జగన్.... జగన్.... ఈ పేరు మీడియాలో వినపడని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ‘నేల ఈనిందా’ అన్నట్లు జగన్ కుటుంబ సభ్యుల సభలకు హాజరవుతున్న ప్రజానీకాన్ని మార్పుకి సూచికగా మేధావులు భావిస్తున్నారు. మరి ఎందుకు ఈ జనం ఇలా పోటెత్తి స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని రాజకీయపక్షాలనూ ఆలోచింపజేస్తున్న మౌలికప్రశ్న ఇది. నేరం చేశాడని ఆరోపణలు చేయబడి జైలు జీవితం గడుపుతున్న ఒక వ్యక్తి కోసం జనం చల్లారని ఆశతో ఎందుకు చూస్తున్నారు? ఇదీ ముఖ్యమైన ప్రశ్నే. ఈ ప్రశ్నలకు జవాబు- జగన్ ‘విశ్వసనీయత’. మాటకోసం మడమ తిప్పని, ప్రాణాలు లెక్కచేయని రాజశేఖరుడి వారసత్వంగా పుణికిపుచ్చుకున్న ‘విశ్వసనీయత’కు ప్రతిరూపం జగన్. జనం దానిని ఇష్టపడుతున్నారు.

జగన్మోహనరెడ్డి అక్రమంగా సంపాదించాడని ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలు వాటిని రుజువుచేయలేక, ఒక్క ఆధారాన్నీ చూపలేక నానా తిప్పలూ పడుతున్నారన్నది జగమెరిగిన వాస్తవం. తన తండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలో ఉండికూడా, దాన్ని దిగమింగి, తన తండ్రి వారసత్వాన్ని, ఆశయాన్ని కొనసాగించడానికి కంకణబద్ధుడైన వాడు అధిష్టానికి అంటరానివాడయ్యాడు. తన తండ్రి రుణం తీర్చుకుంటుంటే అధిష్ఠానానికి ఎందుకు బాధ? ఒకటే కారణం ‘మరో వై.యస్’లా తయారై జనం చేత ‘యస్’ అనిపించుకుని రాష్ట్రానికి జలయజ్ఞం నిజంగానే పూర్తి చేసి ‘అపర భగీరథుడు’ అని సార్థక నామధేయం సాధించుకుంటాడనే బెంగ. అందరినీ ఆకట్టుకుంటాడనే చింత. నిజంగా అధిష్టానమే అసూయపడి జైలులో బంధించబడినాడంటే జగన్ సామాన్యవ్యక్తి కాడు. ప్రజల గుండెల్లో గూడుకట్టున్న ఆత్మబంధువు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పనికి ఆహార పథకాన్ని పచ్చచొక్కాలకు పందేరం చేసిన సంగతిని ప్రజలు మర్చిపోలేదు. ఎన్నో వేల టన్నుల బియ్యాన్ని తన కార్యకర్తలకు ఎర వేసినందుకు ఈయనగారికి లోపల వేసి ఎన్ని సంవత్సరాలు విచారణ జరపాలి?
ప్రజల కళ్లముందుంది ‘జగనన్న’ పాలనే. జనం తపిస్తుంది, జపిస్తుందీ ‘జగన్’ కోసమే. జగన్ తపిస్తున్నదీ, జపిస్తున్నదీ ‘జనం’ కోసమే. ఇది నిజం ముమ్మాటికీ కాబోయే సిఎం ‘జగన్, జగన్’
- ఓరుగంటి శేషశయనారెడ్డి, హైదరాబాద్
No comments:
Post a Comment