Thursday, October 18, 2012

'జనాదరణ చూడలేకే జగన్ కు జైలు'





వేంపల్లె: తన కుమారుడు వైఎస్ జగన్ ను ఆదరించినట్టే తన కుమార్తెను అక్కున చేర్చుకోవాలని రాష్ట్ర ప్రజలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. షర్మిలను మరో ప్రజాప్రస్థానం పేరుతో మీ ముందుకు పంపిస్తున్నానని అన్నారు. ఇడుపులపాయ నుంచి షర్మిల చేపట్టిన పాదయాత్ర గురువారం సాయంత్రం వేంపల్లె చేరుకుంది. ఈ సందర్భంగా అశేషంగా తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. తమ కుటుంబాన్ని ఆదరించిన ప్రతి హృదయానికి నమస్కరిస్తున్నానని అన్నారు. ఉపఎన్నికల్లో ప్రజలు తమకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. 

సీబీఐ వేధింపులున్నా కేసుల గురించి ఆలోచించకుండా జగన్ నెలలో 25రోజులు ప్రజల మధ్యలోనే ఉన్నారని చెప్పారు. సాక్షులను ప్రభావితం చేస్తారని ఆయనను జైల్లో వేయలేదని, ప్రజలను ప్రభావితం చేస్తారనే భయంతోనే తన కుమారుడిని నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ బయటకు రాగానే పాదయాత్ర చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని విజయమ్మ విమర్శించారు. రెండు పార్టీలు కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. టీడీపీ ఏం మాట్లాడుతుందో కాంగ్రెస్ అదే మాట్లాడుతుందన్నారు. 

రైతుజపం చేస్తున్న చంద్రబాబుకు తన హయాంలో రైతుల ఆత్మహత్యలు కనపడలేదా అంటూ ప్రశ్నించారు. ప్రసుత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అన్నివిధాలా వేధించుకుతింటోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్నే ఉంటుందని హామీయిచ్చారు. తన బిడ్డలిద్దరిని ప్రజల చేతుల్లో పెడుతున్నానని అన్నారు. షర్మిలమ్మను ఆశీర్వదించాలని విజయమ్మ ఆకాంక్షించారు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...