Wednesday, February 20, 2013

పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకో


టీడీపీ అధినేత చంద్రబాబుపై షర్మిల మండిపాటు
ప్రజల మధ్య ఉన్నపుడేమో చేతగాని ప్రభుత్వం అని తిడతారు
అక్కడ్నుంచి వెళ్లగానే ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారతారు
అవిశ్వాసం పెట్టమంటే పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్నారు
ఇంకా ఎంతకాలం ఈ నాటకాలు..?
చిరంజీవిలాగా పార్టీని కాంగ్రెస్ హైకమాండ్‌కు అమ్ముకోండి
 ‘‘చంద్రబాబుగారూ.. మీ తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు. ఇప్పుడు అవే పల్లెల వెంట తిరుగుతూ పాదయాత్ర అంటూ డ్రామాలాడుతున్నారు. మాకు చెప్పినట్టే మీకు కూడా ప్రజలు కష్టాలు కన్నీళ్లు చెప్పుకుంటున్నారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు మీరే ఇది చేతగాని ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదని ప్రజలకు చెప్పి అక్కడ్నుంచి తప్పించుకుంటున్నారు. అక్కడ్నుంచి బయట పడగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా మారతావు. చంద్రబాబు గారు.. ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలు? మీ డ్రామాలు ఆపండి. ఇన్ని నాటకాలు వేసే బదులు చిరంజీవిలాగా మీరు కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు మీ పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకోండి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అంటూ నాలుగు వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగింది. దామరచర్ల మండల కేంద్రంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ప్రజలతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
కిరణ్, బాబు మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు..
కిరణ్‌కుమార్‌రెడ్డి గారు ప్రజలను, ప్రజా సమస్యలను ఏనాడో గాలికి వదిలేశారు. ఆయనకు ఉన్న సమయమంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పదవిని కాపాడుకోవడానికే సరిపోతోంది. చంద్రబాబు నాయుడు 8 ఏళ్ల పాలనలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచితే.. కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల పాలనలో మూడుసార్లు కరెంటు చార్జీలు పెంచారు. లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పారు. చంద్రబాబు తన హయాంలో హైటెక్ సీఎం అని పేరు తెచ్చుకోవడానికే పాకులాడారు. వ్యవసాయం దండగ అన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమన్నారు. 4 వేల మంది రైతులను పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడేమో రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఆయన కు నిజంగా రుణాలు మాఫీ చేసే ఆలోచన ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? వీళ్ల మాటల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. వైఎస్సార్ రైతన్న సంక్షేమం కోసం అనుక్షణం శ్రమించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు.

మీ అభిమానమే జగనన్నకు అండ..
నల్లగొండ జిల్లా పాదయాత్రలో నాతో పాటు కదం తొక్కిన నాయకులకు, విద్యార్థులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరున చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్నా. మీ అభిమానమే జగనన్నకు అండ. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుమ్మక్కై అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను నాలుగు గోడల మధ్య బంధించారు. మీ ప్రేమాభిమానాలతో జగనన్న జైల్లో కూడా ధైర్యంగా ఉన్నారు. ఈ కాంగ్రెస్ మీద ప్రజలెవరికీ భరోసా లేదు. ఎవరికైనా భరోసా ఉందా.. అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే! ఆయన మీదున్న అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు చీకట్లో చిదంబరాన్ని కలుస్తారు. మ్యానేజ్ చేసుకుంటారు. పైకేమో ఇది అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అంటారు. ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదని తిడతారు. మరి అలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టు అంటే మాత్రం.. ఆ పని చేయనంటాడు.

మంగళవారం 71వ రోజు పాదయాత్ర దామరచర్ల శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి దామరచర్ల మీదుగా విష్ణుపురంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం 7.5 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 1,012 కి.మీ. యాత్ర పూర్తయింది. నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాదూరి కరుణ, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తలశిల రఘురాం, గాదె నిరంజన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఇంజం నర్సిరెడ్డి, గడ్డం స్పురధర్‌రెడ్డి, శ్రీకళారెడ్డి, బోయపల్లి అనంతకుమార్, సత్యకుమారి, అల్కా శ్రావణ్‌రెడ్డి, కుంబం శ్రీనివాసరెడ్డి, పిట్టా రాంరెడ్డి, సిరాజ్‌ఖాన్, ఇరుగు సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

పాదయాత్రకు రెండు రోజుల విరామం..
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు షర్మిల రెండు రోజులపాటు విరామం ప్రకటించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నమే షర్మిల పాదయాత్రను నిలిపివేశారు. దామరచర్ల మండలంలోని విష్ణుపురంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. బుధ, గురువారాల్లో కూడా షర్మిల ఇక్కడే ఉంటారు. తిరిగి 22వ తేదీ నుంచి యాత్రను పునఃప్రారంభిస్తారు. ప్రస్తుతం షర్మిల గుంటూరు జిల్లా సరిహద్దుకు మరో 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా వాడపల్లి బ్రిడ్జి దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తారని పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ రెండు రోజులు షర్మిల పార్టీ నాయకులను, ప్రజలను కలవరు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
మంగళవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 71, కిలోమీటర్లు: 1,012

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...