Monday, December 3, 2012

ప్రభుత్వం తన తప్పు తను దిద్దుకోవాలి

ప్రభుత్వం తన తప్పు తను దిద్దుకోవాలి

మహానేత వై.ఎస్.ఆర్ తన రాజకీయ చాతుర్యంతో ప్రజల ప్రేమాభిమానాలతో కాంగ్రెస్‌ను రెండుసార్లు గెలిపించారు. తను నమ్మినవారిని మంత్రులుగా నియమించుకుని వారికి ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించారు. వారిలో ఒక మహిళ కొండా సురేఖ తప్పించి మిగిలిన ఏ ఒక్కరూ ఆ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై స్పందించలేదు. జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తాము రాఖీలు కట్టిన వైఎస్సార్‌ను అవినీతిపరుడుగా, నేరస్తుడిగా చూపే ప్రయత్నాలను అడ్డుకోలేదు. పైగా కృతజ్ఞత లేకుండా నిస్సిగ్గుగా చనిపోయిన వై.ఎస్.ను విమర్శిస్తూ ఆయన నియమించిన మంత్రులు, గెలిపించిన ఎమ్మెల్యేలు పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు. 

కోర్టుల్లో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ దుష్టచతుష్టయం కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ, ఎల్లో మీడియా బెయిల్ రానివ్వకుండా కుట్రలు పన్నుతున్నాయి. మొదటగా సీబీఐ ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుంది. వాటిమీద ‘పాడిందే పాటరా’ సామెతను తలపించేలా అటుతిప్పి ఇటు తిప్పి రాసిందే రకరకాలుగా జగన్‌కు వ్యతిరేకంగా ఎల్లో మీడియా కథనాలు ప్రచురిస్తాయి. టీడీపీవాళ్లు ఆ కథనాల మీద పెద్దపెద్ద చర్చలు మొదలుపెడతారు. ఇక కాంగ్రెస్ రకరకాల విచారణలను తెరపైకి తెస్తుంది. కోర్టు వ్యవహారాలు ప్రభావితం అయ్యే విధంగా నిరంతర కుట్ర జరిగిపోతూనే ఉంటుంది. ఇక కోర్టులో సీబీఐ ఎటువంటి ఆధారాలూ చూపకుండా జగన్ సాక్షులను బెదిరిస్తారని వాదించి బెయిల్ అడ్డుకుంటుంది. ఒక వ్యక్తి మీద ఇంత అమానవీయమైన అమానుషం ఎందుకు? ఇంత కుళ్లు, కుతంత్రాలు ఎందుకు? మనది ప్రజాస్వామ్య దేశమే కదా! మరి రాజకీయ కక్షతో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయటం ఎందుకు? జగన్‌ను అణగదొక్కాలని వీరెందుకు ఇంతగా దిగజారి ప్రజలందరూ అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు? దీనివల్ల కాంగ్రెస్, టీడీపీ బావుకున్నదేమిటి? ప్రజావ్యతిరేకత తప్ప!

అసలు వై.ఎస్. ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో క్విడ్‌ప్రోకో లేనేలేదని సాక్షాత్తూ సీఎం కిరణ్‌గారే బహిరంగంగా చెప్పారు. పరోక్షంగా జగన్‌పై ఆరోపణల్లో వాస్తవం లేదని సీఎం చెప్పకనే చెప్పినట్లయింది. మరి జగన్‌పై కేసులెందుకో ప్రజలకు మరోసారి అర్థమైంది. జగన్‌పై కుట్రలకు సామాన్య ప్రజలు సహించటంలేదని ప్రాంతాలకతీతంగా షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ఆదరణే సాక్ష్యం. ఇకనైనా ప్రభుత్వం తన తప్పు తను దిద్దుకోవాలి. జీవోల్లో తప్పులేదని మంత్రులకు న్యాయసహాయం అందిస్తున్న ప్రభుత్వం జీవోలు సక్రమమేనని కోర్టులో కౌంటర్ దాఖలు చేసి జగన్ బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజాగ్రహం చవిచూడక తప్పదు.

- జి.చంద్రశేఖర్, హైదరాబాద్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...