Friday, October 26, 2012

ప్రజల మనిషి కోసం...

తెలుగునేల మీద పంచభూతాలు, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రతి ఒక్కరి గుండెలో చిరస్థాయిగా నిలిచి పోయేది వైయస్ రాజశేఖరరెడ్డి చిరునవ్వు.

భగవంతుడు తెలుగు ప్రజల కష్టాలు దూరం చేయడానికి ఇచ్చిన వరం వైయస్ చిరునవ్వు. ఆ చిరునవ్వును చెరిపేయాలని ఎంతమంది ఎన్ని వీధి నాటకాలు ఆడినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు, కుమ్మక్కు రాజకీయాలు చేసినా.. ఆ చిరునవ్వు చెరపడం అసాధ్యం. ఆ మహర్షి, ఆ మహానేత మరణం తరువాత దిక్కుతోచని దయనీయ పరిస్థితుల్లో, అంధకారమైన బడుగు బలహీనవర్గాల ప్రజల శ్రేయస్సుకోసం, ఈ రాష్ట్ర ప్రజలకు ఆ మహానేత తనయుడు వైయస్ జగన్ అదే చిరునవ్వుతో మంచి మనస్సుతో సేవ చేయడానికి ముందుకు రావడమే తప్పా?

కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనుమరుగైపోయి గుండె ఆగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తన ప్రాణం పణంగా పెట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి జీవం పోయలేదా? సదరు పార్టీ జెండాను నలుదిక్కులా రెపరెపలాడించలేదా? అందుకు ప్రతిఫలం... ఆటవికంగా, కర్కశంగా ఆ మహానేతపై ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు, అబద్ధాల కథలు, నీతిమాలిన చర్యలు...

జగనన్న పావురాలగుట్టలో మాట్లాడుతూ మహానేత మరణం తట్టుకోలేక ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇంటికి వచ్చి పలుకరిస్తానని చెప్పటమే ఆయన చేసిన నేరమా? రాజశేఖరరెడ్డి పదేపదే సోనియాగాంధి నాయకత్వం వర్థిల్లాలని, రాహుల్‌గాంధి గారిని ప్రధానిని చెయ్యాలని ఎంతో దృఢంగా సంకల్పించడం మరిచిపోయారా. కానీ రాష్ట్ర ప్రజలు ఒక విషయం గమనించవలసి వుంది. సోనియాగాంధి కుమారుడు భావి భారత ప్రధాని కావచ్చట, ఆంధ్రప్రదేశ్‌కు దశ దిశ నిర్దేశం చేసిన జనహృదయ నేత మహానేత కుమారుడు ముఖ్యమంత్రి కాకూడదట! ఇదెక్కడి న్యాయం! వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే రాష్ర్ట ప్రజలు దయచేసి రావద్దు రావద్దు మాకోసం అని అంటున్నారు.

ఎల్లో మీడియా, జెడిలు, ఈడీలు, కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా అమ్మ విజయమ్మ, భారతమ్మ, చెల్లెలు షర్మిలమ్మ సాగిస్తున్న మరో ప్రజాప్రస్థానానికి బాసటగా నిలుద్దాం. ప్రజల గుండెల్లో కొలువైన రాజన్న సాక్షిగా పాలక ప్రతిపక్ష రాబందుల పాలనకు చరమగీతం పాడుదాం. తిరిగి జగనన్న నాయకత్వంలో రాజన్న కలలు కన్న పేద ప్రజల రామరాజ్యాన్ని సాధించుకుందాం. ఇదే రాజన్నకు మనమిచ్చే నిజమైన నీరాజనం.

- కిరణ్‌కుమార్ నాగ, సంతపేట, ఒంగోలు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...