Thursday, November 29, 2012

తండ్రి ఆశయాలను నెరవేర్చే తనయుడు

నేను మండల కేంద్రంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయునిగా పనిచేస్తున్నప్పుడు ప్రజలతో సత్సంబంధాలుండాలన్న భావనతో, వారితో కలివిడిగా ఉండేవాడిని. ఒకరోజు ఒక వ్యక్తిని ‘బాగున్నావా? చాలా రోజులుగా కనిపించడంలేదు’ అని పలకరించాను. వెంటనే ఆయన తన చొక్కా బటన్స్ విప్పి, ఛాతీ చూపించి, తనకు జరిగిన శస్త్రచికిత్స గురించి చెప్పాడు.

‘ఆ మహానుభావుని దయవల్ల, పైసా ఖర్చులేకుండా, ఖరీదైన చికిత్స అందింది. గుండె ఆపరేషన్ అయింది. ఇప్పుడు బాగున్నాను’ అని రెండు చేతులు జోడించి, ‘రాజశేఖరరెడ్డి లాంటి ముఖ్యమంత్రులుండాలి. పేద ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాన’ని వినమ్రంగా చెప్పాడు.

ఆయన ఒక సాధారణ రైతు. ఖరీదైన వైద్యచికిత్స చేయించుకునే తాహతు లేదు. దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి గారి ఆలోచనల్లోంచి ఉద్భవించిన ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ చికిత్స అందుతున్నందుకు నేను మనసులోనే ఆనందించాను. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మే వ్యక్తి అయినందున, ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి, దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆమలు చేశాయి.

ఈరోజు ఆ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది. జాబితాలోని చాలా జబ్బులను ఆ పథకం నుంచి తొలగించారు. కొన్నింటికి చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. అక్కడ డాక్టర్ల కొరత, వసతులు, మందులు లేని కారణంగా, ఈ పథకం నీరుగారిపోతోంది.

రాజశేఖరరెడ్డి గారి ఆశయాలు పూర్తిగా అమలు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. తండ్రి ఆశయాలు నెరవేర్చే నాయకుడు జగన్ మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారు. తొందరలోనే ఆరోజు వస్తుందని, రాజన్న సువర్ణ యుగం వస్తుందని నమ్మే ప్రజలలో నేనొకడిని.
- వి. షణ్ముఖరెడ్డి, అనంతపురం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...