Thursday, December 13, 2012

జనానికి దగ్గరవడమేనా జగనన్న నేరం?


జగన్, జనం కలిస్తే ఇక ప్రభంజనమేనని పాలక కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్లుంది. అందుకే జగనన్నని జనం నుంచి దూరం చేసింది. కానీ ప్రజాభిమానాన్ని మాత్రం ఆపలేకపోయింది. కారణం.. కాంగ్రెస్ కుటిల రాజకీయం ప్రజలకు తెలిసిపోవడమే. ఉదయించే సూర్యుణ్ణి అరచేతితో ఆపలేరన్నది ఎంత సత్యమో ‘హస్త’మించే కిరణాలకు ఉదయించే శక్తి లేదన్నది అంతే నిజం. 2003 వరకు దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు పెద్దదిక్కయ్యాడు రాజన్న. ఆయన లేని లోటు పూడ్చడానికి, రాజన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు జగనన్న. 

అటువంటి జగనన్న ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు? ప్రజల కష్టాలు తెలుసుకోవడం, అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాలనుకోవడం ఆయన చేసిన తప్పా? రాజన్న ఇకలేరని తెలిసి గుండెపగిలి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చడం పాపమా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నెలల తరబడి జైల్లో పెట్టడమే మన చట్టమైతే తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించి స్విస్, సింగపూర్, మలేషియా బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచాడన్న ఆరోపణలున్న చంద్రబాబును ఎన్నేళ్లు జైల్లో పెట్టాలి? డిఎల్‌ఎఫ్ కుంభకోణంలో ‘హస్త’ముందన్న ఆరోపణలు ఎదుర్కొన్న సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను ఎందుకు జైలుకు పంపలేదు? 

లక్షలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, 2జి, బొగ్గు లాంటి కుంభకోణాల్లో ఇరుక్కున్న కేంద్రమంత్రులను ఎందుకు జైల్లో పెట్టలేదు? అయినవారు అవినీతిపరులైనా అక్కువ చేర్చుకుని అందలమెక్కించడం, కానివారు నీతిమంతులైనా జైల్లో పెట్టించడం... ఇదేనా కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి అర్థం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా తప్పుడు పనులు చేసిన నాయకులు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే, ప్రజాసేవే పరమావధిగా అహర్నిశలు కృషిచేసిన జగనన్నను మాత్రం నాలుగు గోడల మధ్య బంధించడం ఎంతవరకు సమంజసం? ఒక్కటి మాత్రం నిజం.. ప్రజలు అంతా గమనిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నాయకులకు ప్రజలే గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది. వారంతా రాజన్న రాజ్యంకోసం, 2014 ఎన్నికలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

- ఎం.ఎస్.కె. సాగర్, హైదరాబాద్

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...