Sunday, December 16, 2012

షర్మిల కాలికి గాయం.. యాత్రకు బ్రేక్

పట్టించుకోకుండా శనివారం మధ్యాహ్నం నుంచే యాత్రకు సిద్ధమైన షర్మిల
2 రోజులైనా యాత్ర ఆపాలని సూచించిన విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి
నేడు కూడా యాత్రకు విరామం

 
రంగారెడ్డి జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న షర్మిల కాలికి బలమైన గాయం కావడంతో ఆమె యాత్ర శని, ఆదివారాలు వాయిదా పడింది. షర్మిలకు శనివారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కుడికాలు చిప్పకు బలంగా గాయం కావడంతో నొప్పి తీవ్రంగా ఉందని, కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్ ఆనంద్, డాక్టర్ హరికృష్ణ చెప్పారు. అయితే అన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి షర్మిల అంగీకరించలేదు. శనివారం మధ్యాహ్నం నుంచే పాదయాత్ర కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. అక్కడికి చేరుకున్న షర్మిల తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి.. ఆమెను వారించారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో షర్మిల అంగీకరించారు. దీంతో ఆదివారం కూడా పాదయాత్ర కొనసాగదని ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు. కాగా గాయపడిన షర్మిలను పరామర్శించేందుకు వచ్చిన మేడ్చల్ కార్యకర్తలనుద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. జగన్, షర్మిలకు వారి ఆశీస్సులు కావాలని కోరారు. 


నొప్పిని భరిస్తూ 4 కిలోమీటర్లు..

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా శుక్రవారం బీఎన్‌రెడ్డి నగర్‌లో షర్మిల ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక మీది నుంచి షర్మిల ప్రసంగించారు. అనంతరం వేదిక దిగుతుండగా ఎడమ కాలు జారి ముందుకు తూలిపడబోతూ.. షర్మిల తనను తాను నిలువరించుకున్నారు. ఈ ప్రయత్నంలో కుడి మోకాలు చిప్పకు మెట్లు బలంగా గుద్దుకున్నాయి. తీవ్ర నొప్పితో ఆమె విలవిల్లాడిపోయారు. కొద్ది నిమిషాల పాటు ఆమె అక్కడే కూర్చుండిపోయారు. డాక్టర్ హరికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. కాలు నొప్పిని లెక్క చేయకుండా ఆమె బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వరకు 4 కి.మీ. నడిచి అక్కడ బస చేశారు. ఉదయానికి నొప్పి మరింత తీవ్రమవడంతో వైద్యులు పరీక్షించి యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. శనివారం షర్మిలను పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు శోభానాగిరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆళ్ల నాని, రాజ్‌ఠాకూర్, రెహ్మాన్, దేప భాస్కర్, సురేఖ, పెన్మత్స సాంబశివరాజు, సామినేని ఉదయభాను, పుత్తా ప్రతాప్, వెల్లాల రాంమోహన్, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, అమృతాసాగర్ తదితరులున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...