Friday, February 8, 2013

గాయం కాలేదని నిరూపిస్తారా?


టీడీపీ నాయకులు తన మోకాలి గాయంపై కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారని షర్మిల విమర్శించారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు కలిసి చాలా గాలి మాటలు మాట్లాడుతున్నారు. నా కాలుకు అసలు దెబ్బనే తగల లేదట.. ఆపరేషన్ జరగనే లేదట.. నేను నాటకాలు చేస్తున్నానట. ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేయాలి. చంద్రబాబు మీద అలిపిరిలో ఒక బాంబు దాడి జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు రాజశేఖరరెడ్డి వెళ్లి అక్కడ మౌన దీక్ష చేసి దాడికి నిరసన తెలిపారు. చంద్రబాబు విమానాశ్రయంలో ఉంటే వైఎస్సార్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. 

అదీ వైఎస్సార్ సంస్కృతి. ఒక సభలో స్టేజి కూలిపోయి చంద్రబాబు కిందపడి గాయపడినప్పుడు మా పార్టీలో ఎవ్వరూ కూడా హేళన చేసి మాట్లాడ లేదు.. అదీ మా సంస్కృతి. కానీ నిజానిజాలు తెలుసుకోకుండా కూతురు వయసున్న ఒక మహిళ మీద అభాండాలు వేయడానికి వాళ్లకు సంస్కారం అడ్డం రాలేదేమో మరి’’ అని ఆమె నల్లగొండ జిల్లా మాల్ సభలో ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘టీడీపీ నేతలకు ఒక మాట చెప్తున్నా.. నా మోకాలికి గాయం కాలేదని, నాకు ఆపరేషన్ కాలేదని మీరు నిరూపిస్తే నేను మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్తాను. మరి నా కాలుకు దెబ్బ తగిలిందనీ, ఆపరేషన్ అయ్యిందని నేను నిరూపిస్తే మీరొచ్చి నా కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతారా?’’ అని ఆమె సవాలు విసిరారు.

సాక్షి నిజాలు చెప్పే ప్రజల మానసపుత్రిక: ‘సాక్షి’ ఒక విషకన్య అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘‘సాక్షి’ విషకన్యా కాదు దేవ కన్యా కాదు. ఉన్నది ఉన్నట్టు నిజాలను చెప్పే ప్రజల మానస పుత్రిక. రాష్ట్రంలో రెండు పేపర్లు, నాలుగు చానళ్లు ఎప్పుడూ చంద్రబాబు జపమే చేస్తుంటాయి. అయితే ఈ ఐదేళ్ల కాలంలో మీరు చెప్పిన ప్రతి అబద్ధాన్నీ.. అబద్ధమని ఆధారాలతో సహా ప్రజలకు చెప్పినందుకా ‘సాక్షి’ అంటే మీకు అంత భయం చంద్రబాబూ?’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘ఇంకో మాట కూడా చెప్పాలి. 

చంద్రబాబు నాయుడు గారి కథ, డెరైక్షన్, స్క్రీన్‌ప్లేతో ఈ మధ్య బీజేపీ వారు కూడా చాలా మాట్లాడుతున్నారు. నా భర్త దైవ సేవ చేస్తారనీ, వైఎస్సార్ సీపీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా వైఎస్సార్ క్రిస్టియన్ పార్టీ అని అనాలంటూ కొత్త అర్థం చెప్తున్నారు. దానికి ఒకటే సమాధానం.. ప్రేమకు మతం లేదు.. అభిమానానికి మతంలేదు.. మంచితనానికి మతంలేదు.. అందుకే వైఎస్సార్‌ను మతాలకు అతీతంగా.. పార్టీలకు అతీతంగా.. కులాలకు అతీతంగా కోట్ల కొద్దీ ప్రజలు అభిమానిస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేది పిరికిపందలే అని గుర్తుంచుకోండి!’’ అని హితవు పలికారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...