జగన్‌ను అడ్డుకోడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను చూస్తుంటే అరచేతితో సూర్యోదయాన్ని ఆపాలని చూస్తున్న చందంలా ఉంది. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుత్సిత రాజకీయానికి తెలుగుదేశం శక్తివంచన లేకుండా సహాయం చేస్తోంది. ఈ రెండు పక్షాలు కలసి జగన్‌పై కుట్రలే తమ ఏకైక ఎజెండాగా వాటిని అమలుజరుపుతున్న తీరును విజ్ఞులైన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలవల్ల రాష్ట్రంలోని ఇంచుమించు ప్రతి కుటుంబం ఎంతో కొంత లబ్ధి పొందడం వాస్తవం. అందువల్లే ప్రతి ఒక్కరూ 2009 ఎన్నికల్లో పార్టీలకతీతంగా మొదటి ఓటును రాజశేఖరరెడ్డిగారికి వేశారు. దాంతో 33 ఎంపీ సీట్లు గెలిస్తే, దానిని సోనియా వందిమాగధులు అది ఆమె విజయంగా ఢిల్లీలో గప్పాలు కొట్టారు. ఇప్పుడు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని ఆ వందిమాగధులే జగన్‌ను జైలుకు వెళ్లేలా చేశారు.
రాష్ట్ర ప్రజలంతా రాజశేఖరరెడ్డిగారి ప్రతిరూపాన్ని జగన్‌లో చూసుకుంటున్నారు. జగన్‌కు ఉన్న ప్రజాబలం ఎంతో మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. కుల, ధన రాజకీయాలు చేయకుండా ఉంటే కాంగ్రెస్‌కు తాము స్వల్ప మెజారిటీతో నెగ్గిన ఆ రెండు సీట్లు కూడా వచ్చేవి కావు. మహానేత అకాల మరణంతో దిక్కులేక కుక్కలు చింపిన విస్తరిగా మారిన రాష్ట్రం మళ్లీ గాడిన పడి ఆ ‘సువర్ణయుగం’ మళ్లీ రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావడం ఒకటే పరిష్కార మార్గం. ఆ రోజు అతిత్వరలోనే రాబోతుంది. ‘జగ’న్నాధ రథచక్రాలను జైలు గోడలు ఆపగలవా?
- కొవ్వూరి జగాశ్రీనివాసరెడ్డి, కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా
No comments:
Post a Comment