడుసార్లు కరెంటు చార్జీలు పెంచారు. లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పారు. చంద్రబాబు తన హయాంలో హైటెక్ సీఎం అని పేరు తెచ్చుకోవడానికే పాకులాడారు. వ్యవసాయం దండగ అన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమన్నారు. 4 వేల మంది రైతులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడేమో రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఆయన కు నిజంగా రుణాలు మాఫీ చేసే ఆలోచన ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? వీళ్ల మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. వైఎస్సార్ రైతన్న సంక్షేమం కోసం అనుక్షణం శ్రమించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు.

మీ అభిమానమే జగనన్నకు అండ..
నల్లగొండ జిల్లా పాదయాత్రలో నాతో పాటు కదం తొక్కిన నాయకులకు, విద్యార్థులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరున చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్నా. మీ అభిమానమే జగనన్నకు అండ. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుమ్మక్కై అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నాలుగు గోడల మధ్య బంధించారు. మీ ప్రేమాభిమానాలతో జగనన్న జైల్లో కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ మీద ప్రజలెవరికీ భరోసా లేదు. ఎవరికైనా భరోసా ఉందా.. అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే! ఆయన మీదున్న అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు. మ్యానేజ్ చేసుకుంటారు. పైకేమో ఇది అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అంటారు. ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదని తిడతారు. మరి అలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టు అంటే మాత్రం.. ఆ పని చేయనంటాడు.

మంగళవారం 71వ రోజు పాదయాత్ర దామరచర్ల శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి దామరచర్ల మీదుగా విష్ణుపురంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం 7.5 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 1,012 కి.మీ. యాత్ర పూర్తయింది. నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తలశిల రఘురాం, గాదె నిరంజన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, గడ్డం స్పురధర్‌రెడ్డి, శ్రీకళారెడ్డి, బోయపల్లి అనంతకుమార్, సత్యకుమారి, అల్కా శ్రావణ్‌రెడ్డి, కుంబం శ్రీనివాసరెడ్డి, పిట్టా రాంరెడ్డి, సిరాజ్‌ఖాన్, ఇరుగు సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

పాదయాత్రకు రెండు రోజుల విరామం..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు షర్మిల రెండు రోజులపాటు విరామం ప్రకటించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నమే షర్మిల పాదయాత్రను నిలిపివేశారు. దామరచర్ల మండలంలోని విష్ణుపురంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. బుధ, గురువారాల్లో కూడా షర్మిల ఇక్కడే ఉంటారు. తిరిగి 22వ తేదీ నుంచి యాత్రను పునఃప్రారంభిస్తారు. ప్రస్తుతం షర్మిల గుంటూరు జిల్లా సరిహద్దుకు మరో 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా వాడపల్లి బ్రిడ్జి దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తారని పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ రెండు రోజులు షర్మిల పార్టీ నాయకులను, ప్రజలను కలవరు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
మంగళవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 71, కిలోమీటర్లు: 1,012

Tuesday, February 19, 2013

ఆత్మీయస్పర్శను దూరం చేశారు


డైనమిజమ్, కమిట్‌మెంట్ కలిగిన నాయకుడు వై.ఎస్. జగన్. నిర్ణయం తీసుకుంటే, ఎంతటి కష్టమొచ్చినా నష్టమొచ్చినా తట్టుకోగలిగే గుండె దిటవు కలవాడు. ఆశ్రీతులను ఆదుకోవడంలో తండ్రికి తగ్గ తనయుడు. రాజకీయ నాయకుడైతే తక్షణావసరాల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడయితే, భావితరాల గురించి కూడా ఆలోచించి, ప్రజలకు ఏది మంచో అది చేస్తాడు. అటువంటి రాజనీతిజ్ఞుడు జగన్‌బాబు. అటువంటి దృఢ సంకల్పం గల జగన్‌కు, ఈ ఆంక్షలు, అరెస్టులు అడ్డుకావు. కాలేవు. చిన్నతనంలోనే సమర్థ నాయకత్వం వహించి, ప్రజల కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలతో నేరుగా సంబంధబాంధవ్యాలు ఏర్పర్చుకుని వారి ఈతి బాధలు అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు జగన్ ఒక్కరే. 

ఇంకా ఓదార్చవలసిన కుటుంబాలు మిగిలి ఉండగానే సగంలో ఆయన ఆత్మీయ స్పర్శను ప్రజల నుంచి ఈ ప్రభుత్వం లాగేసుకుంది. ఏ సంఘటనలోనైనా సానుకూల దృక్పథంతో చూడాలన్నది ఆర్యోక్తి. ఏది జరిగినా దానివల్ల జగన్‌కి, తద్వారా ప్రజలకి భవిష్యత్తులో మేలు జరుగుతుంది. విజయమ్మ, భారతి, షర్మిల గార్లు ధైర్యంగా ఉండవలసినదిగా మనవి. కలత చెందకండి. పరిస్థితులన్నీ చక్కబడతాయి. దైవ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కష్టాలు తాత్కాలికం. దైవం, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ జగన్‌కి ఉంటాయి. అవే ఆయనను కాపాడుతాయి. ఆయనకు విజయం చేకూరుస్తాయి.

- ఉద్దగిరి సతీష్‌బాబు, అనంతపల్లి, ప.గో.

ప్రజలు కోరుకుంటున్న నాయకుడు జగన్


నేను వైఎస్సార్ అభిమానిని మాత్రమే కాదు, జగన్ కోసం ప్రాణాలర్పించే తమ్ముణ్ని కూడా. జగన్ పేరు వినగానే అమ్మమ్మ, తాతయ్యల మొహంలో చిరునవ్వు, తల్లిదండ్రుల్లో ‘మా కొడుకు’ అన్న భావన, అన్నదమ్ములకు మరో తోబుట్టువు అన్న ధైర్యం వెల్లివిరుస్తాయి. అలాంటిది ఏ తప్పూ చేయని జగనన్నను జైలుపాలు చేయడం ఈ దుష్ట, నీచ రాజకీయ పరిపాలనకు నిదర్శనం. 

ఈ ప్రభుత్వానికి ఒక విషయం అర్థం కావటం లేదు, మేం ఓట్లేసి గెలిపించింది సోనియాను చూసి కాదు, మా వైఎస్సార్‌ను చూసి అని. ఆ మహానుభావుడు రాష్ట్ర ప్రజలకు చేసిన పనులు చూసి. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, 108, ఉచిత విద్యుత్తు... ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికీ నేనున్నాననే ధైర్యాన్ని నూరిపోశాడు. ఆయన చనిపోయాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారో అని కుంగిన సమయంలో ‘నేనున్నాను’ అంటూ మమ్మల్ని ఓదార్చి మాకు అండగా ఉన్న మా జగనన్నను జైల్లో పెట్టారు. ఇంకా ఈ ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు ఏమి చేయాలనుకుంటున్నారు?! వైఎస్సార్‌ని దోషిని చేశారు. జగనన్నని జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. 

అసలు జగనన్న చేసిన తప్పేమిటి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేయటమా? విద్యార్థుల కోసం ఫీజు దీక్ష చేయటమా? రైతన్నల కోసం రైతు దీక్ష చేయటమా? కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టడమా? చనిపోయినవారి కుటుంబ సభ్యుల కన్నీరు తుడవడమా? ఏం నేరం చేశాడని జైల్లో పెట్టారు? ఇవేవీ కావు. జగనన్న ఓ ప్రజానాయకుడు. ప్రజలు మెచ్చి, కోరుకునే నిజమైన నాయకుడు. జగన్ ‘పేదల పెన్నిధి’. కోర్టు వారికి నా మనవి: అయ్యా! నిస్వార్ధంగా సేవచేసే మా జగనన్నకి వెంటనే బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుకుంటున్నాం. జగన్‌ను విడుదల చేయండి. మంచిని కాపాడండి.

- దండే మధుకృష్ణ, పెంటపాడు, ప.గో.

సబ్సిడీలను ఎత్తివేసేందుకే...!

* మరోప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
* నాడు కేంద్రం గ్యాస్ ధర పెంచితే వైఎస్ తన మీద వేసుకున్నారు
* మహిళలకు వంటింటి భారం తగ్గించారు
* ఈనాటి పాలకులకు ఆ చిత్తశుద్ధి లేదు
* ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు కన్నీళ్లే!
* అవిశ్వాసంతో ప్రభుత్వాన్ని దింపేయకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారు
* వెయ్యి కి.మీ. పూర్తి చేసుకున్న మరో ప్రజా ప్రస్థానం


 ‘‘వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేయాలనుకున్నారు. మహిళా సాధికారత కోసం పరితపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచితే.. ఆ భారం నా అక్కాచెల్లెమ్మల మీద పడొద్దని వైఎస్సార్ తన మీద భారం వేసుకున్నారు. మహిళలకు వంటింటి భారాన్ని తగ్గించారు. ఇప్పుడున్న పాలకులు సబ్సిడీ గ్యాస్ నుంచి తప్పించుకోవడానికే సిలిండర్‌ను ఆధార్‌తో ముడిపెడుతున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయని, త్వరలోనే ఈ కష్టాలు కడతేరే రోజు వస్తుందని హామీనిచ్చారు. 

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. సరిగ్గా దామరచర్ల మండలం కొండ్రపోలు కాల్వ వద్దకు చేరుకోవడంతో షర్మిల పాదయాత్ర 1000 కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. అంతకుముందు ఆమె గూడూరులో గ్రామస్తులతో కలిసి రచ్చబండలో పాల్గొన్నారు. 

‘‘వైఎస్సార్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కపూట భోజనం కూడా సరిగ్గా తినలేకపోతున్నాం.. గ్యాస్ ధర.. బియ్యం, పప్పు.. ప్రతి వస్తువు ధర పెరిగింది. మా లాంటి పేదోళ్లకు కనీసం ఒక్కపూట భోజనం పెట్టడం కోసమైనా జగనన్న బయటికి రావాలి’’ అని మానస అనే మహిళ అన్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. వైఎస్ మహిళల సంక్షేమం కోసం క్షణక్షణం తపించారన్నారు. నేటి పాలకులకు ఆ చిత్తశుద్ధి కరువైందని మండిపడ్డారు. తర్వాత కొండ్రపోలు కాల్వ వద్ద పార్టీ నాయకులు, అభిమానుల కోరిక మేరకు షర్మిల కొద్దిసేపు ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

పాదయాత్ర రికార్డుల కోసం కాదు..
రికార్డుల కోసం పాదయాత్ర చేయడం లేదు.. పండుగలు చేసుకోవడం కోసం కాదు. వైఎస్సార్ పాదయాత్రను మహాయజ్ఞంలా చేశారు. దేవుడి దయ, నాన్నగారి ఆశీస్సులతో జగనన్న తరపున చేస్తున్న ఈ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. మూడున్నర సంవత్సరాల కిందట వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచే రాష్ట్రం అతలాకుతలమైంది. పోయింది ఒక్క మనిషే కానీ రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు కోలుకోలేదు.

ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది
పాదయాత్ర చేస్తూ ఏ గ్రామానికి వెళ్లినా కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా అప్పుల బాధలే. అన్ని బాధల్లోనూ ప్రజలు వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అమ్మా.. నాయిన బతికున్నప్పుడు చాలా బాగుండేదమ్మా.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే వారే లేరమ్మా’ అని చెప్తున్నారు. జగనన్న మన మధ్య లేరని బాధపడేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఒక్కమాట మటుకు ఆత్మ విశ్వాసంతో చెప్తున్నా.. ఆ గాయం మానే రోజు దగ్గరలోనే ఉంది. 

జగనన్న బయటికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరు. జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యం దిశగా మనలను నడిపిస్తారు. ఎన్ని కుట్రలు పన్నేవాళ్లు ఉన్నా.. దేవుని దయ, నాన్నగారి ఆశీస్సులు... మీ ప్రేమానురాగాలతో జగనన్న ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చేటట్టు చేస్తారు. ఇంత దూరం.. ఇన్ని జిల్లాల్లో.. ఇన్ని గ్రామాల్లో.. ఇంతమంది ప్రజలు, నాయకులు మాకు ఎంతో సహాయం చేసి పాదయాత్రను జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 

బాబు ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు
చంద్రబాబు గారు.. పాదయాత్రల పేరుతో పల్లెల చుట్టూ తిరుగుతూ డ్రామాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల కన్నీళ్లు.. కష్టాలు పట్టవు. పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు. అవసరం వస్తే అవిశ్వాసం పెడతానంటూ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఆయనకు ప్రజల మీద కంటే కుర్చీ మీదే ఆయనకు ప్రేమ ఎక్కువ. అధికారం కోసం ఏమైనా చేస్తారు. ఆయన అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని వెంటనే దించేయవచ్చు. కానీ ఆ పని చేయరు. అయితే దానికో లెక్కుంది.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

సోమవారం 70వ రోజు పాదయాత్ర ఎదులగూడెం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గూడూరు, కిష్టాపురం, కొత్తగూడెం, కొండ్రపోలు గ్రామాల మీదుగా సాగింది. కొండ్రపోలు నుంచి 0.7 కిలోమీటర్లు నడిచి కొండ్రపోలు కాల్వకు చేరుకోవడంతోనే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయినట్లు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, పాదయాత్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ప్రకటించారు. అబద్ధపు కేసులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాలుగు గోడల మధ్య బంధించటాన్ని నిరసిస్తూ వేల సంఖ్యలో ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. 

కొండ్రపోలు కాల్వ నుంచి మరో 4.5 కిలోమీటర్లు నడిచి దామరచర్ల శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 13.3 కి.మీ. నడిచారు. ఇప్పటిదాకా 1004.5 కి.మీ. యాత్ర పూర్తయింది. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, తలశిల రఘురాం, గాదె నిరంజన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, స్పురధర్‌రెడ్డి, శ్రీకళారెడ్డి, ఎర్నేని బాబు, బోయపల్లి అనంతకుమార్, సిరాజ్‌ఖాన్, ఎండీ సలీం, ఇరుగు సునీల్‌కుమార్, కేఎల్‌ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

షర్మిల రక్తదానం
పాదయాత్ర బడలికను పక్కనబెట్టి షర్మిల రక్తదానం చేశారు. మరో ప్రజాప్రస్థానం 1,000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు రెడ్‌క్రాస్ సంస్థకు రక్తదానం చేశారు. పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో సాగిన ఈ శిబిరంలో షర్మిల స్వయంగా పాల్గొని రక్తదానం చేశారు. దాదాపు 400 మిల్లీలీటర్ల రక్తమిచ్చారు. ఆమె స్పూర్తితో దాదాపు 65 మంది రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన తర్వాత షర్మిల 4.5 కి.మీ. నడిచారు.

మహిళలకు చీరల పంపిణీ..
షర్మిల 1,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదానం అనంతరం షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్ విగ్రహం వద్దే ఇళ్లు కట్టుకుంటా: సూర్యానాయక్
‘‘వైఎస్సార్ ఉన్నప్పుడు రైతుల ముఖంలో నవ్వుండేది. ఇప్పుడది లేదు. షర్మిల పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు మా భూమి దగ్గరే పూర్తి కావడం మా అదృష్టం. మా కొడుకు ఒకరు పైలట్. మరో కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. చదువు పూర్తయ్యాక కొడుకు అమెరికా వెళ్లినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడూ అంతే సంతోషం వేస్తోంది. వైఎస్సార్ విగ్ర హం వెనకాలే ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు వైఎస్సార్ నా ఇంటి ముందే ఉంటాడు’’ అని వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు కోసం తన భూమిని దానంగా ఇచ్చిన గిరిజన రైతు సూర్యానాయక్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహం పెట్టేందుకు భూమిని దానం చేసిన సూర్యానాయక్ దంపతులకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు.
Related Posts Plugin for WordPress, Blogger...