Thursday, February 7, 2013

ప్రజల దీవెనలు ఫలిస్తాయి

 ఆనాడు వైఎస్సార్‌ను చూసి కాంగ్రెస్‌కు ఓటు వేశారు కాని, ఆ పార్టీలో ఉన్న పెద్దలను చూసి కాదు. అందుకే నేడు ఆయన తనయుడిని ఇబ్బంది పెడుతుంటే చూసి ప్రతి ఒక్కరూ ఆ పార్టీని అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులంతా జగన్‌ని అణగదొక్కటానికే తమ శక్తి సామర్ధ్యాలను వినియోగిస్తున్నారు కాని, ప్రజల సమస్యలను పరిష్కరించటానికి ఏమాత్రం కృషి చేయటం లేదు. వాస్తవానికి వైఎస్సార్ చనిపోయినప్పుడే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చనిపోయింది. వైఎస్సార్ ద్వారా గెలిచిన ఈ ఎమ్మెల్యేలు, అప్పుడే సోనియాని ఎదిరించి జగన్‌ని సీఎంగా ఎన్నుకున్నట్లయితే, మన రాష్ట్రం ఇంత అథోగతిపాలై ఉండేది కాదు.

వై.ఎస్. తర్వాత అంతటి నాయకుడు జగన్ మాత్రమే. అతడు ధీశాలి. పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ఎదిరించినట్లు, సోనియాను ఎదిరించి ధైర్యంగా పదికోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా నిలబడ్డాడు. కానీ కాంగ్రెస్‌ను ఆగర్భశత్రువుగా భావించే పార్టీకి అధినేత అయిన చంద్రబాబు మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు. ఆనాడు అంబి అనే రాజు అలెగ్జాండర్‌కు లోబడి, తన రాజ్యాన్ని స్వచ్ఛందంగా ఇచ్చివేసినట్లున్నది బాబు గారి తీరు. అటు కాంగ్రెస్, ఇటు ‘దేశం’... రెండూ ప్రజాసమస్యలను విస్మరించిన ప్రస్తుత తరుణంలో ప్రజలకు కనిపిస్తున్న ఏకైక ప్రత్యామ్నాయం జగన్ మాత్రమేనన్నది జగమెరిగిన సత్యం. 

జగన్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్ర ప్రజలకు కడగండ్లు తీరుస్తారు. అధికారం ఉందనిచెప్పి నిరంకుశత్వంతో వ్యక్తులను నిర్బంధించవచ్చు కాని వ్యక్తులు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఏ శక్తీ ఏమీ చేయలేదు. నాకు తెలిసినంతవరకు వైఎస్సార్ కుటుంబానికి ఒకే ఒక సిద్ధాంతముంది. అది ‘ప్రజలందరికీ మేలు చేయటం’. ప్రజల శ్రేయస్సే వారి సిద్ధాంతం. అదే వారి ఆశయం. ఆ ఆశయ సాధనకై వెళుతూ చనిపోయిన రాజన్న కుటుంబంపై ఎల్లప్పుడూ ప్రజల దీవెన ఉంటుంది. వారి దీవెనలు ఫలించి జగన్ త్వరలోనే బయటికి వస్తారు.

- కె.షేతు, కరీంనగర్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...