Sunday, October 21, 2012

ఎలా బతికేది ? (4th day)

* ‘మరో ప్రజా ప్రస్థానం’లో షర్మిలకు సమస్యలు ఏకరువుపెట్టిన జనం
* మురికి నీళ్లే దిక్కు.. నీరైనా ఇవ్వరా అని సర్కారుకు ప్రశ్నలు
* సాగునీరు లేక పంట ఎండిపోతే.. పరిహారానికీ దిక్కులేదు
* సోయా పంటే కాదట.. మా గోడు వినే నాథుడే లేడు.. 
‘మరో ప్రజా ప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘ఉప్పు, పప్పు, పెట్రోలు, గ్యాసు, ఎరువులు.. ఒకటేంటి అన్ని రేట్లూ పెంచేశారు.. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలూ పెంచేశారు.. ఎలా బతికేది? ఊళ్లో దోమల మందు కొట్టరు.. కరెంటు ఉండదు.. రోజూ నరకం చూస్తున్నాం.. రోగాలతో చస్తున్నాం’... ఇవీ ఆదివారం ‘మరో ప్రజాప్రస్థానం’ సాగిన గ్రామాల్లో షర్మిల వద్ద జనం ఏకరువు పెట్టిన సమస్యలు!! ఎవరిని కదిలించినా ప్రభుత్వంపై మండిపడ్డారు. పత్రికల్లో రాయలేని భాషలో ప్రభుత్వాన్ని దూషించారు. తమ కష్టాలు వినే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కడగండ్లను షర్మిలకు చెప్పుకొన్నారు. తమ కన్నీళ్లు తుడవని ఈ ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు.

మనుషులు బతకలేని పరిస్థితి తెచ్చారు..
ప్రజా సమస్యలు పట్టని సర్కారు వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ కుట్ర రాజకీయాలకు నిరసనగా వైఎస్ జగన్ తరఫున సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజు ఆదివారం ఉదయం 9.45కు పులివెందుల నుంచి ప్రారంభమైంది. యాత్రలో తొలుత స్థానిక మహిళలతో షర్మిల ముచ్చటించారు. ధరలు విపరీతంగా పెరిగాయని, కుటుంబం గడిచే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. ఓ మహిళ మైకు తీసుకుని ‘మనుషులు బతకలేని పరిస్థితి తెచ్చారు..’ అని ఆవేదన వ్యక్తంచేశారు. 
షర్మిల స్పందిస్తూ ‘మనుషులు బతకలేని పరిస్థితి అంటే ఏంటమ్మా? రాక్షస రాజ్యం ఉందనే కదా.. రాజన్న ఉన్నప్పుడు ఒక్క పైసా పన్ను పెంచాడా? ఇప్పుడు గ్యాస్ ధర, బస్ చార్జీలు, కరెంటు చార్జీలు ఏవి చూసినా సామాన్యుడికి షాక్ కొట్టే పరిస్థితి. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. మీరంతా జగనన్న వెంట నిలవాలి’ అని పిలుపునిచ్చారు. మేమంతా జగన్ వెంటేనంటూ జనం జైకొట్టారు.

ఈ నీరు సీఎంకు పంపాలి..:
ఉదయం 10.30కు చిన్నరంగాపురం వద్దకు చేరుకోగానే జనం తాము తాగుతున్న నీటిని ఒక సీసాలో తెచ్చి షర్మిలకు చూపారు. మురికిగా ఉన్న ఆ నీటిని షర్మిల మీడియాకు చూపుతూ ‘ఇవి ఏం నీళ్లక్కా.. సాగుకా.. తాగుకా.. ఈ బాటిల్ ఒకటి ముఖ్యమంత్రికి పంపించడమ్మా తాగడానికి.. ఈ నీళ్లు ఆయన బహుశా చేతులు కడుక్కోవడానికి కూడా వాడరేమో. కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈ ప్రభుత్వం నిద్రపోతోంది..’ అని మండిపడ్డారు. అక్కడి నుంచి వస్తుండగా బ్రాహ్మణపల్లి ప్రజలు పాదయాత్రకు ఎదురేగారు. వారిలో ఒక పెద్దాయన ‘నీళ్లు లేవు. ఉపాధి లేదు. మున్సిపాలిటీలో అభివృద్ధి లేదు. రాత్రి కరెంటు లేక దోమలు కుట్టి డెంగీ జ్వరాలతో చస్తున్నాం. మున్సిపాలిటీలో పట్టించుకునేవారేలేరు. కనీసం ఈ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టలేని చేతగాని స్థితిలో ఉందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం..:
మధ్యాహ్నం 12.10కి పాదయాత్ర ఇప్పట్ల గ్రామానికి చేరుకుంది. ఇక్కడ సమీప గ్రామాల నుంచి భారీగా జనం తరలిరాగా షర్మిల వారిలో కొంతమందితో సభలో మాట్లాడించారు. పావలా వడ్డీ రావడంలేదని మహిళలు ఫిర్యాదు చేశారు. నీళ్లు లేక పంటలు పండక పిల్లలను చదివించలేకపోతున్నామని, పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ.. ‘ఇక్కడ బ్రాంచ్ కెనాల్ వైఎస్ హయాంలో 80 శాతం పూర్తయింది. కానీ మిగిలిన 20 శాతం పూర్తిచేయడానికి వీళ్లకు గడిచిన మూడు సంవత్సరాలూ సరిపోలేదు. 

అది పూర్తయి నీళ్లు వచ్చి ఉంటే పంటలు పండేవి. ప్రతి ఎకరాకు నీళ్లు అందాలన్న రాజన్న స్వప్నం నెరవేరాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలి’ అని పేర్కొన్నారు. అక్కడి నుంచి తేరనామపల్లి క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర సాగుతుండగా వేల సంఖ్యలో మహిళలు వచ్చి స్వాగతం పలికారు. 2.15కు షర్మిల చిన్నకుడాలలో భోజన విరామం కోసం ఆగారు. 4.30కు తిరిగి పాదయాత్ర ప్రారంభమవగా.. పెద్దకుడాల క్రాస్‌రోడ్డు వద్ద రైతులు ఎండిన బత్తాయి చెట్లను తీసుకొచ్చి రోడ్డుపై షర్మిలకు చూపారు. ‘వైఎస్ ఉన్నప్పుడు చెట్లు ఇచ్చారు. డ్రిప్ ఇచ్చారు. ఐదేళ్లుగా పెంచుకుంటున్నాం. 

అయితే ఇప్పుడు నీళ్లు లేక చెట్లు ఎండిపోతే.. పరిహారం కోసం అధికారులను కలిశాం. కానీ ఐదేళ్ల వయసున్న చెట్లకు పరిహారం ఇవ్వరట. ఇన్నాళ్లూ మేం పెట్టుబడి పెట్టలేదా?’ అని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి పాదయాత్రలో ఉన్న విజయమ్మ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ‘కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినా తోటలు చూడలేదు. అధికారులతో మాట్లాడినా స్పందనే లేదు’ అని పేర్కొన్నారు. షర్మిల మాట్లాడుతూ ‘రాజన్న జిల్లా అని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టుంది..’ అని విమర్శించారు. అక్కడి నుంచి ముందుకు సాగగా కడప నగరానికి చెందిన వైద్యుల బృందం పాదయాత్రకు ఎదురేగి సంఘీభావం తెలిపింది.

సోయా చిక్కుడు పంట కాదా?:
లింగాల సమీపంలో రాజపుల్లారెడ్డి అనే రైతుకు చెందిన సోయాచిక్కుడు పంట వద్దకు షర్మిల వెళ్లినప్పుడు.. ‘నీళ్లు లేక ఐదెకరాల సోయాచిక్కుడు ఎండిపోయింది. కాత లేదు. రెండు బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. వైఎస్ ఉన్నప్పుడు కాలువ తీశాడు. కానీ పూర్తికాక నీళ్లు రాలేదు. లక్ష పోయింది. పరిహారం ఇవ్వమంటే సోయా చిక్కుడుకు వర్తించదని చెబుతున్నారు..’ అని ఆ రైతు ఆవేదన వ్యక్తంచేశారు.

పక్కనే ఉన్న వైఎస్ అవినాశ్‌రెడ్డి స్పందిస్తూ ‘సూక్ష్మ నీటి పథకం కింద కెనాల్ పారకంలో భాగంగా 100 సంపులు నిర్మించారు. ఒక్కో సంపు కింద 100 ఎకరాల పారకం ఉంది. కెనాల్ పని పూర్తయితే 10 వేల ఎకరాలు సాగయ్యేది. కానీ 10% పనులు పూర్తిచేయడానికి కూడా వీళ్లకు సమయం సరిపోవడం లేదు..’ అని వివరించారు. ‘మానవత్వం లేని ఈ ప్రభుత్వం ఇక మనుగడ సాగించలేదు. మనకు మంచి రోజులొస్తాయి’ అంటూ షర్మిల ముందుకు కదిలారు. 

6 గంటలకు జోరుగా వర్షం మొదలైంది. అయినప్పటికీ ఆ వర్షంలోనే తడుస్తూనే షర్మిల ముందుకుసాగారు. తర్వాత లింగాల బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ‘అన్యా యం, అధర్మం ఎంతో కాలం సాగవు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు ఆటలూ సాగవు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో.. జగనన్న బయటకు వస్తాడన్నదీ అంతే నిజం. మీ అందరి ఆశీస్సులతో రాజన్న రాజ్యం వస్తుంది..’ అని పేర్కొన్నారు. అక్కడి నుంచి రాత్రి 8.00కు లోపట్నూతల క్రాస్‌రోడ్డులోని రాత్రి బస స్థలానికి చేరుకున్నారు.

కిరణ్‌కు చంద్రబాబే ముఖ్య సలహాదారు 
చిన్నరంగాపురం నుంచి పాదయాత్ర ముందుకు సాగుతుండగా కొంతమంది వికలాంగులు షర్మిల వద్దకు వచ్చి ‘ఈ ప్రభుత్వం లక్షా 85 వేల పెన్షన్లను ఏకపక్షంగా రద్దుచేసింది. అర్హులైన పెన్షనర్లకు ఇలా కోత విధించి వారి కడుపులు కాల్చడం ఏరకమైన న్యాయం? ఈ ప్రభుత్వం మట్టికొట్టుకుపోతుంది..’ అంటూ శాపనార్థాలు పెట్టారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రికి ముఖ్యసలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ ప్రభుత్వం ఆయన చెప్పినట్టే నడుస్తోంది. పెన్షన్లు ఇవ్వడం వంటివి ఆయనకు నచ్చదు. జగనన్న సీఎం అయ్యాక వికలాంగులకు రూ. 1,000 పెన్షన్ వస్తుంది. అది కూడా అర్హులందరికీ..’ అంటూ ముందుకు కదిలారు. అనంతరం అరటి రైతులు కలిసి ‘వైఎస్ ఉన్నప్పుడు అరటి తోటలకు 95 శాతం సబ్సిడీతో డ్రిప్‌లు ఇచ్చారు. ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోతే నష్టపరిహారం రావడం లేదు’ అని తమ సమస్యలు చెప్పుకొన్నారు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...