Saturday, November 3, 2012

వైఎస్ పోయాక బీమా ధీమా లేదు

రాజన్న ఉన్నప్పుడు విత్తనాలకు 50% సబ్సిడీ.. ఇప్పుడు తగ్గించేశారు
సకాలంలో సబ్సిడీ విత్తనాలూ అందక.. పంట ఖాళీగా వదిలేశాం
కరెంటు, నీళ్లు లేవు.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడంటూ ఆవేదన
ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలే పట్టడం లేదని షర్మిల ధ్వజం
ఇలాంటి అసమర్థ సర్కారుపై అవిశ్వాసం పెట్టరేమని టీడీపీకి ప్రశ్న
జగనన్నను దీవిస్తే.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ప్రజలకు భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 16, కిలోమీటర్లు: 213.60

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి:‘‘అప్పోసొప్పో చేసి పెట్టుబడి పెడుతున్నాం.. రాత్రనక, పగలనక కష్టపడుతున్నాం.. కానీ ఏం లాభం? సబ్సిడీ విత్తనాలు అందవు.. నీరుండదు.. కరెంటు ఉండదు.. వాన వచ్చో, వరదొచ్చో.. పంట నష్టపోతే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోలాగా బీమా అందదు.. మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు’’.... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల చేపట్టిన పాదయాత్ర సాగే దారిలో ఏ రైతును కదిలించినా ఇదే ఆవేదన.. ఇదే బాధ! మహానేత మరణించాక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదంటూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రజల బాధలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానికి మద్దతుగా నిలబడిన తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా జగన్ తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 16వ రోజు శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సాగింది. మార్గమధ్యంలో ఆమె పలుచోట్ల ప్రజల సమస్యలు తెలుసుకుని వారితో మాట్లాడారు. కోనాపురం సమీపంలో వేరుశనగ సాగు చేస్తున్న రైతు ల క్ష్మిని షర్మిల కలిసినప్పుడు వారి మధ్య సంభాషణ సాగిందిలా..

షర్మిల: ఏమ్మా పంటలెలా ఉన్నాయి?

లక్ష్మి: వేరుశనగ, అంతర పంటగా కంది వేయాలనుకున్నామమ్మా... కంది వేశాం కానీ సబ్సిడీ కింద ఇచ్చే వేరుశనగ విత్తనాలు మాత్రం సరైన సమయానికి అందలేదు. దాంతో కొంత ఖాళీగానే వదిలేశాం.. కంది మాత్రమే పెరుగుతోంది.

షర్మిల: మరి వేరుశనగ ఎన్ని ఎకరాల్లో వేశారు? పెట్టుబడి ఎంతైంది?
లక్ష్మి: 4 ఎకరాల్లో వేశాం. రూ.40 వేల ఖర్చయింది. కానీ చెట్టుకు కాయలే లేవు. ఇవి దేవాలయం
భూములు. గుత్త తీసుకున్నాం. పెట్టుబడి రాకున్నా.. గుత్త కట్టాల్సిందే.

కృష్ణమూర్తి(లక్ష్మి కుమారుడు): అంతకుముందు వేరుశనగ విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఉండేది. ఇప్పుడు తగ్గించారు. రూ. 300కు ఎకరాకు సరిపడా కంది విత్తనాలు వచ్చేవి. ఇప్పుడు రూ. 1,200 అయ్యింది. వేరుశనగకు 30 కిలోల మూటకు రూ.1,400కు పెరిగిపోయింది. పెట్టుబడులు బాగా పెరిగిపోయాయమ్మా!

షర్మిల: మరి పంటపోతే ఇన్సూరెన్స్ వస్తోందా?

లక్ష్మి: రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 25 వేల పంటకు రూ. 12 వేలు ఇన్సూరెన్స్ వచ్చింది. రెండేళ్లుగా ఇన్సూరెన్స్ రావడం లేదు.

షర్మిల: ఇప్పుడు ఖర్చుపోయింది. పంట పోయింది. పరిహారమూ రాదా?

లక్ష్మి: వైఎస్ ఉన్నప్పుడు వచ్చింది. వానలు కూడా బాగా పడ్డాయి. ఇప్పుడు సహాయం చేసేవారే లే రు.

షర్మిల: రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడమ్మా. రుణాలు ఇస్తున్నారా?

లక్ష్మి: వడ్డీ లేని రుణం అంటున్నారు కానీ లెక్కేస్తే రూ. 3 వడ్డీ తేలుతోంది.

షర్మిల: చంద్రబాబు ఉన్నప్పటి పరిస్థితే ఇప్పుడూ దాపురించింది. అప్పుడు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా రైతుకు దిక్కులేకుండా పోయింది. జగనన్నను మీరు దీవిస్తే.. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది.

తాగడానికి నీళ్లే లేవు

కోనాపురం రావడానికి ముందు షర్మిల పెన్న అహోబిలం వద్ద స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ సంభాషణ సాగిందిలా..

షర్మిల: స్థానికంగా మీకేమైనా సమస్యలున్నాయా?

ఓ మహిళ : తాగడానికి నీళ్లే లేవమ్మా. కరెంటైతే రెండు గంటలు కూడా రావడం లేదు. పంటలు లేవు. బిల్లు కడితే కరెంటు ఇస్తామంటున్నారు.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా..

మహిళ: అప్పుడు 7 గంటల పాటు కరెంటు ఉండేది. అది కూడా ఉచితంగానే. బిల్లులేమీ అడగలేదు.

షర్మిల: గ్యాస్ వాడుతున్నారా అమ్మ మీరు..?

మహిళ: వాడుతున్నాం. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 320 ఉండేది. ఇప్పుడు రూ. 480 అంటున్నారు. కొద్దిగానే వాడుకోవాలట.

షర్మిల: ఊళ్లో అర్హులైన వారికి పెన్షన్లు అందుతున్నాయామ్మా..

మహిళ: వైఎస్ ఉన్నప్పుడు వచ్చినవారికి కూడా ఇప్పుడు తీసేస్తున్నారు.

షర్మిల: పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారా?

మహిళ: ఇస్తాం.. అని బ్యాంకు చుట్టూ తిప్పించుకోవడమే గానీ ఇవ్వడం లేదు.

షర్మిల: ఉపాధి హామీ పనులు దొరుకుతున్నాయా?

మహిళ : వ్యవసాయం పనులూ లేవు. ఇటు కరువు పనులూ లేవు. 100 రోజుల పని ఇవ్వాల్సింది 30, 40 రోజులే దొరుకుతోంది.

షర్మిల: కూలీ ఎంత దొరుకుతోంది?

మహిళ: రూ. 50 నుంచి రూ. 70 వరకు. అంతకుముందు కన్నా ఇప్పుడు పని రెట్టింపైనా కూలీ మాత్రం సగమే ఇస్తున్నారు.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎలా ఉంది?

మహిళ: అప్పుడు పని దొరికేది. కూలీ కూడా రూ. 100 నుంచి రూ. 120 దొరికేది.

షర్మిల: మీ అందరికీ అర్థమవుతోంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో? రాజన్న ఐదేళ్లు బాగా పనిచేశాడని మీరు మళ్లీ గెలిపించారు. కానీ కనీసం ఆయనను గౌరవిద్దామన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాజన్న రెండోసారి గెలవకముందు 9 గంటలు కరెంటు ఇస్తానన్నాడు. కానీ ఈ ప్రభుత్వం రెండు, మూడు గంటలే ఇస్తోంది. రాజన్న ఉచితంగా ఇస్తానన్నాడు. కానీ ఈ ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో బిల్లులు కట్టమంటోంది. ఇలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి నిలదీసే అవకాశమున్నా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అలా చేయట్లేదు.. ఎందుకంటే... ఆ పార్టీ ఆ సర్కారుతోనే కుమ్మక్కయ్యింది. ఈ ప్రభుత్వానికి, ప్రతిపక్ష టీడీపీకి సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధిచెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 9 గంటల కరెంటు వస్తుంది. నీళ్లొస్తాయి. వడ్డీ లేని రుణాలూ వస్తాయి.

పైన వర్షం.. కింద బురద..

శుక్రవారం ఉదయం 10.15 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. పెన్న అహోబిలం మీదుగా మధ్యాహ్నం 12.15కు కోనాపురం క్రాస్‌రోడ్డుకు ఆమె చేరుకున్నారు. మధ్యాహ్న భోజనానికి అక్కడే విశ్రమించారు. 2 గంటల నుంచి వర్షం ఏకధాటిగా కురిసింది. వర్షంలోనే మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల యాత్రకు తిరిగి బయలుదేరారు. కోనాపురం మీదుగా ఉరవకొండకు చేరుకునే దారి అది. కోనాపురం, షేక్షానిపల్లి మీదుగా దాదాపు 6 కిలోమీటర్లు మొత్తం అడుగు తీసి అడుగు వేయలేనంత బురదలోనే ఆమె పాదయాత్ర చేశారు. అంత వర్షంలోనూ కోనాపురం, షేక్షానిపల్లి ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. షేక్షానిపల్లిలో షర్మిల మాట్లాడుతూ ‘వాన పడుతోంది కాబట్టి నాకు అర్థమైంది. ఈ రోడ్డుపై మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో.. జగనన్న సీఎం అయ్యాక మీకు రోడ్డు, బస్సులు వచ్చేలా చేస్తాం..’ అని హామీ ఇచ్చారు. సాయంత్రం 5.30కు లత్తవరం వద్ద రాత్రి బసకు చేరుకున్నారు. శుక్రవారం పాదయాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కాసేపు నడిచారు. పార్టీ నేతలు రోజా, వాసిరెడ్డి పద్మ, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తదితరులు యాత్రలో పాల్గొన్నారు. శుక్రవారం మొత్తం 12.30 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...