Wednesday, December 12, 2012

మడమ తిప్పని నేత రాజన్న


ఆంధ్రుల అభిమాన నేత కీ.శే. వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశ పెట్టిన పలు పథకాలు అద్వితీయం, ఆచరణీయం, అమోఘం. అవి ఎంతగా ప్రజల మనసును దోచాయంటే చిన్నపిల్లలు కూడా వై.ఎస్.ఆర్. భావాలు ప్రదర్శించేంతగా! 


మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. నేను హైదరాబాద్ వచ్చి ఐదేళ్లయింది. అంతకు ముందు నేను మా బంధుమిత్రులు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రులలో చేరితే వారిని పరామర్శించటానికి వెళ్లినప్పుడు అక్కడ గ్రామాల నుంచి వచ్చిన నిరుపేదలు, మధ్యతరగతి వారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించుకుని సంతోషంగా ఇళ్లకు వెళ్లడాన్నిగమనించాను. 


ఈ పథకం పేదల పాలిటి పెన్నిధి. ఎంతటి నిరుపేద అయినా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులలో వారి జబ్బులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందారు. కాని ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వై.ఎస్.ఆర్. స్వర్గస్థులైన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ పథకానికి తూట్లు పొడిచారు. నిరుపేద భవితవ్యాన్ని చెరిపేశారు. ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే అక్కడున్న రోగుల బాధలు వర్ణనాతీం.



వై.ఎస్.ఆర్. బతికుంటే ఇలా జరిగేదా? లక్షణంగా ఆపరేషన్లు చేయించుకుని ఆరోగ్యంగా ఇళ్లకు వెళ్లేవాళ్లం అంటూ అనారోగ్యంతో వచ్చిన వారు అంటున్న మాటలు ఇప్పుడు ప్రతి కార్పొరేట్ ఆస్పత్రిలోనూ వినపడుతున్నాయి. ఒక్క ఆరోగ్యశ్రీనే కాదు, ఉచిత కరెంటు, 108, ఇందిరమ్మ గృహాలు, పావలా వ డ్డీ రుణాలు... ఇలా పలు పథకాలు ప్రజలకు నేరుగా అందాయి. అందుకే ఆయన అంటే ప్రజలకు అంత అభిమానం.



మళ్లీ ఇలాంటి పథకాలు నేరుగా ప్రజలకు చేరాలంటే అది ఒక్క వై.ఎస్. జగన్ వల్లే సాధ్యపడుతుందని ప్రజల ఆకాంక్ష. వై.ఎస్. జగన్‌ను ఆరునెలల నుండి బెయిలు ఇవ్వకుండా జైలులో పెట్టినా కూడా ప్రజల మది నుండి చెదిరి పోలేదు. అది ఇంకా ఎక్కువై వై.ఎస్. జగన్ రాకకోసం, ఓదార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందుకు నిదర్శనం ప్రస్తుతం షర్మిలమ్మ జరుపుతున్న ‘మరో ప్రజాప్రస్థానం’ 
షర్మిలమ్మ ప్రజాప్రస్థానంలో ప్రజల ఆదరణ చూసైనా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగి వై.ఎస్. జగన్‌ను జైలునుండి విడుదల చేయాలి. 
- కె.ప్రభాకరరెడ్డి
దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...