Monday, February 11, 2013

ఇదా... వై.ఎస్. సేవలకు కాంగ్రెస్ ఇచ్చిన బహుమానం!


కాంగ్రెస్ పార్టీ అంటే నాకు వల్లమాలిన అభిమానం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత జనాల్లో రాజకీయ చైతన్యం వచ్చిందన్నమాట వాస్తవమే అయినా, రాష్ట్రంలో వై.యస్. రాజశేఖర్‌రెడ్డికి ఉన్న ఇమేజ్ పై ఆ ప్రభావం ఏ మాత్రం పడలేదు. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చెయ్యడానికి ఆయన చేసిన ఎనలేని కృషి నన్ను ఆకర్షించింది. గోరంట్ల నియోజకవర్గంలో 1989లో జరిగిన ఉపఎన్నికలలో వై.యస్. ఎన్నికల బాధ్యతలు భుజాన వేసుకుని అక్కడే ఉండిపోయి పోలింగ్ రోజు హౌస్ అరెస్టు కూడా అయ్యారు. 

ఆ కాస్తంత పరిచయం వల్ల నాకు వై.యస్.తో చనువు ఏర్పడింది. పార్టీ కోసం నాయకుడిలా కాకుండా సామాన్య కార్యకర్తలా తాను పని చేస్తూ తోటి కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగే ఆ అంకితభావం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. కాంగ్రెస్ అంటే వై.యస్.అన్న ముద్ర నాలో ఇంకిపోయింది. వై.యస్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కార్యాలయానికి వచ్చే ప్రతి ఉత్తరానికి స్పందించి పేదలకు చాలా సేవలందించారన్నది నగ్నసత్యం. అయితే వై.యస్. ప్రోత్సాహంతో ఎదిగిన చాలామంది నాయకులు ఇప్పుడు తమ పదవులు కోల్పోలేక వై.యస్. కుటుంబాన్ని కాకుల్లా పొడుస్తున్నారు! జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇక సీబీఐ వ్యవహారం చూస్తుంటే వై.యస్.కుటుంబంపై కక్షగట్టి సాధిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

ఇదా నేను అభిమానించిన కాంగ్రెస్ పార్టీ నా అభిమాన నాయకుడి సేవలకు తీర్చుకుంటున్న రుణం?! తండ్రి ఆశయాల సాధనకు కంకణం కట్టుకున్న జగన్‌ను ఇలాగేనా గౌరవించడం? కాంగ్రెస్ రాజకీయాలను చూస్తూంటే ఆవేదన కలుగుతోంది. జగన్ వంటి నాయకుడు తన పార్టీలో ఉన్నందుకు గర్వించాల్సింది పోయి, చెప్పుడు మాటలు విని అతడిని దూరం చేసుకున్న కాంగ్రెస్‌పార్టీ కళ్లు త్వరలోనే తెరుచుకునే రోజు వస్తుంది. ఆ రోజు కోసం నేనే కాదు, యావత్ రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది. 

- కొడేకంటి హైదర్‌వలి, గోరంట్ల, అనంతపురం జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...