Wednesday, November 7, 2012

రాజన్న ఉంటే 9 గంటల కరెంటొచ్చేది.....

- 30 కిలోల బియ్యం వచ్చేవి: షర్మిల
- ఈ ప్రభుత్వం 2 గంటల కరెంటు కూడా ఇవ్వకుండా కష్టాలు పెడుతోంది రూపాయికే కిలో బియ్యం అంటూ గారడీ చేస్తోంది
- రూ.20కి 20 కిలోలిచ్చి.. మిగతా 10 కిలోలు రూ.10 చొప్పున కొనుక్కోమంటోంది
- వడ్డీ లేని రుణం ఒక బూటకం.. సీఎం 15 లక్షల ఉద్యోగాలన్నారు.. ఎక్కడ?
- ఈ ప్రభుత్వం వైఎస్ పథకాలను తుంగలో తొక్కింది... ఆయనకు వెన్నుపోటు పొడిచింది
- ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు దానితోనే కుమ్మక్కయ్యారు
- షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’: మంగళవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 20, కిలోమీటర్లు: 258.80


‘‘రాజశేఖరరెడ్డి మంచి మనసును మీరు(ప్రజలు) చూసి, పనితీరు గమనించి మళ్లీ ఆయనే సీఎం కావాలని ఆశీర్వదించారు. అప్పుడు వైఎస్ రెండే వాగ్దానాలు చేశారు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని, కుటుంబానికి రూ.2కు కిలో చొప్పున 30 కిలోల బియ్యం ఇస్తామని వాగ్దానం చేశారు. రాజన్న బతికి ఉంటే ఈ రెండు హామీలూ అమలయ్యేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కనీసం 2 గంటలు కూడా కరెంటు ఇవ్వకుండా కష్టాలు పెడుతోంది. కొనాల్సిన సమయానికి కరెంటు కొనుగోలు చేయకుండా విద్యుత్ సంక్షోభానికి కారణమైంది. మరోవైపు కిలో బియ్యం రూపాయికే అంటూ గారడీ చేస్తోంది. రూ.20కు 20 కిలోలు ఇచ్చి.. మిగిలిన 10 కిలోలు.. కిలో రూ.10 చొప్పున కొనుక్కోమంటోంది. అంటే 30 కిలోలకు 120 అవుతోంది. అదీ గారడీ అంటే. రాజన్న ఉంటే రూ.60కే 30 కిలోలు వచ్చేవి..’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ వైఖరికి నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 20వ రోజు మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పలుచోట్ల ఆమె పర్యటించారు. కొనకొండ్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
అవిశ్వాసం ఎందుకు పెట్టరు?: ‘‘చంద్రబాబు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడవడమేకాదు.. ఎన్టీఆర్ వాగ్దానాలైన రూ. 2 కిలో బియ్యం పథకం, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కారు. ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త నాటకం ఆడుతున్నారు. అసలు ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టకుండా దానితోనే కుమ్మక్కయ్యారు’’ అని షర్మిల విమర్శించారు.

‘‘చంద్రబాబు హయాంలో గ్యాస్ ధర రూ. 145 నుంచి రూ. 305కు పెరిగింది. కానీ వైఎస్ ఐదేళ్లలో రూ.305కు పైన ఒక్క రూపాయీ పెంచలేదు. ఇప్పుడు 6 సిలిండర్లు దాటితే రూ. 1,000కు కొనుక్కోవాలట. అంటే నెలకు ఒకటి చొప్పున వాడే కుటుంబం ఒక్కో సిలిండర్‌కు సగటున రూ. 950 వెచ్చించాల్సి వస్తుంది. రూ.305 ఎక్కడ? రూ.950 ఎక్కడ?..’’ అని ఆమె మండిపడ్డారు.

15 లక్షల ఉద్యోగాలేవో చెప్పండి: ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. కనీసం వాటిలో 10 శాతం ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో వివరాలు చెప్పమంటే బయటికి చెప్పరు. వడ్డీ లేని రుణాలని ఈ ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ ఇదొక బూటకం. ఈ సర్కారులో పెట్రోలు, డీజిల్, కరెంటు, నిత్యావసర వస్తువులు.. ఇలా అన్నింటి ధరలూ పెంచేశారు. కరెంటైతే రెండు మూడు గంటలు కూడా ఇవ్వరు కానీ, బిల్లులు చూస్తే షాక్ కొడుతోంది. సర్‌చార్జీలు అంటారు.. మరో చార్జీ అంటారు.. ఇంతలా వేధిస్తుంటే ప్రజలు ఎలా బతకాలి?’’ అని షర్మిల నిలదీశారు.

‘‘ఇంతకుముందు ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది. ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది. ఇప్పుడు 108 ఎక్కడా కనిపించడం లేదు. వైఎస్ చేసిన ప్రతి ప్రమాణాన్ని ఈ సర్కారు తుంగలో తొక్కింది. వైఎస్‌కు వెన్నుపోటు పొడిచింది. 30 ఏళ్లపాటు సేవచేస్తే, ప్రతి పథకానికి రాజీవ్ అనో, ఇందిర అనో పేరు పెడితే వాళ్లిచ్చిన బహుమానం ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును దోషిగా చేర్చడం’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక 668 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను ఓదార్చాలని ఈ కాంగ్రెస్‌కు అనిపించలేదన్నారు. ‘‘చనిపోయిన వారు కాంగ్రెస్ వాళ్లే కదా. కాంగ్రెస్‌కు ఓటేసిన వారే కదా. కానీ ఆ పార్టీ నేతలకు వారిని ఆదుకోవాలని అనిపించలేదు. ఒక్క జగనన్నే వారిని ఓదార్చేందుకు బయలుదేరాడు. అందుకు కక్ష కట్టి నీచమైన కుట్రకు దిగారు..’’ అని షర్మిల ధ్వజమెత్తారు.

15 నెలలుగా పెన్షన్ లేదమ్మా..

పాదయాత్రలో భాగంగా గూళ్యపాలెంలో షర్మిల స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించారు. ఈ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయామన్నారు. ఆల్లె బాషా అనే వికలాంగుడికి 2011 జులై వరకు పెన్షన్ వచ్చిందని, కానీ 15 నెలలుగా పెన్షన్ రాలేదని ఆయన భార్య మొరపెట్టుకున్నారు. పెన్షన్‌కు సంబంధించిన ఖాతా పుస్తకం చూపించి.. తమకు పెన్షనే ఎంతో కొంత ఆధారమని, వచ్చేలా చూడాలని వేడుకున్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ ‘గ్యాస్ ధర పెరిగిందని హాస్టల్లో మెనూ తగ్గించారు. జైల్లో ఖైదీకి రూ. 40 వెచ్చిస్తే.. మాకు రోజుకు రూ. 17 మెస్ చార్జీగా ఇస్తున్నారు. రాజన్న రాజ్యం రావాలి. మళ్లీ మాకు జగనన్న సీఎం కావాలి..’ అని అన్నారు. స్థానికులంతా తమకు నీళ్లు రావడం లేదని, కరెంటు ఉండడం లేదని, పావలా వడ్డీ కింద రుణాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు.

ఇందిరమ్మ ఇల్లు మధ్యలో ఆగిపోయి బిల్లులు రాలేదని వాపోయారు. ఓ రైతు మాట్లాడుతూ ‘అదనులో విత్తనాలు సరఫరా చేయకుండా ఈప్రభుత్వం రైతులను దెబ్బతీస్తోంది. సబ్సిడీ విత్తనాలను దళారులు చేజిక్కించుకుని అమ్ముకుంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా ఇన్సూరెన్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది..’ అని పేర్కొన్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ ‘మాకు ఉచిత బస్ పాస్ ఇవ్వడం లేదు..’ అని ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతి పరీక్షకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా.. షర్మిల స్పందిస్తూ ‘ఇది రాబందుల రాజ్యం అనడానికి చక్కటి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫీజులు వసూలు చేస్తారు. కరెంటు ఇవ్వరు. గ్యాస్ ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. ఉన్న పెన్షన్లు తీసేస్తారు. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి. జగనన్న వచ్చాక రాజన్న కన్న ప్రతి కలనూ నెరవేరుస్తాడు. మీ కష్టాలన్నీ తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు.

గుంతకల్లు నియోజకవర్గంలోకి..: 20వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు వజ్రకరూర్‌లో ప్రారంభమై కమలపాడు, గూళ్యపాలెం, కొనకొండ్ల మీదుగా గుంతకల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొనకొండ్ల వద్ద కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(టీడీపీ), గుంతకల్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడాక.. గుంతకల్లు సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు షర్మిల 7.40కి చేరుకున్నారు. 20వ రోజు పాదయాత్రలో 12 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 258.80 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. యాత్రలో ఎమ్మెల్యేలు కాపు రాంచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, ఎన్.ప్రసన్నకుమార్‌రెడ్డి, నేతలు తోపుదుర్తి కవిత, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వై.విశ్వేశ్వర్‌రెడ్డి, కిసాన్‌సెల్ కోఆర్డినేటర్ వై.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...