Saturday, October 20, 2012

సోనియా కళ్ళు తెరవాలి


సీబీఐ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. కాని మన సీబీఐ మాత్రం కాంగ్రెస్ ఎడల విశ్వాసంగా వ్యవహరిస్తుందని జనం అభిప్రాయం. ‘లా’ అందరికీ సమానమే. కాని దర్యాప్తు చేసేటప్పుడు మూలాలకు వెళ్ళకుండా 
2004 నుంచే ఎందుకు చేయాలి? అంతకు ముందు వారంతా కడిగిన ముత్యాలా? వారేమీ తప్పులు చేయలేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి సామాన్యుడిని ఆలోచింప చేస్తున్నాయి. అదే కాకుండా ‘‘ఇన్‌ఫర్‌మేషన్ చట్టం’’ మనకు ప్రభుత్వం కల్పించిన హక్కు. అలాంటిది ఒక సీబీఐ ఆఫీసర్ కాల్ లిస్టు బయటకు వస్తే అది నేరం ఎలా అవుతుంది? సీబీఐ అనేది మన వ్యవస్థలో ఓ భాగం. దాని పనులు అన్నీ కూడా పారదర్శకంగా ఉండాలి. అలాంటిది కాల్ లిస్టు బయటకు తీసుకువచ్చిన వారిపై కేసులు పెట్టడం సమంజసమా?

జగన్‌ను జైల్లో పెట్టి ఆయన ప్రత్యర్థులు రాక్షసానందాన్ని పొందుతున్నారనేది జగమెరిగిన సత్యం. అలా చేసినందువల్ల జగన్‌పై జనానికి జాలి, ప్రేమ కలుగుతున్నాయే తప్ప ప్రత్యర్థులకు ఏ మాత్రం లాభం కలగదని గ్రహించాలి. న్యాయం ఆలస్యంగానైనా తప్పకుండా గెలుస్తుందని ప్రజలందరి నమ్మకం. మన కోర్టులు నిజాన్ని నెమ్మదిగా బయటకు తీస్తాయనేది నిర్వివాదం. జగన్ బయటకు రావాలని అశేష ప్రజానీకం చర్చిల్లోనూ, మసీదుల్లోనూ, గుళ్ళలోనూ ప్రార్థనలు పూజలు చేయడం జగన్‌పై జనానికి ఉన్న నమ్మకం, అభిమానం.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. మన పాలకులు రాజశేఖర్‌రెడ్డిని మరిపించడానికి అనేక పిల్లిమొగ్గలు వేస్తున్నారు. ఇది చూసి జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికీ భరోసా లేదు. ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియక గంటలు, రోజులు లెక్కించుకుంటున్నారు.

నిజంగా ప్రస్తుత ప్రభుత్వానికి కాని, ముఖ్య ప్రతిపక్షానికి కాని ధైర్యం ఉంటే పంచాయితీ, మున్సిపల్ ఎలక్షన్స్‌కి సిద్ధం కావాలి. అంతేకాని పిరికితనంతో కుంటిసాకులు చెప్పి వాటిని వాయిదా వెయ్యడం ‘‘కడుపులో తలకాయ నొప్పి’’ అన్నట్లుంది. ఈ వాయిదాలు జగన్‌కు భయపడే అనే విషయం ప్రతి సామాన్యుడు గ్రహించాడు. ఇప్పటికైనా అధిష్టానం అనే పెద్దలు రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీబీఐని కట్టడి చేసి జగన్ జోలికిపోకుండా ఉంటే ‘‘చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా’’ కొన్ని సీట్లయినా గెలుచుకునే అవకాశం ఉంటుంది. లేదంటే 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్‌కు 30 సంవత్సరాల చరిత్ర గల తెలుగుదేశానికి ప్రజలు సమాధి కడతారు.

సోనియా మేడమ్ ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని ఇలాంటి రొచ్చు రాజకీయాల నుంచి బయటపడి, తన కుమారుని భవిష్యత్ తీర్చిదిద్దుకోవాలని, జగన్‌లాంటి ప్రజానాయకులను పక్కన ఉంచుకోవాలే కాని, దూరం చేసుకుని తన, తన కుటుంబ భవిష్యత్తును పాడుచేసుకోరాదని ప్రజల అభిప్రాయం.

సోనియా ఇప్పటికయినా కళ్ళు తెరిచి ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, జగన్‌ను వేదించడం 
ఆపించాలి. లేని యెడల తగిన మూల్యం చెల్లించకతప్పదు.

- అలంకార్‌రావు, మాచవరం డౌన్, విజయవాడ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...