Thursday, February 14, 2013

స్త్రీ చేత కంటతడి పెట్టించడం శుభం కాదు!



వై.యస్.రాజశేఖరరెడ్డి అకాల మరణంతో రాష్ట్రాభివృద్ధిపై ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి. వై.యస్. మరణవార్త విని కలత చెంది వందలసంఖ్యలో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను పలకరించి ఓదార్చాలన్న ఇంగితం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. తద్విరుద్ధంగా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి వుండి ఓదార్పు కార్యక్రమాన్ని చేపట్టడంతో కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఆయన్ని వేధిస్తోంది. ఆయన కుటుంబాన్ని అష్టకష్టాలు పెడుతోంది. 

గులాం నబీ ఆజాద్ గారు ఉప ఎన్నికల ప్రచారంలో ‘మా పార్టీలో జగన్ ఉండి ఉంటే కేంద్రమంత్రిని చేసే వాళ్లం. ఆ తరువాత ముఖ్యమంత్రిని కూడా చేసే వాళ్లం’ అని అనడం చూస్తే జగన్‌ను ఉద్దేశపూర్వకంగానే జైలు పాలు చేశారని తెలుస్తోంది. ఓదార్పుయాత్రలో జగన్‌పై రాష్ర్టవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజాదరణను చూసి కాంగ్రెస్ ఆయనను వ్యూహాత్మకంగానే కట్టడి చేసిందని అందరికీ అర్థమౌతూనే ఉంది. స్త్రీని పూజించడం, గౌరవించడం మన సంప్రదాయం.

సీతను బంధించి కన్నీరు పెట్టించిన రావణుడు, ద్రౌపదిని పరాభవించి ఏడిపించిన కీచకుడు చివరికి ఏమయ్యారు? ఏ స్త్రీమూర్తి అయినా కంటతడి పెట్టడం శుభం కాదు. చిరంజీవి సౌభాగ్యవతి భారతి పడుతున్న ఆవేదనను, బాధను రాష్ట్రప్రజానీకం సహానుభూతితో చూస్తోంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న మహానేత వై.యస్. కుటుంబంలోని స్త్రీలు కంటతడితో ప్రజల ముందుకు వచ్చారు. న్యాయం చేయండని అడుగుతున్నారు. జగన్‌ను ఇంతకాలం అక్రమంగా నిర్బంధించడం ఏమిటని ఆయన కుటుంబ సభ్యుల తరఫున ప్రజలూ అడుగుతున్నారు. ఇప్పటికైనా జగన్‌కు బెయిలు ఇవ్వండి. నిర్బంధం నుండి విడుదల చెయ్యండి. అప్పుడే రాష్ట్రానికి శుభం. కాంగ్రెస్‌కి శుభం. ప్రజలకు సంక్షేమం. 
- పోతిన బాబూరావు, విజయవాడ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...