Sunday, February 10, 2013

WHY NOT ON C.B. NAIDU?

ఎమ్మార్‌కు వందల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టింది చంద్రబాబే
ఐఎంజీ అనే తన బినామీ సంస్థకు 850 ఎకరాలను 
ఎకరా రూ.50 వేలకే దోచిపెట్టిన ఘనుడాయన
ఆయన అవినీతిపై కమ్యూనిస్టులైతే ఓ పుస్తకమే రాశారు
అయినా ఆయనపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించదు
కారణం చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి మేనేజ్ చేసుకుంటారు
తనపై దర్యాప్తు జరపనందుకు ప్రతిఫలంగా ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టరు
ప్రజలు నానా కష్టాలూ అనుభవిస్తున్నా కిరణ్‌కూ, చంద్రబాబుకూ పట్టనే పట్టవు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 61 కిలోమీటర్లు: 882.1

 ఎమ్మార్ కుంభకోణం, ఐఎంజీ స్కామ్ సహా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై ఎందుకు విచారణ చేయట్లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. అలాగే రోజూ తన పాదయాత్రలో ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ, తుగ్లక్ పాలన, అధ్వాన ప్రభుత్వం అని తిడుతున్న చంద్రబాబు.. ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయరెందుకని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసుల్లో దర్యాప్తు మొదలు పెట్టకుండా ఉన్నందుకుగాను చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టరని, చంద్రబాబు తమను కాపాడుతున్నందుకుగాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై దర్యాప్తు చేయించదని షర్మిల.. అన్నారు. ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 61వ రోజు శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సాగింది. మర్రిగూడెం మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ షర్మిల పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. 

బాబు జమానా.. అవినీతి ఖజానా

రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబుకు ఈ రోజు రాష్ట్రంలో, దేశ విదేశాల్లో కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా హెరిటేజ్ షాపులున్నాయి. సింగపూర్, మలేసియాలలో హోటళ్లున్నాయి. అవి ఎలా వచ్చాయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడగనైనా అడగదు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉండగా 850 ఎకరాల్ని ‘ఐఎంజీ భారత’ అనే తన బినామీ సంస్థకు కౌరు చౌకగా కట్టబెట్టారు. ఎకరా రూ.50 వేలకే దోచిపెట్టారు. అయినా ఆయనపై విచారణ చేయరు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మార్ భూములపై దర్యాపు జరుగుతోంది. కానీ ఆ భూములు అప్పనంగా దోచిపెట్టిన చంద్రబాబును మాత్రం కనీసం ప్రశ్నించనైనా ప్రశ్నించరు. ఈయన అవినీతి గురించి చాలా కథలున్నాయి. కమ్యూనిస్టులైతే ‘చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా’ అని ఒక పుస్తకమే రాశారు. అయినా సరే చంద్రబాబుపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయదు. కారణం చంద్రబాబు చీకట్లో వెళ్లి చిదంబరాన్ని కలుస్తారు. గొప్పగా మేనేజ్ చేస్తారు.

ప్రజలు కన్నీరు పెడుతున్నారు

రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో సామాన్యులు నానా కష్టాలూ పడుతున్నారు. నేను పాదయాత్రలో గ్రామాల మీదుగా సాగుతుంటే.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకొంటూ కన్నీరు పెడుతున్నారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డేమో లక్షలకొద్దీ కొత్త ఉద్యోగాలిస్తాను అని హామీలు గుప్పిస్తున్నారు. కానీ ఉన్న ఉద్యోగాలకే భరోసా లేదు. పెరిగిన ధరలతో వచ్చే కూలీ కడుపు నింపట్లేదు. పిల్లలను కూడా కూలికి పంపితేగాని ఇల్లుగడవని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు.. చదువులను మధ్యలోనే మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం పావలా వడ్డీ అంటోందిగానీ.. బ్యాంకోళ్లు రూ.2 వడ్డీ వసూలు చేస్తున్నారని మహిళలు తమ గోడు చెప్పుకొంటున్నారు. కరెంటు బిల్లులు కట్టలేక సతమతమవుతున్నారు. పెరిగిన ధరలతో కుదేలైపోతున్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టదు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకూ పట్టదు. ప్రజలు నాకు సమస్యలు చెప్పుకొంటున్నట్లే.. పాదయాత్ర చేస్తున్న ఆయనకూ తమ సమస్యలు చెప్తూనే ఉంటారు. అయితే నాకేంటీ అనుకుంటారాయన. ఆయన ‘అవసరం’ వచ్చినప్పుడు అవిశ్వాసం పెడతానంటారు. అంటే ప్రజలకు అవసరం వచ్చినప్పుడు కాదు.. తనకు అవసరం వచ్చినప్పుడు!! ఆయనకు లాభం ఉంది అనుకుంటే తప్ప ఎప్పటికీ అవిశ్వాసం పెట్టరు. అదే చంద్రబాబు నైజం.

అన్నింటా కుమ్మక్కు..

ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్షం, ఒక అధికార పక్షం ఎప్పటికీ ఒకటి కాకూడదు. కానీ మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయి. ఇలా ప్రతిపక్షం, పాలకపక్షం కుమ్మక్కు కావడమే మన రాష్ట్రానికి శాపం. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు అన్నింట్లోనూ ఈ రెండు పార్టీల నేతలూ కలిసి ఒప్పందాలు చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం.. ఎఫ్‌డీఐ మీద సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే లక్షలాది మంది నష్టపోతారని తెలిసి కూడా చంద్రబాబు కావాలని చెప్పి తన ఎంపీలను పార్లమెంటుకు వెళ్లకుండా చేసి కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నా.

కాంగ్రెస్‌తో విభేదించారు కాబట్టే కేసులు..

కాంగ్రెస్, టీడీపీల ఉమ్మడి ఎజెండా.. వాళ్ల టార్గెట్ ఒకరే.. ఆయనే జగన్. జగనన్న బయట ఉన్నప్పుడు.. ప్రజల కష్టాలు తన కష్టాలనుకొని రైతుల కోసం, విద్యార్థుల కోసం, చేనేతల కోసం, వారాల తరబడి నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. దీంతో ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకుంటున్నారని తెలిసి, ఇదే కొనసాగితే ఈ కాంగ్రెస్, టీడీపీలకు ఇక మనుగడ ఉండదనే భయంతో ఆ రెండు పార్టీలూ కుట్రలు పన్ని, కుమ్మక్కు రాజకీయాలు చేసి ఈ రోజు జగనన్నను జైలుపాలు చేశాయి. అధికారం వారి చేతిలో ఉందికదా అని సీబీఐని ఇష్టం వచ్చినట్లు వాడుకొని జగనన్నను నాలుగు గోడల మధ్య బందీని చేశాయి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలా ఆపలేరో.. జగనన్నను కూడా అలాగే ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారు.. వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ తెస్తారు.

యాత్రలో పాల్గొన్న నేతలు..

శనివారం 61వ రోజు పాదయాత్ర నల్లగొండ జిల్లా మాల్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తిరుగండ్లపల్లి, ఎరుగండ్లపల్లి, కొండూరు గ్రామాల మీదుగా మర్రిగూడ మండల కేంద్రానికి చేరింది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అక్కడే ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. శనివారం మొత్తం 14.9 కిలోమీటర్ల దూరం నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 882.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. శనివారం యాత్రలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ధర్మాన కృష్ణదాసు, కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, బీరవోలు సోమిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, పువ్వాడ అజయ్‌కుమార్, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


సవరణ: శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తలో షర్మిల శుక్రవారం నడిచిన కిలోమీటర్ల సంఖ్య 18.8గాను, మొత్తం కిలోమీటర్ల సంఖ్య 871.2గాను పొరపాటుగా ప్రచురితమైంది. శుక్రవారం ఆమె 14.8 కిలోమీటర్లు నడవగా.. మొత్తంగా 867.2 కిలోమీటర్లు నడిచారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...