Monday, February 11, 2013

ప్రజానిరసనల ఉప్పెనలో...కుటిల నాయకులు కొట్టుకుపోతారు


ఏ దేశ చరిత్ర చూసినా ఒక వ్యక్తి సమాజ శ్రేయస్సుకోసం పాటుపడే ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనక తప్పింది కాదు. ఎంతో మంది నాయకుల జీవితగాథలే ఇందుకు నిదర్శనం. జగన్ ఆస్తుల విషయంలో కేసులను ఇన్ని మలుపులు తిప్పుతూ ‘అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాలలో’ అన్న చందాన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చిన రోజు తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఆ రోజున బడుగు బలహీన వర్గాల ఆగ్రహ జ్వాలల్లో కాంగ్రెస్ బూడిద అవక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒక రకంగా జగన్‌కు మంచివే అనాలి. 

ఎందుకంటే విశేష ప్రజాదరణ పొందుతున్న వర్ధమాన నాయకుణ్ణి చూసి ఓర్వలేక కాంగ్రెసు తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టిన వైనం ప్రజలు కళ్లారా వీక్షించే ఒక అవకాశం ఇది. నిజాలు నిగ్గుతేలిన రోజున జగన్ కడిగిన ముత్యంలా జైల్లోంచి బయటికి వస్తారు. తండ్రికి తగ్గ తనయుడుగా అసంఖ్యాక ప్రజాదరణతో రామరాజ్యాన్ని తలపించేలా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. సమాజంలో మంచి మార్పుని కోరుకునే ప్రతి వ్యక్తి ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక స్వర్ణయుగం ఆవిర్భావానికి ఇవన్నీ అవరోధాలు. అయితే వీటికి సహనమే ఆయుధం. జగన్ దగ్గర ఆ ఆయుధం ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ముఖంపై చెదరని చిరునవ్వే జగన్ సహనానికి, నిజాయితీకి నిదర్శనం. 

ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల పక్షాన నిలిచిన నాయకుణ్ణి జైల్లో పెట్టి అపఖ్యాతి పాలు చేసి ఏదో సాధించేశామని అనుకునే వారికి త్వరలోనే కనువిప్పు కలుగుతుంది. కుట్రపూరిత, స్వార్ధ రాజకీయ ఎత్తుగడలకి కారణం ఎవరో ప్రజలకు తెలుస్తుంది. ఆనాడు ప్రజల నిరసనల ఉప్పెనలో కుటిల రాజకీయ నాయకులు కొట్టుకుపోతారు. నిజానికి జగన్ పదవే కావాలనుకుంటే ఏనాడో దొరికి ఉండేది. జగన్‌కి పదవీ కాంక్ష ఉండి ఉంటే ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజా జీవితం కోరుకునేవారు, సిద్ధాంతపరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు పరిస్థితులకి రాజీ పడరు.

జగన్‌ని అనుకరిస్తూ జరుగుతున్న పాదయాత్రలు కేవలం పదవుల కోసం, ప్రభుత్వ మనుగడ కోసం సాగిస్తున్న పోటీ పాదయాత్రలు. వారికి ఏనాడైనా ప్రజలు గుర్తొచ్చారా? ఇంతకాలం ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ఇంకా మౌనం వహిస్తున్నట్టు? ఎన్నో సందర్భాలలో ‘మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టండి మేము సహకరిస్తాం’ అని తెలుగు దేశం పార్టీకి వైయస్సార్ సీపీ సవాల్ విసిరినా ఎందుకు వెనుకంజ వేసినట్లు? ఇది అవినీతి ప్రభుత్వానికి కొమ్ము కాయడం కాదా? జోగి, జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు ఉప ఎన్నికల్లో పాలిత, ప్రధాన ప్రతిపక్ష పరోక్ష మైత్రికి మిగిలిందేమిటి? ఈ కుటిల రాజకీయ ఎత్తుగడలకి ప్రజలు ఉప ఎన్నికల్లో ఏనాడో బుద్ధి చెప్పారు.

అయినా నేటికీ గ్రహించలేకపోవడం శోచనీయం. ఒక పార్టీ అధినేతని అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసినా ఆ పార్టీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేది చరిత్రలో చాలా అరుదైన సంఘటన. అంటే జగన్ నిర్దోషని ప్రజలు అంగీకరిస్తున్నట్లే కదా. ‘‘దేశం ఒక గొప్ప నాయకుణ్ణి పోగొట్టుకున్నప్పుడల్లా తెలియని స్తబ్ధత నన్ను ఆవరించుకుంటుంది. ఏ సెన్స్ ఆఫ్ నేషనల్ పెరాలసిస్ స్ట్రైక్స్ మి. వాళ్ల విజన్‌ని ఫుల్‌ఫిల్ చేయాలనే పట్టుదల నాలో మొదలవుతుంది’’ అన్న వైయస్ మాటలను అక్షరాలా పుణికి పుచ్చుకుని, ఆయన విజన్‌ని నెరవేర్చగల సత్తావున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమే. 

- బొల్లోజు దుర్గాప్రసాద్, చినముషిడివాడ, విశాఖపట్నం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...