ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రను పరిశీలిస్తే - రాష్ట్ర స్థాయిలో ప్రజల హృదయాలను గెలుచుకుని దేశస్థాయి రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు. వారే... కీర్తిశేషులు ఎన్టీఆర్, వైయస్సార్. నిశితంగా చూస్తే వీరిద్దరినీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, తన పబ్బం గడుపుకోవాలని తాపత్రయపడిన ఒకే ఒక వ్యక్తి కనిపిస్తారు. ‘వారు’ ఎవరో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ ఇమేజ్‌ని దెబ్బతీయడంలో కొంతమేర విజయం సాధించినా, వైయస్సార్ విషయంలో పాపం వారి పాచికలు పారలేదు.

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి ఒక ఎరువుల కర్మాగారానికి అంగీకారం తెలిపేవరకు రాష్ట్రంలో ఏ ఒక్క ఫ్యాక్టరీ, వేలాది మందికి ఉపాధి కల్పించే ఏ స్థాయి పరిశ్రమా రాకుండా ‘వారు’ తెలివిగా అడ్డుకోగలిగారు. అప్పటికీ వారి కుటిలనీతి సగటుమనిషికి తెలియలేదు. వైయస్సార్ అధికారంలోకి రావడంతో వారి విశ్వరూపం సమాజానికి బహిర్గతం కావడం ప్రారంభమై, చివరకు పూర్తిగా విశ్వసనీయత కోల్పోవల్సి వచ్చింది. వారెంత గోబల్స్ ప్రచారం చేసినా వైయస్సార్ ముందు వారి కలలు ఫలించలేదు సరికదా వారి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. సరిగ్గా ఈ సమయంలోనే రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ వైయస్సార్ అకాల మరణం సంభవించింది. దీనితో ‘వారి’ కథ మళ్లీ మొదటికొచ్చింది.
వైయస్సార్ వారసుడిగా కాకుండా ఆయన ఆలోచనలకు ప్రతినిధిగా జగన్‌ను ప్రజలు భావిస్తున్నారని ‘వారు’ ముందు పసిగట్టలేకపోయారు. కాలం గడిచే కొద్దీ రాజశేఖరరెడ్డి విశ్వసనీయతకు, అభివృద్ధి నమూనాకు ప్రతీకగా, ప్రజాహృదయ స్పందనకు ఆలంబనగా జగన్ ప్రయాణం ప్రారంభమయింది. దీనిని పలురూపాలలో ఎదుర్కోవాలని ప్రయత్నించి, అనుకున్నది సాధించలేక నిర్వీర్యమై అంతిమ యుద్ధంగా ‘కుమ్మక్కు’ రాజకీయాలకు తెరతీశారు. వాస్తవాలకు తెరదించి, తెరచాటు రాజకీయాలకు శ్రీకారం చుట్టి జగన్‌ను జైలుపాలు చేశారు. అయినా ఉపఎన్నికల ఫలితాలు వారి గొంతెమ్మ కోర్కెలకు గూబ గుయ్యిమనే రీతిలో జవాబు ఇచ్చాయి.
లబ్ధిపొందిన నాయకులు, అధికారులు, పార్టీలు వైయస్సార్‌ను మరచిపోవచ్చు- కానీ, సాగునీటి కోసం జలయజ్ఞం, రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, మహిళా సంక్షేమం కోసం పావలావడ్డీ, అందరికీ ఆరోగ్యం, పెద్దాసుపత్రి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ, వికలాంగులకు పింఛన్లు, వృద్ధులు, వితంతువులకు ఆదరణ, ఉన్నతవిద్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులకు భరోసా, నిరుద్యోగులకు ఉపాధి, మార్కెట్లో మద్దతుధరలు... ఇలా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉందనే ఒక ధీమా కల్పించి, వారి ఆశలను నెరవేర్చి, అవసరాలు తీర్చిన వ్యక్తి వైయస్సార్. ఆయన ఆశయాలను ఆయన కుమారుడు జగన్ నెరవేరుస్తాడనే కొండంత ఆశ, నమ్మకం ప్రజలలో ఉన్నంతకాలం ఏ కుయుక్తులూ ఫలించవు. నిజంగా ‘ఎల్లోమీడియా’కు విశ్వసనీయత ఉండి ఉంటే జగన్‌కు వ్యతిరేకంగా ప్రజావెల్లువ ఉప్పెనలా రావాలి. వీరు రాసేకొద్ది జగన్‌కు ప్రజామద్దతు పెరుగుతూ ఉంది. అందుకు కోటి సంతకాల ఉద్యమమే ఓ ఉదాహరణ.
కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఎల్లో మీడియా, ఇంకా... ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిన వారంతా మహాకూటమిగా ఏర్పడి జగన్‌ని జైల్లో బంధించగలరేమోగాని ప్రజల హృదయాల నుండి ఆయన్ని దూరం చేయలేమని తెలుసుకుంటే మంచిది. వారి పరువైనా దక్కుతుంది.
- డాక్టర్ గూని నాగేశ్వరరెడ్డి, డాక్టర్ సుభాన్,
ఆత్మకూరు, అనంతపూర్ (జిల్లా)
No comments:
Post a Comment