Saturday, November 3, 2012

షర్మిల పాదయాత్రకు బ్రహ్మరథం

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి శుక్రవారం ఉరవకొండలో విలేకరులతో పేర్కొన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర అశేష జనస్పందనతో శుక్లపక్షం చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమవుతోంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తో న్న పాదయాత్ర కృష్ణపక్షం చంద్రునిలా రోజురోజుకూ జనస్పందన కరువై నీరసించిపోతోందని ఆయన చెప్పారు. వర్షంలోనూ షర్మిలకు జనం బ్రహ్మరథం పడుతుండటం చూస్తోంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఎంత జనరంజకంగా ఉండిందో.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్థాయిలో ప్రజాపోరాటాలు నిర్వహించారో.. వారిని జనం ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో విశదం చేసుకోవచ్చన్నారు.

వైఎస్ రెక్కల కష్టంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతోందన్నారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టడం కోసం షర్మిల చేపట్టిన పాదయాత్ర అప్రతిహతంగా సాగుతోందన్నారు. ప్రజావంచక ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన చంద్రబాబు.. పాదయాత్ర అంటూ ఎల్లోడ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రజల్లో ఉంటే.. కాంగ్రెస్, టీడీపీలకు ఉనికి కూడా ఉండదనే భయంతోనే ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారన్నారు. బెయిల్ రాకుండా రెండు పార్టీలు కుమ్మక్కై కుతంత్రాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, టీడీపీల ఎత్తులను ప్రజలు తుత్తునీయలు చేసి.. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ఖాయమని.. షర్మిల పాదయాత్రకు వస్తోన్న స్పందనను చూస్తే ఆ విషయం అవగతమవుతోందన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...