Monday, December 10, 2012

కరెంటు బిల్లుకు..తాళిబొట్టు తాకట్టు


షర్మిల పాదయాత్రలో పాలమూరు పల్లెల్లో వెలుగు చూసిన దారుణం
అంతెందుకొచ్చిందని అడిగినా సమాధానం కరువు..
బిల్లు కడతావా.. జైలు కెళతావా అంటూ బెదిరింపులు
బిల్లు కోసం తాళిబొట్టు తాకట్టు పెడుతున్న మహిళలు
షర్మిల పాదయాత్ర సందర్భంగా పాలమూరు పల్లెల్లో వెలుగు చూసిన దారుణం... 
షర్మిలకు గోడు చెప్పుకొని కన్నీరు పెట్టిన బాధితులు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 53, కిలోమీటర్లు: 756.30

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ కరెంటు బిల్లు పల్లె మహిళను ఎగ‘తాళి’ చేస్తోంది. మెడలో తాళిబొట్టా.. దాన్ని కట్టిన మొగుడా.. ఏది కావాలో తేల్చుకొమ్మంటోంది. కరెంటు బిల్లు కట్టకపోతే పెనిమిటిని జైల్లో పెట్టిన చంద్రబాబు జమానా మళ్లీ కొనసాగుతోంది. పల్లెల్లో గుట్టుచప్పుడు కాకుండా సర్కారు కొనసాగిస్తున్న ఈ దాిష్టీకం షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సందర్భంగా వెలుగులోకి వచ్చింది. రెండు, మూడు బల్బులకే వేల రూపాయల బిల్లు రావడమే ఒక దారుణమైతే.. బిల్లు బకాయి కట్టాలంటూ కరెంటోళ్లు, తర్వాత పోలీసోళ్లు మూకుమ్మడిగా ఊళ్ల మీద పడి స్టేషన్లకు లాక్కెళుతున్న వైనం బయటపడింది. మొగుళ్లను పట్టుకొనిపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతుంటే.. దీక్కు తోచని మహిళలు మెడకు పసుపుతాడు కట్టుకొని, పుట్టింటి తాళిబొట్టును తాకట్టుపెట్టి కరెంటు బకాయిలు కడుతున్న దుస్థితి. మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం పాదయాత్ర సందర్భంగా కొత్తూరు మండలం ఎన్ముల నర్వ గ్రామానికి చెందిన పలువురు మహిళలు వచ్చి షర్మిలను కలసి.. తమ కరెంటు కష్టాలు చెప్పుకొన్నారు. వారి కష్టాలు వారి మాటల్లోనే..

పుస్తెలు తాకట్టు పెట్టి మొగుణ్ణి ఇడిపించుకున్నా

‘‘అమ్మా నాది రెండు గదుల ఇల్లు. రెండు కరెంటు బల్బులు, ఒక ఫ్యాను ఉంది. అర ఎకరం భూమి ఉంది. నీళ్లు లేక బీడుబెట్టినం. బోరు లేదు. బోరుకు ఇంటికి అని జెప్పి రెండు నెల్ల కింద(అక్టోబర్) కరెంటు బిల్లు రూ. 8,000 ఏసిండు. ముగ్గురు ఆడబిడ్డల తల్లిని. ఇంటాయనకు యాక్సెంటై( యాక్సిడెంటు) కాలుబోయింది. పని సేతకాదు. కొత్తూరు పోలీసోళ్లు.. కరెంటోళ్లోచ్చి నా మొగుణ్ణి పట్టుకొనిపోయి కచ్చీర్ల(పోలీస్ స్టేషన్) పెట్టిండ్రు. రూపాయి సంపాదన లేనిదాన్ని. ఏంజెయ్యను? పుస్తెలు గిరిబెట్టి(తాకట్టు) రూ. 4 వేలు కట్టి ఆయన్ను తీసుకొచ్చుకున్నా. అంత బిల్లు ఎందుకొచ్చిందో, మిగతా డబ్బు ఎట్టా కట్టాలో తెలియట్లేదు తల్లీ..’’ అంటూ సభావత్ దేవి కన్నీళ్లు పెట్టింది.

రూ.18,000 బిల్లు వచ్చిందమ్మా..

‘‘ఇంట్ల అందరం కూలి జేత్తేనే ఆ పూటకు ఎల్లుద్ది. బెత్తెడంత జాగ లేదు. మూడు రూముల ఇల్లుంది. రెండు ఫ్యాన్లు.. మూడు బల్బులు ఎలుగుతయి. ఈ ఆర్నెల్ల దినాల నుంచి రెండు.. మూడు గంటలకు మించి కరెంటు ఉంటలే.. రెణ్ణెల్ల కింద బిల్లు మాత్రం రూ. 18 వేలు వచ్చింది. కరెంటోళ్లు ఒక్కనాడన్నా ఇంటికొచ్చి మీటర్ జూసుకొని పోలే. ఇంత బిల్లు ఎందుకొచ్చింది సారూ అంటే..! నీకు బోరు మోటర్ బిల్లు ఉందని చెప్పిండ్రు. నాకు బోరు లేదు సారూ అని మొత్తుకున్నాఇనలేదు. నా భర్తను తోలుకపోయిండ్రు. సబ్‌సే్టషన్ల నిలబెట్టిండ్రు. వైఎస్సార్ కాలంజేసిన ఏడాదికి రూ. 2,500 బిల్లు కట్టమని నా మొగుణ్ణి తీసుకొని పాలమూరు జేళ్ల పెట్టిండ్రు. నాలుగు రోజులు జేలుజేసి వచ్చిండు. మల్లా ఇప్పుడు బిల్లు కట్టకపోతే జేళ్ల పెడతాం అంటే పాణం కొట్లాడింది. పోయి మూడు తులాల బంగారు తాడు కొత్తూరు బేంకిల పెట్టి దుడ్లు(డబ్బు)తీసుకొచ్చి కట్టిన’’ అంటూ లావిడియా జమ్లీ షర్మిలకు కరెంటు బిల్లు చూపించి గొల్లుమంది.

పుస్తెలు బ్యాంకులో పెట్టినా..

‘‘నేను గ్రామ సమాఖ్య అధ్యక్షురాలిని. ఇంట్ల రెండు బుగ్గలున్నయమ్మా.. ముందుగాల మీటర్ కాలిపోయింది. పెయ్యదూడను అమ్మి రూ. 1,200 కడితే కొత్త మీటర్ పెట్టిండ్రు. నెల దినాల కింద రూ. 1,800 కరెంటు బిల్లొచ్చింది. కట్టమని కరెంటోళ్లు వచ్చిండ్రు. ఇదెక్కడి పాపం .. రెన్నెళ్లు కాలేదు.. ఇంత బిల్లు ఎట్టొచ్చిందని అడిగిన. మల్లా మూడు దినాలకు పోలీసుల దారిన(పోలీసులతో కలిసి) కరెంటోళ్లు వచ్చిండ్రు. ముసలోన్ని ఠాణాకు తోలుకపోయిండ్రు. ‘బిల్లు కట్టకపోతే కేసుపెట్టి ముసలోన్ని జేళ్ల నూకుతం’ అని పోలీసోళ్లు గట్టిగన్నరు. అప్పటికప్పుడు బేంకిల(బ్యాంక్) పుస్తెలుపెట్టి రూ.1000 తెచ్చి కట్టిన’ అని వృద్ధురాలు బన్ని కన్నీటి పర్యంతమైంది.

షర్మిలకు నేతల సంఘీభావం

షర్మిల పాదయాత్రలో సోమవారం ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాద రాజు, నెలవల సుబ్రమణ్యం, నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, వాసిరెడ్డి పద్మ, బాలమణెమ్మ, శ్యాంసుందర్‌రెడ్డి, శివరాం నాయక్ తదితరులు పాల్గొని ఆమెకు సంఘీభావం తెలిపారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...