Monday, December 3, 2012

సర్కారుకు మనసు లేదు (Government dosn't have mind)

మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి ఊతకర్ర లాగేస్తోంది
* పింఛన్లు పెంచండి మహాప్రభో అని వారు అడుగుతుంటే.. ఉన్న పింఛన్లు పీకేస్తోంది
* చదువుకున్న వికలాంగులకు కనీస ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది
* ఈ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందుల పాలవుతున్నారు
* సర్కారుపై అవిశ్వాసం పెట్టండి చంద్రబాబూ అంటే ఆయన వినరు..
* త్వరలోనే జగనన్న వస్తారు.. ప్రతి వికలాంగుడిని సంతోషంగా ఉంచుతారు 

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
సోమవారం యాత్ర ముగిసేనాటికి..
రోజులు: 47, కిలోమీటర్లు: 656.10
‘‘మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్. కానీ ఆయన మరణించాక వచ్చిన పాలకులు.. వారిని గాలికి వదిలేశారు. వికలాంగులకు వైఎస్సార్ అందించిన ఊతకర్రను ఈ పాలకులు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పింఛన్ డబ్బు సరిపోవడం లేదు పెంచండి మహాప్రభో అని వాళ్లు మొరపెట్టుకుంటుంటే ఉన్న పింఛన్లు ఊడపీకేస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు.

‘‘వికలాంగులు విధిని ఎదిరించి ముందుకు సాగుతున్నా.. మనసు లేని ఈ రాష్ట్ర సర్కారు వైఖరితో రోజూ చస్తూ బతుకుతున్నారు. మానవతా దృక్పథంతో వికలాంగులకు వీలైనంత సహాయం చేయాల్సిన ప్రభుత్వం వారిపట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. చదువుకున్న వాళ్లకు కనీస విద్యావకాశాలు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందుల పాలవుతున్నారు’’ అని ఆమె మండిపడ్డారు.

ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వ వైఖరికి, దానితో కలిసి కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 47వ రోజు సోమవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో సాగింది. అప్పాయపల్లిలో పలువురు వికలాంగులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చందాపూర్ తాజా మాజీ సర్పంచ్ వెంకటయ్యను ఆమె సన్మానించారు. ‘ప్రజాప్రస్థానం’లో వైఎస్సార్‌తో కలిసి పాదయాత్ర చేసిన వెంకటయ్య.. ఇప్పుడు ‘మరో ప్రజాప్రస్థానం’లోనూ షర్మిల వెంట ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడుస్తున్నారు.

నాకు రాజన్న ఇల్లే కావాలి: జయన్న శపథం
షర్మిలతో ఓబులాయిపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు జయన్న మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ ఇచ్చిన పింఛన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తీసేసిండు. ‘ఏ పనీ చేయలేనోణ్ణి.. కర్ర లేకుంటే నడవలేనోణ్ణి.. నా పింఛన్ నాకు ఇప్పించండీ’ అని మనసు సంపుకొని అధికారుల కాళ్లు పట్టుకొని గీవులాడినా.. ఒక్కడైనా నాకు సాయం గాలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘షర్మిలక్క పాదయాత్రతోటి ఒత్తావుంది అంటే వైఎస్సార్ జెండాపట్టుకున్నా.. నడుసుకుంటా ఒచ్చినా.. నాకు ఏమీ ఒద్దు. జగనన్న జైలు నుంచి బయటికి వస్తే చాలు.. మా వికలాంగులం ఆయనకు అండగా నిలబడి గెలిపించుకుంటాం.. షర్మిలక్క సెప్పినట్టు రాజన్న సర్కారు ఒత్తది. అప్పుడు ఇదే అధికారులు నా ఇంటికొచ్చి పింఛన్ ఇయ్యాలే.. ఇందిరమ్మ ఇల్లు పెట్టుకో ఇప్పిత్తామని కాంగ్రెసోల్లు సెప్తున్నారు. వాళ్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా నేను తీసుకోను. జగనన్న ముఖ్యమంత్రి గావాలే.. అన్న ఇచ్చే రాజన్న ఇల్లు తీసుకొని కట్టుకుంటా’ అని జయన్న శపథం చేశారు.

అవి పైరవీ కిరణాలు..
‘‘అక్కా.. నేను మ్యాథ్స్‌లో బీఎస్సీ పూర్తి చేశాను. నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మానేసి ఉద్యోగ ప్రయత్నం మొదలు పెట్టాను. రాజీవ్ యువకిరణాల కింద ఉద్యోగాలిస్తున్నారంటే ప్రయత్నం చేశా.. నాకు ఏ ఉద్యోగమూ రాలేదు. రికమండేషన్ ఉన్న వాళ్లకు కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు. మా నాన్న వ్యవసాయ కూలీ, నేను వికలాంగుడిని. నాకెవరు రికమండేషన్ చేస్తారు. అర్హులైన ప్రతి వ్యక్తికీఉద్యోగమని సీఎం చెప్తున్న మాటలో నిజం లేదు. అవి యువ కిరణాలు కాదు.. పైరవీ కిరణాలు’’ అంటూ పి. హన్మంతు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరం క్యాంపుతో మమ్మల్ని వంచించారు..
కిష్టాపురం గ్రామానికి చెందిన ఎ.శ్రీను మాట్లాడుతూ.. ‘‘బీఏ పూర్తి చేశాను. ఇది దగా కోరు ప్రభుత్వం. వెనుకటికి ఒక రాజు తన రాజ్యంలోని ప్రజలను భోజనాలు పెడతాను రండీ అని పిలిచి, వచ్చిన వారందరినీ వరుసబెట్టి నరికించాడట.. కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన కూడా అలానే ఉందక్కా. ఆయనకు వికలాంగులు అంటే ద్వేషం ఉన్నట్టుంది. ఆయన సదరం క్యాంపులు పెట్టాడు. వికలాంగులకు న్యాయం జరగాలంటే ఈ క్యాంపులకు రావాలే అని చెప్పారు. క్యాంపుకు వెళ్తే ఏవో పరీక్షలు చేసినారు. కొద్ది రోజులకే మాలో చాలా మంది పింఛన్లు తీసేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతనికి రెండు కాళ్లూ పూర్తిగా పని చేయవు. ఊతకర్ర సహాయం లేనిదే ఒక్క అడుగు కూడా కదలలేడు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం పింఛన్ తీసేయడమేంటంటూ షర్మిల మండిపడ్డారు.

చంద్రబాబూ అవిశ్వాసం పెట్టరేం?
వికలాంగుల బాధలు విన్నాక షర్మిల స్పందిస్తూ.. ఈ ప్రభుత్వ పాలనలో వికలాంగులతోపాటు అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందుల పాలవుతున్నారని విమర్శించారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబే ఇది అసమర్థ ప్రభుత్వం అంటారు.. తుగ్లక్ పరిపాలన అంటారు. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండకూడదని అంటారు. మరి ఈ చేతగాని ప్రభుత్వాన్ని దించవయ్యా చంద్రబాబు నాయుడు అంటే వినరు’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘మీరు(వికలాంగులు) అధైర్యపడవద్దు.. త్వరలోనే మీరు కోరుకున్నట్టుగానే జగనన్న వస్తాడు. వైఎస్సార్‌లాగే మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు చేస్తున్న డిమాండ్లలో చాలా వరకు జగనన్న ప్లీనరీలోనే ప్రకటించారు. మీ అందరినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు’’ అని భరోసా ఇచ్చారు.

తరలివచ్చిన మహిళలు..
షర్మిల సోమవారం యాత్రను దేవరకద్ర శివారు నుంచి ప్రారంభించారు. మన్నెంకొండ, ఓబులాయపల్లి, అప్పాయపల్లి, రాంరెడ్డిగూడెం, బొక్కలోనిపల్లి, చౌదరిపల్లి మీదుగా యాత్ర చేశారు. మార్గమధ్యంలో షర్మిలను చూసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపారు. దారి పొడవునా ఎదురేగి స్వాగతం పలికారు. షర్మిల.. ధర్మాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. సోమవారం 16.10 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు 656.10 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. 

యాత్రలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు కె.కె. మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఎం.సురేందర్‌రెడ్డి, లీలాధర రావు, కె. రఘునాథరెడ్డి, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, మహమ్మద్ వాజీద్, జగదీశ్వర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, నారాయణరెడ్డి, మహేశ్వరమ్మ, మధుమిత, కందూరి లక్ష్మి తదితరులు షర్మిల వెంట నడిచారు.

సర్కారుకు వికలాంగుల డిమాండ్లివీ.. (Demands of handicapped persons)
ప్రతి వికలాంగుడికి మూడేళ్లకు ఓసారి ట్రై సైకిల్ ఇవ్వాలి. చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మిగిలిన వారికి రుణాలిచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేలా ప్రోత్సహించాలి. వికలాంగులకు ప్రస్తుతం అమలు చేస్తున్న 3 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలి. అర్హులైన వికలాంగులకు పింఛన్ ఇవ్వాలి. ఇప్పుడున్న పింఛన్‌ను రూ.1,000కి పెంచాలి. ఒక్కొ క్క వికలాంగుడికి 35 కిలోల బియ్యం ఇవ్వాలి. వికలాంగుడి కుటుంబానికి ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలి. ఉచిత బస్సు పాసులు, రైలు పాసులు ఇవ్వాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...