Thursday, October 18, 2012

ప్రతి ఒక్కరూ అడుగు కలపాలని చేతులు జోడించి అడుగుతున్నా...


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్
ఒక జగన్‌ను జైలులో పెట్టాలనుకుంటే కోట్లమంది జగన్‌కోసం రోడ్లు ఎక్కుతారు. ప్రజల కోసం ప్రాణాన్ని పెట్టిన వైఎస్‌ఆర్‌ను ప్రజల గుండెల్లో నుండి చెరిపివేయడం ఎవరి తరం కాదని తెలుసుకుంటారు.

ఈ రోజుకు మూడు సంవత్సరాల 46 రోజులైంది మామగారు మన మధ్యనుంచి వెళ్లిపోయి. ఆ రోజు మొదలుకొని మా కుటుంబం ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నడుస్తూ ఉంది. అయ్యో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం... ప్రజలకు, దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన వైఎస్‌ఆర్ కుటుంబమని ఆదరించాల్సిందిపోయి పగపట్టి, ఫ్యాక్షనిస్ట్‌లకన్నా అన్యాయంగా కక్ష్యకట్టి మమ్ముల్సి సా(వే)ధిస్తున్నారు. అది వారి నాగరికత, వారి మానవత్వం, వారి విజ్ఞత.


ఈ రోజు మా అత్తమ్మని చూస్తే ఎంతో బాధనిపిస్తోంది. తనకు మామ, పిల్లలే ప్రపంచం. మామగారు అంత పెద్ద నాయకునిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా అత్తమ్మ ఏ రోజూ బయటికి వచ్చిన ఆవిడ కాదు... ఎవరితో అంతగా మాట్లాడిన ఆవిడ కాదు... తనకు మామ అన్నా, పిల్లలన్నా ప్రాణం. అటువంటిది ఈ రోజు మామగారు దేవుని దగ్గర ఉన్నారు. కొడుకు- చేయని నేరానికి కుళ్లు, కుట్రలు, కుతంత్రాల మూలంగా జైలులో ఉన్నాడు. కుమార్తె- అన్న కోసం భర్తను, పిల్లలను ప్రక్కనపెట్టి రోడ్డెక్కి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి బాధ్యతలు చూసుకొనే కొడుకును జైలులో పెట్టారు. ఇంట్లోని ఆడపిల్ల బయటకు రావాల్సిన పరిస్థితి. ఇడుపులపాయకు బయలుదేరుతూ ప్రార్థన చేస్తూ అత్తమ్మ ఏడ్చారు. మామను, జగన్‌ను, షర్మిళను తలుచుకొని. 

అందరిలాగానే ఇదీ ఒక కుటుంబం. మాకూ మనసులు ఉంటాయి. ప్రేమలు ఉంటాయి. కానీ విషం లాంటి కుళ్లు, కుట్రలు మనసులో పెట్టుకొని జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకొనేవాళ్లకు తెలియదా వాళ్లు ఇబ్బంది పెడుతున్నది ఒక్క జగన్‌ను కాదు... ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక భార్యను, బిడ్డలను, 9 కోట్లకుపైగా తెలుగు ప్రజలను అని.

అయినా ఇవన్నీ జగన్ సంకల్పాన్ని సడలించలేవు. మమ్మల్ని వెనక్కి లాగలేవు. ఒక జగన్‌ను జైలులో పెట్టాలనుకుంటే కోట్లమంది జగన్‌కోసం రోడ్లు ఎక్కుతారు. ప్రజల కోసం ప్రాణాన్ని పెట్టిన వైఎస్‌ఆర్‌ను ప్రజల గుండెల్లో నుండి చెరిపివేయడం ఎవరి తరం కాదని తెలుసుకుంటారు. రాక్షస రాజు హిరణ్యకసివుడు భక్త ప్రహ్లాదుణ్ణి మహా విష్ణువును పదే పదే తలుచుకోవద్దని ఎంతగా చెప్తే అంతగా ఆ పేరు వినపడినట్లే మామగారి పేరు ఎంత చెరిపి వేయాలనుకుంటారో అంతగా అది వినబడుతుంది. జగన్‌ను ఎంత తొక్కాలని చూస్తారో అంతపైకి లేస్తాడు. ఈ ఉప్పెనలో, ఈ పోరాటంలో జగన్‌ను అన్యాయంగా వేధిస్తున్న దుర్మార్గులంతా కొట్టుకొనిపోతారు. ఇది చరిత్ర మళ్లీ మళ్లీ చెప్పే సత్యం. అణచబడిన వారికి దేవుడే శక్తినిచ్చి పైకి లేపుతాడు. అణగద్రొక్కేవారిని మట్టికరిపిస్తాడు. 

ఈ రోజు జగన్‌ను ఇబ్బందులు పెట్టేవాళ్లందరూ చరిత్రహీనులు అయ్యే రోజు ఎంతో దగ్గరలో ఉంది. దేవుని దయతో, తల్లి, తండ్రి ఆశీర్వాదంతో ప్రజల ప్రేమతో త్వరలోనే జగన్ బయటికి వస్తాడు. వైఎస్‌ఆర్ సువర్ణ యుగం తెస్తాడు. 

జగన్‌ను జైలులో పెట్టారని జగన్ తరపున ఈ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షర్మిళ ఈ సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రజా ప్రస్థానంలో దేవుడి దీవెనతో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అవ్వ, ప్రతి తాత పాదం కలిపి రావాలని చేతులు జోడించి, విజ్ఞప్తి చేస్తున్నాను

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...