Showing posts with label cudpha. Show all posts
Showing posts with label cudpha. Show all posts

Tuesday, October 23, 2012

‘మరో ప్రజాప్రస్థానం’ 6th day

అవిశ్వాసం పెట్టరేం?
చంద్రబాబుపై షర్మిల ప్రశ్నాస్త్రాలు

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టాలి
కానీ పెట్టరు.. ఎందుకంటే జగన్ సీఎం అవుతారని భయం
సాగునీటికి వైఎస్ ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వెచ్చించారు
మీరు తొమ్మిదేళ్లలో 10 వేల కోట్లయినా ఖర్చు పెట్టారా?
మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా?
కరెంటు బిల్లు కట్టకపోతే జైల్లో పెట్టించింది మీరు కాదా?
వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా?
ప్రజల్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతుంది మీరు కాదా?
ఇంకా ఎందుకు పాదయాత్ర నాటకాలు చంద్రబాబూ?
ఆరో రోజు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కలిపి 15.1 కి.మీ. పాదయాత్ర చేసిన షర్మిల

 ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, పాదయాత్ర పేరుతో నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల విమర్శించారు. ‘ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలి. కానీ పెట్టరు. ప్రభుత్వం పడిపోతే జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయనకు భయం..’ అని దుయ్యబట్టారు. ఆరో రోజు మంగళవారం ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె పలు చోట్ల ప్రసంగించారు. ‘రైతులు కష్టాల కడలిలో ఉంటే చంద్రబాబు పాలించిన 9 ఏళ్లలో సాగునీటికి కనీసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేయలేదు. 

అదే రైతు పక్షపాతి రాజన్న 5 ఏళ్లలో రూ. 50 వేల కోట్లు నీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు. చంద్రబాబు మనసులోని మాటను ఆయనే పుస్తక రూపంలో బయటపెట్టుకున్నారు. వ్యవసాయం దండగ అని రాసుకున్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దని, ఇస్తే సోమరిపోతులు అవుతారని రాసుకున్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమని రాసుకున్నారు. ఇప్పుడు పాదయాత్రల పేరుతో ఎల్లో డ్రామాలు ఆడుతూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. కరువు కోరల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలులో పెట్టింది మీరు కాదా చంద్రబాబూ? వారింట్లో సామాను లాగేసుకుంది మీరు కాదా? మీ హయాంలో 4 వేల రైతు ఆత్మహత్యలు నిజం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతోంది మీరు కాదా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కవడం నిజం కాదా? ఇంకా ఎందుకు నాటకాల పాదయాత్రలు?’ అని షర్మిల ధ్వజమెత్తారు.

దొందూ దొందే..

‘చంద్రబాబుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమాత్రం తీసిపోలేదు. దొందూ దొందే అన్నట్టుగా చంద్రబాబు ప్రజలను గాలికి ఒదిలేయగా.. రాజశేఖరరెడ్డి తెచ్చిన పథకాలన్నింటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి తూట్లు పొడిచారు..’ అని షర్మిల విమర్శించారు. ఆరో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జిల్లా సరిహద్దులోని నేర్జాంపల్లి నుంచి ఆమె పాదయాత్ర కొనసాగించారు. నేర్జాంపల్లి దాటాక మార్గం మధ్యలో ఉన్న గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం వద్ద ఆగారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక నేత వైఎస్ అవినాష్‌రెడ్డి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు వివరాలు తెలిపారు. అనంతరం షర్మిల స్పందిస్తూ.. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి రిజర్వాయర్‌కు తెచ్చేందుకు వైఎస్ తాను చనిపోయేనాటికి 90 శాతం పనులు పూర్తి చేస్తే.. ఆయన చనిపోయిన మూడేళ్లలో ఈ ప్రభుత్వం కనీసం రాయి కూడా కదపలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 

‘ఈ పథకం పూర్తయితే చిత్తూరు జిల్లా నగరి వరకు నీళ్లొచ్చే అవకాశం ఉందట. కానీ ఆ చిత్తూరులో పుట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ పథకం పూర్తిచేయాలని ఎందుకు లేదు? అక్కడే పుట్టిన చంద్రబాబు ఈ పథకం ఎందుకు పూర్తిచేయలేదని ఎందుకు నిలదీయలేదు? రాజశేఖరరెడ్డి పుట్టిన జిల్లా అంటే అంత కక్షా? ఈ నిర్లక్ష్యం, ఈ రాక్షస పాలన కొనసాగడానికి ఇక వీల్లేదు. ఇంతమందికి అన్నంపెట్టే ఈ ప్రాజెక్టుకు అన్యాయం చేసే ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు. జగనన్న సీఎం అయిన ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తారు..’ అని హామీ ఇచ్చి అక్కడి నుంచి కదిలారు.

అధికారులను నిలదీసిన షర్మిల

ఒంటిగంటకు వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న చిత్రావతి జలాశయం వద్దకు షర్మిల చేరుకున్నారు. 9 టీఎంసీల నీరు నిండాలని, తాగునీటికి, సాగునీటికి కొరత ఉండకూడదని రాజశేఖరరెడ్డి కన్న కల కలగానే మిగిలిపోతోందని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. పులివెందులకు తాగునీటి కోసం 1.5 టీఎంసీల నీరిస్తానని చెప్పిన అధికారులు ఆ మేరకు నీళ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రాజెక్టు డీఈని షర్మిల ప్రజల తరఫున నిలదీశారు. ‘ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘పై నుంచి ఆదేశాల మేరకే మేం నడుచుకుంటున్నాం’ అని సమాధానం ఇచ్చారు. 

షర్మిల ‘అంటే చంద్రబాబు హయాంలో కంటే అధికంగా ఇప్పుడు రైతులు, ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలని ఈ ప్రభుత్వ ఉద్దేశమా?’ అని ప్రశ్నించారు. ‘సాధ్యం అయినంతవరకు వనరులను బట్టి చేస్తున్నాం’ అని అధికారి బదులిచ్చారు. ‘ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడం సరికాదు కదా. మీరు బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోతే ప్రజలకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. ఇది సరికాదు. ప్రజలకు న్యాయం చేయా లి..’ అని కోరారు. అనంతరం జలాశయం సమీపంలో భోజనానికి ఉపక్రమించారు. తిరిగి సాయంత్రం 3.45కు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా సరిహద్దులోకి చేరుకున్నారు.

Monday, October 22, 2012

5th day ‘మరో ప్రజాప్రస్థానం’

సాగుకు ప్రత్యేక బడ్జెట్
జగనన్న సీఎం కాగానే ఏర్పాటు చేస్తారు: షర్మిల
 
రైతన్న సంక్షేమమే వైఎస్సార్ సీపీ ధ్యేయం 
గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు 
పిల్లలను బడికి పంపితే తల్లి ఖాతాలో డబ్బులు వేస్తారు
చిన్నారికి రూ. 500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు ఖాతాలో వేస్తారు 
చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలదే రికార్డు
ఇప్పుడు పాదయాత్ర పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారు 
ఐదో రోజు 14 కి.మీ. నడిచిన షర్మిల.. యాత్రలో పాల్గొన్న విజయమ్మ

రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్నది రైతన్నలే. వారి సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. మార్కెట్‌లో రైతు పంటకు గిట్టుబాటు ధర లభించేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు..’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల పేర్కొన్నారు. ఐదో రోజు సోమవారం ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా పలు చోట్ల ప్రజలు తమ సమస్యలు ఏకరవు పెట్టగా ఆమె స్పందిస్తూ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అమలయ్యే ప్రణాళికలు వివరించారు. ఆదివారం రాత్రి బస చేసిన లింగాల ఐటీఐ నుంచి సోమవారం ఉదయం 10.30కు షర్మిల యాత్ర ప్రారంభించారు. 

బస స్థలానికి సమీప మండలాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతపురం నుంచి కూడా మహిళలు తరలివచ్చి షర్మిలను కలిశారు. షర్మిల లింగాల దాటాక రోడ్డు మీద ప్రజలు ఎదురేగి ‘వర్షాలు లేవు. నీళ్లు లేవు. పంటలు లేవు. పనులు లేవు. అందుకే మిమ్మల్ని కలిసేందుకు వచ్చాం..’ అని తెలిపారు. అక్కడ ఓ బాలుడు కూడా రావడంతో ‘స్కూలుకు వెళుతున్నావా చిన్నా’ అంటూ షర్మిల ప్రశ్నించగా.. ‘బతకడానికి ఏం మిగిలిందమ్మా.. పనిచేయకుంటే పూట గడవదు’ అని అనడంతో చలించిపోయిన షర్మిల ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు. ‘జగనన్న సీఎం కాగానే అందరికీ చదువు ఉచితంగా చెప్పిస్తాడు. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పిల్లాడికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లల వరకు తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాడు’ అని అభయమిచ్చారు.

చనిపోతున్నాడన్నా 108 వచ్చే పరిస్థితి లేదు...

షర్మిల లింగాల నుంచి మధ్యాహ్నం 12.20కి కర్ణపాపయ్యపల్లికి చేరుకున్నారు. అక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రైతులు కరెంటు ఉండడం లేదని, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని ఫిర్యాదు చేశారు. మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా 108 పలకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తన ఇద్దరు పిల్లలకు రాజశేఖరరెడ్డి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలబెట్టాడని ఓ నేత కార్మికుడు వివరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేత గిట్టుబాటు కాక మగ్గం అమ్మేసి కూలికి వెళుతున్నానని, వర్షాలు లేక కూలి పనికూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల 20 రోజులు ముందొస్తే బాగుండేదని, అప్పుడే వర్షం కురిసి తమ పంటలు నిలబడేవని మరో రైతు ఆదివారం కురిసిన వర్షానికి ఆనందం వ్యక్తంచేశారు. ప్రజల బాధలకు షర్మిల స్పందిస్తూ ‘డబ్బున్నోళ్లు, రాజకీయ నాయకులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేయించుకోరు. ఎందుకంటే అక్కడ మంచి వైద్యం లభించే పరిస్థితి లేదు కాబట్టి. వాళ్లంతా కార్పొరేట్ ఆసుపత్రుల్లో, అవసరమైతే విదేశాల్లో చికిత్స చేయించుకుంటారు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్క పేదవాడి ప్రాణాలూ కోల్పోకూడదని ఒక డాక్టర్‌గా రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ఏర్పాటుచేశారు. పేదవాళ్ల పిల్లలు ఒక డాక్టరో, ఒక ఇంజనీరో అయితే ఆ కుటుంబం బాగుపడుతుందని, డబ్బు లేని కారణంగా ఏ పేదవాడూ కూడా చదువుకోలేని పరిస్థితి ఉండకూడదనిఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఏర్పాటుచేశారు’ అని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ఆ పథకాలన్నింటికీ తూట్లు పొడిచిందని, చంద్రబాబు ప్రభుత్వానికి ఏమీ తీసిపోలేదని వ్యాఖ్యానించారు.

నమస్తే అన్నా.. నమస్తే అక్కా..

వెలిదండ్ల సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు భోజన విరామం అయ్యాక తిరిగి నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యలో ఉన్న లింగాల కుడికాలువను పరిశీలించారు. లింగాల బ్రాంచ్ కెనాల్ కు వైఎస్ హయాంలో 80 శాతం పనులు పూర్తయినా.. ఈ మూడేళ్లలో ఆ 20 శాతం కూడా పూర్తికాకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి నుంచి 4.35కు వెలిదండ్లకు చేరుకున్నారు. అక్కడ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధి పొందిన పలువురు సభలో ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నానని ఒకరు, ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని మరొకరు తెలిపారు. ట్రాక్టర్‌పైకి ఎక్కి షర్మిల మాట్లాడుతూ ‘నమస్తే అక్కా, నమస్తే అన్నా, నమస్తే పెద్దమ్మా, నమస్తే పెద్దయ్యా..’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. తండ్రి రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చారు.

రాజన్న ఉంటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేవారు..

ట్రాక్టర్‌పై నుంచి షర్మిల మాట్లాడుతూ.. రాజన్న ఏడు గంటలు కరెంటు ఉచితంగా ఇస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు. రాజన్న ఉంటే 9 గంటలు ఇచ్చి ఉండేవారని చెప్పారు. కరెంటు బిల్లులు కట్టలేక, అనేక సమస్యలతో చంద్రబాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర పేరుతో ఎల్లో డ్రామా ఆడుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన హయాంలో ఆత్మహత్యలదే రికార్డు అని విమర్శించారు. అక్కడి నుంచి పాదయాత్ర తిరిగి కొనసాగగా దంతెలపల్లి నుంచి మహిళలు భారీ సంఖ్యలో ఎదురేగి స్వాగతం పలికారు. కడప నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ముస్లిం సోదరులు పూల తివాచీ పరిచి సంఘీభావం తెలిపారు. మార్గం మధ్యలో వేరుశనగ రైతు ఒకరు కలిసి.. కాత కాయలేదని, మూడు ఎకరాల్లో పెట్టిన రూ.20 వేల పెట్టుబడి నేల పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు రూ. 300 చొప్పున మాత్రమే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారని వివరించారు. బ్యాంకు నుంచి తెచ్చిన రూ. 25 వేల అప్పు అలాగే ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. అక్కడి నుంచి నడుస్తుండగా కొట్యాల గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. తర్వాత అనంతపురం జిల్లా పరిధిలోని నేర్జాంపల్లిలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. ఐదో రోజు మొత్తం 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఉదయం కొంతసేపు, సాయంత్రం కొంతసేపు వైఎస్ విజయమ్మ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.

ప్రభుత్వాన్నినిద్రలేపడమే ధ్యేయం: షర్మిల

మరో ప్రజాప్రస్థానానికి రెండే ప్రధాన ధ్యేయాలున్నాయని వైఎస్ఆర్ తనయ షర్మిల అన్నారు. మొద్దు నిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం ఒకటి అని, రెండు.. మొద్దు నిద్రపోతున్న ప్రతిపక్షాన్ని నిద్రలేపడమే ధ్యేయంగా మరో ప్రజాప్రస్థానం సాగుతోందని షర్మిల అన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. సీబీఐ నుంచే తప్పించుకోవడానికే కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కయ్యారు షర్మిల అన్నారు.

Sunday, October 21, 2012

పాదయాత్రలో మహిళా ప్రభంజనం

* నాలుగో రోజు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న వనితలు 
* జోరు వర్షంలోనూ ఆగని షర్మిల.. ఆమె వెంటే జనం!

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ఒక మహిళ ప్రజాసమస్యలపై 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్రకు సాహసించడం ఓ చరిత్రాత్మక ఘట్టమైతే.. ఇదే ప్రేరణతో మహిళలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొనడం మరో విశేషం. యాత్ర నాలుగో రోజు ఆదివారమైతే మహిళలు పెద్ద సంఖ్యలో ‘మరో ప్రజాప్రస్థానం’లో పాల్గొన్నారు. 
ఆదివారం పులివెందుల నుంచి లోపట్నూతల వరకు 16.2 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో మహిళలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లి విజయమ్మ, వదిన వైఎస్ భారతిలతో కలసి షర్మిల చేసిన ఈ పాదయాత్రలో ఉదయం నుంచి భోజన విరామం వరకు దాదాపు 10 వేల మంది కదం తొక్కారు. వీరిలో దాదాపు ఏడెనిమిది వేల మంది మహిళలే!! భోజన విరామం కంటే ముందు చిన్నకుడాల క్రాస్‌రోడ్డు వద్దకు పొద్దుటూరు నుంచి దాదాపు 2,500 మంది మహిళలు తమ పిల్లలను వెంటేసుకుని వచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపారు. 

వీరిలో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ‘నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబుకు ధైర్యం రాలేదు. నాన్న ముఖ్యమంత్రి అయ్యాక పరిహారం ఇచ్చారు. రూ. 200 కోట్ల రుణాలు మాఫీ చేశారు. మరో రూ. 312 కోట్ల రుణమాఫీకి జీవో కూడా జారీ చేసినా.. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దాన్ని అమలుచేయలేదు. ఇంతకుముందు ఎవరూ చేయలేని ఆలోచన నాన్న చేశారు. చేనేత కార్మికులు మగ్గాల మీద పనిచేస్తున్నప్పుడు కంటిచూపు దెబ్బతింటుందన్న ఆవేదనతో వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. జగనన్న సీఎం అయ్యాక ఆ పెన్షన్ రూ. 1,000కి పెరుగుతుంది..’ అని పేర్కొన్నారు.

జడివానలోనూ ఆగని పాదయాత్ర..
సాయంత్రం లింగాలవైపు పాదయాత్ర సాగుతుండగా 6 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. లింగాల మూడు కిలోమీటర్లు ఉందనగా వర్షం జడివానగా మారింది. అదే వర్షంలో షర్మిల ముందుకు సాగారు. షర్మిలతోపాటే పాదయాత్రలో ఉన్న అభిమానులంతా ముందుకు సాగారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయి తోటలు కొట్టేస్తున్న తరుణంలో ఇప్పుడు వర్షాలు రావడం స్థానికులకు ఆనందాన్ని కలిగించింది. ‘వర్షం వస్తే రాజన్న వచ్చినట్టే ఉంది..’ అని స్థానికులు అనడం వినిపించింది.

మానవత్వానికి మతం లేదు

- దేవుడిపై నమ్మకం నా వ్యక్తిగతం 
- దయచేసి దీనిపై చర్చలు ఆపండి: విజయమ్మ 

 ‘నా భర్త చనిపోయారు. నా కుమారుడు జైల్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నేను నిలబడగలిగే ధైర్యం తెచ్చుకునేందుకే బైబిల్ పట్టుకుంటున్నా..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. దయచేసి ఈ అంశంపై చర్చలు ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం పులివెందులలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాజకీయ నాయకులకు, పీఠాధిపతులకు, మీడియాకు ఒకటే విజ్ఞప్తి. నేను చేతిలో పట్టుకునే బైబిల్ గురించి చర్చలు పెడుతున్నారు. దేవుడిపై నమ్మకం నా వ్యక్తిగతం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిపై పదే పదే చర్చలు ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేనేమైనా ప్రచారం చేస్తున్నానా? నా భర్త చనిపోయిన తర్వాత ధైర్యం కోసం బైబిల్ పట్టుకుంటున్నాను. అది నాకు ధైర్యాన్నిచ్చే అంశం. నాకొక ఓదార్పునిచ్చే అంశం. 

అందుకే అసెంబ్లీకి వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా పట్టుకుంటున్నా. నా భర్త చనిపోయాక, నా కొడుకును జైల్లో పెట్టాక నాకదే తోడైంది. అయితే నేను అన్ని మతాలను గౌరవిస్తా. ఏ పూజలో అయినా పాల్గొంటా. మసీదుకైనా వెళతా. మానవత్వానికి మతం లేదు. అందరి రక్తం ఒక్కటే. మనుషులను ప్రేమించడం ఒక్కటే రాజశేఖరరెడ్డి మాకు నేర్పించారు. ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు. మానవత్వానికి విలువ ఇచ్చారు. అందుకే ఆయన కోసం 700 ప్రాణత్యాగాలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి కూడా చేయని రీతిలో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు ఇచ్చారు. అర్చకుల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉండకూడదని వారికి జీతాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు..’ అని విజయమ్మ గుర్తుచేశారు. 

అమ్మ వాళ్లింట్లో అఖండ దీపం 
‘మా అమ్మవాళ్లది చాలా సనాతన, సంప్రదాయక కుటుంబం. ప్రస్తుత కలికాలంలో కూడా వారింట్లో అఖండదీపం వెలుగుతూనే ఉంటుంది. 24 గంటలూ వెలుగుతుంది. స్వాములు వచ్చినా వారింట్లోనే ఆతిథ్యం స్వీకరిస్తారు. చిన్నప్పటి నుంచి నాన్న మాకు నేర్పించింది అందరినీ గౌరవించడమే. తిరుపతిలో జగన్ బాబు ఆలయానికి వెళ్లినప్పుడు కూడా పెద్ద వివాదం చేశారు. కానీ మానవత్వం మా మతం. నా దేవుడిని నమ్మండి అని నేను చెప్పడం లేదు. దీని గురించి ఏ చర్చా అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకు, పీఠాధిపతులకు ఇదే నా విజ్ఞప్తి. ఈరోజు ఓ చానల్‌లో ఏకంగా నేను బైబిల్ పట్టుకునే అంశంపై చర్చ పెట్టి పీఠాధిపతులను పిలిచారు. నా భర్త చనిపోయారు. నా కుమారుడు జైల్లో ఉన్నాడు. అందుకే ధైర్యం కోసం బైబిల్ పట్టుకుంటున్నా. దయచేసి దీనిపై ఇంతటితో చర్చలు ఆపండి..’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

ఎలా బతికేది ? (4th day)

* ‘మరో ప్రజా ప్రస్థానం’లో షర్మిలకు సమస్యలు ఏకరువుపెట్టిన జనం
* మురికి నీళ్లే దిక్కు.. నీరైనా ఇవ్వరా అని సర్కారుకు ప్రశ్నలు
* సాగునీరు లేక పంట ఎండిపోతే.. పరిహారానికీ దిక్కులేదు
* సోయా పంటే కాదట.. మా గోడు వినే నాథుడే లేడు.. 
‘మరో ప్రజా ప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘ఉప్పు, పప్పు, పెట్రోలు, గ్యాసు, ఎరువులు.. ఒకటేంటి అన్ని రేట్లూ పెంచేశారు.. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలూ పెంచేశారు.. ఎలా బతికేది? ఊళ్లో దోమల మందు కొట్టరు.. కరెంటు ఉండదు.. రోజూ నరకం చూస్తున్నాం.. రోగాలతో చస్తున్నాం’... ఇవీ ఆదివారం ‘మరో ప్రజాప్రస్థానం’ సాగిన గ్రామాల్లో షర్మిల వద్ద జనం ఏకరువు పెట్టిన సమస్యలు!! ఎవరిని కదిలించినా ప్రభుత్వంపై మండిపడ్డారు. పత్రికల్లో రాయలేని భాషలో ప్రభుత్వాన్ని దూషించారు. తమ కష్టాలు వినే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కడగండ్లను షర్మిలకు చెప్పుకొన్నారు. తమ కన్నీళ్లు తుడవని ఈ ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు.

మనుషులు బతకలేని పరిస్థితి తెచ్చారు..
ప్రజా సమస్యలు పట్టని సర్కారు వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ కుట్ర రాజకీయాలకు నిరసనగా వైఎస్ జగన్ తరఫున సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజు ఆదివారం ఉదయం 9.45కు పులివెందుల నుంచి ప్రారంభమైంది. యాత్రలో తొలుత స్థానిక మహిళలతో షర్మిల ముచ్చటించారు. ధరలు విపరీతంగా పెరిగాయని, కుటుంబం గడిచే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఓ మహిళ మైకు తీసుకుని ‘మనుషులు బతకలేని పరిస్థితి తెచ్చారు..’ అని ఆవేదన వ్యక్తంచేశారు. 
షర్మిల స్పందిస్తూ ‘మనుషులు బతకలేని పరిస్థితి అంటే ఏంటమ్మా? రాక్షస రాజ్యం ఉందనే కదా.. రాజన్న ఉన్నప్పుడు ఒక్క పైసా పన్ను పెంచాడా? ఇప్పుడు గ్యాస్ ధర, బస్ చార్జీలు, కరెంటు చార్జీలు ఏవి చూసినా సామాన్యుడికి షాక్ కొట్టే పరిస్థితి. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. మీరంతా జగనన్న వెంట నిలవాలి’ అని పిలుపునిచ్చారు. మేమంతా జగన్ వెంటేనంటూ జనం జైకొట్టారు.

ఈ నీరు సీఎంకు పంపాలి..:
ఉదయం 10.30కు చిన్నరంగాపురం వద్దకు చేరుకోగానే జనం తాము తాగుతున్న నీటిని ఒక సీసాలో తెచ్చి షర్మిలకు చూపారు. మురికిగా ఉన్న ఆ నీటిని షర్మిల మీడియాకు చూపుతూ ‘ఇవి ఏం నీళ్లక్కా.. సాగుకా.. తాగుకా.. ఈ బాటిల్ ఒకటి ముఖ్యమంత్రికి పంపించడమ్మా తాగడానికి.. ఈ నీళ్లు ఆయన బహుశా చేతులు కడుక్కోవడానికి కూడా వాడరేమో. కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈ ప్రభుత్వం నిద్రపోతోంది..’ అని మండిపడ్డారు. అక్కడి నుంచి వస్తుండగా బ్రాహ్మణపల్లి ప్రజలు పాదయాత్రకు ఎదురేగారు. వారిలో ఒక పెద్దాయన ‘నీళ్లు లేవు. ఉపాధి లేదు. మున్సిపాలిటీలో అభివృద్ధి లేదు. రాత్రి కరెంటు లేక దోమలు కుట్టి డెంగీ జ్వరాలతో చస్తున్నాం. మున్సిపాలిటీలో పట్టించుకునేవారేలేరు. కనీసం ఈ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టలేని చేతగాని స్థితిలో ఉందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం..:
మధ్యాహ్నం 12.10కి పాదయాత్ర ఇప్పట్ల గ్రామానికి చేరుకుంది. ఇక్కడ సమీప గ్రామాల నుంచి భారీగా జనం తరలిరాగా షర్మిల వారిలో కొంతమందితో సభలో మాట్లాడించారు. పావలా వడ్డీ రావడంలేదని మహిళలు ఫిర్యాదు చేశారు. నీళ్లు లేక పంటలు పండక పిల్లలను చదివించలేకపోతున్నామని, పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ.. ‘ఇక్కడ బ్రాంచ్ కెనాల్ వైఎస్ హయాంలో 80 శాతం పూర్తయింది. కానీ మిగిలిన 20 శాతం పూర్తిచేయడానికి వీళ్లకు గడిచిన మూడు సంవత్సరాలూ సరిపోలేదు. 

అది పూర్తయి నీళ్లు వచ్చి ఉంటే పంటలు పండేవి. ప్రతి ఎకరాకు నీళ్లు అందాలన్న రాజన్న స్వప్నం నెరవేరాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి’ అని పేర్కొన్నారు. అక్కడి నుంచి తేరనామపల్లి క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర సాగుతుండగా వేల సంఖ్యలో మహిళలు వచ్చి స్వాగతం పలికారు. 2.15కు షర్మిల చిన్నకుడాలలో భోజన విరామం కోసం ఆగారు. 4.30కు తిరిగి పాదయాత్ర ప్రారంభమవగా.. పెద్దకుడాల క్రాస్‌రోడ్డు వద్ద రైతులు ఎండిన బత్తాయి చెట్లను తీసుకొచ్చి రోడ్డుపై షర్మిలకు చూపారు. ‘వైఎస్ ఉన్నప్పుడు చెట్లు ఇచ్చారు. డ్రిప్ ఇచ్చారు. ఐదేళ్లుగా పెంచుకుంటున్నాం. 

అయితే ఇప్పుడు నీళ్లు లేక చెట్లు ఎండిపోతే.. పరిహారం కోసం అధికారులను కలిశాం. కానీ ఐదేళ్ల వయసున్న చెట్లకు పరిహారం ఇవ్వరట. ఇన్నాళ్లూ మేం పెట్టుబడి పెట్టలేదా?’ అని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి పాదయాత్రలో ఉన్న విజయమ్మ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ‘కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినా తోటలు చూడలేదు. అధికారులతో మాట్లాడినా స్పందనే లేదు’ అని పేర్కొన్నారు. షర్మిల మాట్లాడుతూ ‘రాజన్న జిల్లా అని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టుంది..’ అని విమర్శించారు. అక్కడి నుంచి ముందుకు సాగగా కడప నగరానికి చెందిన వైద్యుల బృందం పాదయాత్రకు ఎదురేగి సంఘీభావం తెలిపింది.

సోయా చిక్కుడు పంట కాదా?:
లింగాల సమీపంలో రాజపుల్లారెడ్డి అనే రైతుకు చెందిన సోయాచిక్కుడు పంట వద్దకు షర్మిల వెళ్లినప్పుడు.. ‘నీళ్లు లేక ఐదెకరాల సోయాచిక్కుడు ఎండిపోయింది. కాత లేదు. రెండు బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. వైఎస్ ఉన్నప్పుడు కాలువ తీశాడు. కానీ పూర్తికాక నీళ్లు రాలేదు. లక్ష పోయింది. పరిహారం ఇవ్వమంటే సోయా చిక్కుడుకు వర్తించదని చెబుతున్నారు..’ అని ఆ రైతు ఆవేదన వ్యక్తంచేశారు.

పక్కనే ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డి స్పందిస్తూ ‘సూక్ష్మ నీటి పథకం కింద కెనాల్ పారకంలో భాగంగా 100 సంపులు నిర్మించారు. ఒక్కో సంపు కింద 100 ఎకరాల పారకం ఉంది. కెనాల్ పని పూర్తయితే 10 వేల ఎకరాలు సాగయ్యేది. కానీ 10% పనులు పూర్తిచేయడానికి కూడా వీళ్లకు సమయం సరిపోవడం లేదు..’ అని వివరించారు. ‘మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఇక మనుగడ సాగించలేదు. మనకు మంచి రోజులొస్తాయి’ అంటూ షర్మిల ముందుకు కదిలారు. 

6 గంటలకు జోరుగా వర్షం మొదలైంది. అయినప్పటికీ ఆ వర్షంలోనే తడుస్తూనే షర్మిల ముందుకుసాగారు. తర్వాత లింగాల బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ‘అన్యా యం, అధర్మం ఎంతో కాలం సాగవు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు ఆటలూ సాగవు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో.. జగనన్న బయటకు వస్తాడన్నదీ అంతే నిజం. మీ అందరి ఆశీస్సులతో రాజన్న రాజ్యం వస్తుంది..’ అని పేర్కొన్నారు. అక్కడి నుంచి రాత్రి 8.00కు లోపట్నూతల క్రాస్‌రోడ్డులోని రాత్రి బస స్థలానికి చేరుకున్నారు.

కిరణ్‌కు చంద్రబాబే ముఖ్య సలహాదారు 
చిన్నరంగాపురం నుంచి పాదయాత్ర ముందుకు సాగుతుండగా కొంతమంది వికలాంగులు షర్మిల వద్దకు వచ్చి ‘ఈ ప్రభుత్వం లక్షా 85 వేల పెన్షన్లను ఏకపక్షంగా రద్దుచేసింది. అర్హులైన పెన్షనర్లకు ఇలా కోత విధించి వారి కడుపులు కాల్చడం ఏరకమైన న్యాయం? ఈ ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుంది..’ అంటూ శాపనార్థాలు పెట్టారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రికి ముఖ్యసలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ ప్రభుత్వం ఆయన చెప్పినట్టే నడుస్తోంది. పెన్షన్లు ఇవ్వడం వంటివి ఆయనకు నచ్చదు. జగనన్న సీఎం అయ్యాక వికలాంగులకు రూ. 1,000 పెన్షన్ వస్తుంది. అది కూడా అర్హులందరికీ..’ అంటూ ముందుకు కదిలారు. అనంతరం అరటి రైతులు కలిసి ‘వైఎస్ ఉన్నప్పుడు అరటి తోటలకు 95 శాతం సబ్సిడీతో డ్రిప్‌లు ఇచ్చారు. ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోతే నష్టపరిహారం రావడం లేదు’ అని తమ సమస్యలు చెప్పుకొన్నారు

Saturday, October 20, 2012

ఉదయించే సూర్యుడిని ఆపలేరు

జగనన్నను బయటికి రాకుండా ఆపలేరు
ఆరోజు త్వరలోనే వస్తుంది 
కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘ఒక రోజు వస్తుంది. ఎలాగైతే ఎగిసే కెరటాన్ని, ఉదయించే సూర్యుడిని ఆపలేరో.. అలాగే జగనన్ననూ ఆపలేరు. ఆరోజు ఆ దేవుడే జగనన్నను బయటకు తెస్తాడు. ఆ రోజు ఈ కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఆ రోజు మన రాజన్న రాజ్యం దిశగా నడుస్తాం. రాజన్న ప్రతి ఆశయాన్ని జగనన్న నెరవేరుస్తాడు. అలాంటి రోజు కోసం ఎదురు చూద్దాం. ఆరోజున మీరంతా ఆ పార్టీలకు బుద్ధిచెప్పాలి..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకూ నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో మూడో రోజు శనివారం షర్మిల పులివెందుల బహిరంగ సభలో మాట్లాడారు. 

‘మీ రాజన్న గురించి, మీ జగనన్న గురించి నేను మీకు చెప్పాల్సిన పనిలేదు. మంచి మనసు, మాట మీద నిలబడే నైజం వారిద్దరిది. జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. నేను రాజన్న పాదాన్ని. జగనన్న విడిచిన బాణాన్ని. కాంగ్రెస్, టీడీపీలు జగనన్నను మన మధ్యకు రానివ్వలేని పరిస్థితి సృష్టించడంతో మీకు ధైర్యం చెప్పమని అన్న నన్ను పంపించాడు. 30 ఏళ్లు కాంగ్రెస్‌కు విశ్వాసంతో సేవ చేస్తే, ప్రతి పథకానికి వాళ్ల పేర్లే పెడితే వారిచ్చిన బహుమతి ఎఫ్‌ఐఆర్‌లో నాన్న పేరు చేర్చడం. నాన్న చనిపోయినప్పుడు 600 మంది గుండె ఆగితే వారిని ఓదార్చాలన్న కనీస బాధ్యత ఆ పార్టీకి గుర్తుకు రాలేదు. ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం కట్టుబడిన జగనన్నను కక్ష గట్టి జైల్లో పెట్టారు. కాంగ్రెస్‌లోనే ఉంటే సీఎం కూడా అయ్యేవారని ఆజాద్ చెబుతున్నారు. అంటే ఇది కక్ష కాక మరేంటి?’ అని ప్రశ్నించారు.

ప్రతి పథకానికి తూట్లు..

‘‘రాజన్న రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతును విస్మరించింది. విద్యార్థులకు మొండిచేయి చూపింది. ఆరోగ్యశ్రీని కట్టిపడేసింది. రాజన్న తెచ్చిన ప్రతి పథకానికి తూట్లు పొడిచింది. మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్తు చార్జీలు పెంచింది. గడిచిన సంవత్సరాలకు చెందినవాటిపై సర్‌చార్జీల పేరుతో వేల కోట్ల భారం మోపింది. ఇది అన్యాయం కదా అని నిలదీయాల్సిన టీడీపీ చోద్యం చూస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి నిద్రపోతున్నారనుకుంటే చంద్రబాబు కూడా నిద్రపోతున్నారు. వ్యవసాయం దండగ అంటారు. ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి నష్టం అంటారు. ఉచిత విద్యుత్తు వద్దంటారు. ఆనాడు రైతులు కరువుతో విలవిల్లాడుతూ వలస పోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రజల మైండ్ సెట్ మారాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కంపెనీగా మార్చి తానే సీఈవోనని అన్నారు. ప్రజల అవసరాలు అర్థం చేసుకుని వాటిని తీర్చే నాయకుడు కావాలా? లేక పాలనను వ్యాపార దృష్టితో ఆలోచించే నాయకుడు కావాలా? తన మైండ్‌సెట్ మార్చుకుని ప్రజల గురించే ఆలోచించే నాయకుడు కావాలా? ప్రజల మైండ్‌సెట్ మారాలనే హిట్లర్‌లాంటి నాయకుడు కావాలా? ఆలోచించండి’’ అని షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు.

ఊరంతా ఫ్లెక్సీలు..ట్రాక్టర్ల నిండా పూలు

పాదయాత్ర మూడో రోజు శనివారం షర్మిల మొత్తం 15 కిలోమీటర్ల మేర నడిచారు. ఉదయం 9.45కు వేములలో ప్రారంభమైన యాత్ర రోజంతా చినుకులు పడుతున్నా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో వడివడిగా ముందుకు సాగింది. పులివెందుల సభలో వర్షం కురిసినా జనం కట్టుకదల్లేదు. యాత్రలో వేముల, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లి, కోట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి షర్మిలకు స్వాగతం పలికారు. వేల్పుల గ్రామమైతే జాతరను తలపించింది. ఓ వైపు ఈటెల కవాతు, కళాకారుల ప్రదర్శనలు, 500 మంది మహిళల మంగళహారతులతో వేల్పుల గ్రామం ఘనస్వాగతం పలికింది. ఆ ఊళ్లో 1,500 మంది ఓటర్లు ఉంటే 1,300 మంది దాకా స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. 4 కిలోమీటర్ల మేర రెండు ట్రాక్టర్లతో పూలవర్షం కురిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం కోసం వేల్పుల సమీపంలోని బీసీ కాలనీ వద్ద షర్మిల విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమవగా షర్మిల సమీప కాలనీకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత పంట చేలల్లో రైతులతో మాట్లాడారు. మార్గం మధ్యలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం ఆమెను కలిసి.. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని కోరింది. బెస్తవారిపల్లిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 6.15కు పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. భారీ సంఖ్యలో జనం వెంటరాగా రాత్రి 7.20కి పులివెందుల చేరుకున్న షర్మిల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో షర్మిల, విజయమ్మ ప్రసంగించి రాత్రి 8.45కు మూడో రోజు బస ప్రాంతమైన రాజీవ్‌నగర్ కాలనీకి చేరుకున్నారు.

పాదయాత్రలో విజయమ్మ, భారతి

మూడో రోజు పాదయాత్రలో షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి పాల్గొన్నారు. వేముల నుంచి పులివెందుల వరకు పాదయాత్ర చేశారు. బెస్తవారిపల్లి నుంచి పులివెందుల బహిరంగ సభ వరకు నాలుగు కిలోమీటర్ల వరకు షర్మిల కుమార్తె కూడా పాదయాత్రలో నడిచారు.

తండ్రిని తలపిస్తూ..అన్నను గుర్తుకు తెస్తూ

యాత్రపై టీడీపీ, కాంగ్రెస్ నేతల్లో ఎడతెగని చర్చ

అదే పిలుపు.. అవే పలుకులు.. మహానేత వైఎస్‌ను అనుసరిస్తూ.. జననేత జగన్‌ను గుర్తు తెస్తూ సాగుతోన్న షర్మిల పాదయాత్ర అటు ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. షర్మిలలో వైఎస్‌ను, జగన్‌ను చూసుకుంటూ అడుగడుగునా ‘మరో ప్రజా ప్రస్థానాని’కి జనం బ్రహ్మరథం పడుతున్నారు. తమ కష్టాలు బయటకు కనిపించకుండా, ప్రజల కష్టాలను నింపాదిగా తెలుసుకుంటున్న షర్మిల.. ‘జగనన్న నాయకత్వంలో వచ్చే రాజన్న రాజ్యంలో మీ కష్టాలన్నీ తీరుస్తాం’ అని ప్రజల గుండెతట్టి ధైర్యం చెబుతున్నారు.
పంట పాడవకుండా జాగ్రత్త: పాదయాత్ర దారిలోని పొలాల్లో రైతులు కనపడినా, కూలీలు కనిపించినా షర్మిల అడుగు పొలంవైపు వెళుతోంది. ‘ఏం పెద్దమ్మా! ఏం తాతా! చెప్పన్నా! చెప్పక్కా!’ అంటూ జగన్‌లాగా పిలుస్తూ వారి కష్టాలను ఆమె స్వయంగా తెలుసుకుంటున్నారు. తనతో పాటు పార్టీ కార్యకర్తలు పొలంలోకి వెళితే పంటకు నష్టం వాటిల్లుతుందని అందరినీ రోడ్డుపైనే ఆగమని చెప్పి.. ఆమె మాత్రమే పొలంలోకి వెళ్లి మాట్లాడి వస్తున్నారు. ఈ విషయంలో పదే పదే షర్మిల చూపుతున్న జాగ్రత్త రైతన్నలపై, వారి కష్టంపై ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది.
సామాన్యుడి కష్టాలు తెలుసుకునేలా: తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలానే షర్మిల యాత్ర సాగిస్తున్నారు. మధ్యాహ్న భోజనమైనా.. రాత్రి నిద్రఅయినా రోడ్డు పక్కన వేసిన టెంటులోనే! శుక్రవారం రాత్రి వేములలో వర్షం కురిసింది. టెంటులో వర్షం నీరు కారుతుందని, బస్సులో నిద్రపోవాలని పోలీసులతో పాటు పార్టీ నేతలు ఆమెను కోరారు. ‘వర్షం పడితే ఏమవుతుంది. ఇక్కడే నిద్రపోతా!’ అని షర్మిల తెగేసి చెప్పారు. దీంతో ఇళ్లులేని ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా ప్రవర్తించారు.

సమస్యలపై దృష్టి: షర్మిల యాత్రలో ప్రజా సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో, పొలాల్లోని ప్రజలతో అధిక సమయం కేటాయిస్తూ, తక్కిన సమయంలో వేగంగా నడుస్తున్నారు. షర్మిల నడుస్తుంటే తక్కిన వారు పరుగెత్తాల్సిన స్థితి. జగన్ తప్పకుండా బయటకు వస్తారు అంటూ ఆమెకు ప్రజలు ధైర్యం చెప్తుంటే.. ‘అందరి ఆశీస్సులు జగనన్నపై ఉన్నాయి. మీ చల్లని చూపు ఉంటే త్వరలోనే జగనన్న బయటకు వస్తాడు. సీఎం అవుతాడు. మీ సమస్యలన్నీ తీరుస్తాడు’ అని షర్మిల వారికి భరోసా ఇస్తున్నారు.
పదునుగా విమర్శలు: ప్రజా సమస్యలపై షర్మిల అవగాహన, ప్రభుత్వం, ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. 

ఆమె ప్రశ్నాస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలను గుక్కతిప్పుకోనీకుండా షర్మిల ఇరుకున పెడుతున్నారు. ‘‘చంద్రబాబును ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా! పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి వచ్చావు.. సరే! ఆయన ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలోబియ్యం, మద్యపాన నిషేధం ఎత్తేసింది మీరు కాదా? ఎందుకు వాటిని ఎత్తేశారో సమాధానం చెప్పండి’ అని షర్మిల సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితి టీడీపీది. ‘వైఎస్ మా నాయకుడు అని చెబుతున్నారు. రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. మరి ఆయన మృతివార్త విని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఎందుకు తీసుకోలేదు’ అన్న ఆమె ప్రశ్నకు కాంగ్రెస్ నుంచి ఒక్కనాయకుడు సమాధానం చెప్పలేని పరిస్థితి.

కాంగ్రెస్, టీడీపీలో చర్చ: షర్మిల పాదయాత్రపై కాంగ్రెస్, టీడీపీ నేతల్లో తీవ్ర చర్చసాగుతోంది. షర్మిల పాదయాత్ర ప్రారంభించిన తర్వాత చంద్రబాబు యాత్ర ఎలాసాగుతుందనే దానికంటే, షర్మిల యాత్రపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా చర్చ సాగిస్తున్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...