Sunday, November 18, 2012

దేవుడు జగన్ విజయాన్ని ఆరోజే రాసిపెట్టాడు

175 రోజులు అయ్యింది. ఇన్ని రోజులు జగన్‌ను జైలులో నిర్బంధించినా దేవుని దయతో చివరకు విజయం జగన్‌దే అవుతుంది. అధికార కాంగ్రెస్‌కు జగన్‌ను కష్టపెట్టడం తప్ప వేరే పనిలేదు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపికి, దాని ప్రముఖులకు జగన్ తుమ్మాడు, దగ్గాడు దగ్గర నుంచి జగన్ గురించి మాట్లాడడం తప్ప వేరే టాపిక్ లేదు. 175 రోజులు అయినా రెండు రోజులకు ఒకసారి సీబీఐ జగన్ మీద తప్పుడు లీకులు ఇవ్వకుండా వుండలేదు. వాటిని పతాక శీర్షికలలో, దిగజారుడు పదాల్లో కొన్ని పత్రికలు, టీవీలు చూపించక మానరు.

ఇదంతా ఒకవైపు ఉంటే 175 రోజులు జైలులో వుండి ప్రజలకు దూరంగా వున్నా, ప్రజలకు జగన్ మీద ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు సరికదా ఎన్నోరెట్లు పెరిగింది. తమ కన్నబిడ్డకో, తమ సొంత అన్నకో అన్యాయం జరిగినట్లుగా భావించి వేదనపడుతున్నారు, రగిలిపోతున్నారు, కన్నీరుపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు.

ఇక మా ఇంట్లో అత్తమ్మకు, నాకు, పిల్లలకు గుండెనిండా జగనే. ఆలోచనలన్నీ జగన్ మీదే. షర్మిల వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట వెనుక అన్న మీద షర్మిలకు ఉండే ప్రేమ,అన్నకోసం తన మనస్సులోని బాధ, ఆరాటం ప్రతిబింబిస్తూ ఉంది.
రెండేళ్ల కుట్రలు, 175 రోజుల క్రూరత్వం నడుమ - ఈ మూడేళ్ల నుంచి ప్రజలు చూపించిన ప్రేమ, అండదండలు, ఆదరాభిమానాలు, దేవుని దయ, నిండైన ఆశీర్వాదం... ఇవి మా జీవితాల్ని నడిపిస్తున్నాయి. 

చరిత్ర తిరగేసినా, పురాణాలు చదివినా, ఏ మతం బోధించినా, మనం చూసేది ఒక్కటే... అన్యాయం, అక్రమం, దురాగతం - వీటి మీద అంతిమ విజయం - మంచిమార్గంలో, న్యాయమార్గంలో, ప్రేమ, మానవత్వ మార్గంలో నడిచేవారిదే. ఒక హిట్లర్ అయినా, ఒక గోబెల్లే అయినా, ఒక నరకాసురుడైనా, ఒక రావణుడైనా, కౌరవులైనా... వీరి పతనం, వీరి ఓటమి యుద్ధం మొదలవ్వకముందే రాసిపెట్టుంది. ఎందుకంటే గెలుపు మనం ఆడే ఆట మీద ఆధారపడదు - మనం ఎంచుకునే మార్గం మీద ఆధారపడి ఉంటుంది.

యధార్ధ హృదయం గలవారిని బలపరచడంకోసం దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూనే వుంటుంది. దేవుని కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీదా వుంటాయి. కాబట్టి, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కుట్రలు చేసినా, అధికార దుర్వినియోగం చేసి అన్యాయం చేసినా - 175 రోజులు జగన్‌ను జైలులో పెట్టినా జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు కాదు - ఇచ్చిన మాటకోసం ఎందరు బెదిరించినా, అదిలించినా బెదరకుండా ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన రోజునే జగన్ విజయం రాసిపెట్టి వుంది. ఇచ్చిన మాటకోసం ఇస్తానన్న మంత్రిపదవిని, ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా ఎంచుకున్న రోజే దేవుడు జగన్‌కు విజయాన్ని రాసిపెట్టాడు. రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రజలకోసం, ప్రజల మధ్య వారిలో ఒకనిగా వారితోనే తింటూ, వారితోనే వుంటూ, వారికి అన్నలాగా, తమ్మునిలాగా, కొడుకులాగా, మనవనిలాగా - 
‘వాళ్లకోసం నేను నిలబడాలి, వాళ్ల జీవితాలలో నేను వెలుగు తేవాలి, వాళ్ల కష్టాలను నేను తీర్చాలి’ అని జగన్ అనుకున్న ఆ మొదటి క్షణమే జగన్‌కు దేవుడు విజయాన్ని రాసిపెట్టాడు. తను జైలులో వున్నా తన గురించి కాకుండా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తున్న జగన్‌కు దేవుడు విజయం రాసిపెట్టాడు. హాయిగా బెంగుళూరులో వుండి వ్యాపారాలు చేసుకుంటూ, భార్యాపిల్లలతో సంతోషంగా వుండడం కంటే, కష్టాలుపడే ప్రజలతో చేయిచేయి కలపాలని, వాళ్లను సంక్షేమ మార్గంలో నడిపించాలని నిశ్చయించిన రోజునే జగన్‌కు విజయాన్ని రాశాడు దేవుడు. 

ఎంత ఆపాలనుకున్నా కృష్ణుని పుట్టుకను కంసుడు ఆపలేకపోయినట్లే, క్రీస్తు పుట్టుకను హేరోదు ఆపలేకపోయినట్లే, జగన్ బయటకు రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే జయాపజయాలు మన యుక్తి మీద, శక్తి మీద కాదు ఆధారపడేది - మనం నీతికి, న్యాయానికి, మంచితనానికి నిలబడ్డామా, లేక అన్యాయం, అక్రమం కోసం నిలబడ్డామా అనేదాని మీద ఆధారపడి వుంటాయి. కాబట్టి 175 రోజులైనా సరే సత్యమార్గంలో నడుస్తున్న జగన్‌దే విజయం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...