Tuesday, November 20, 2012

మీ వెంటే మేమంతా...

34 రోజులుగా షర్మిలతో కలిసి పాదయాత్రలో నడుస్తున్న సామాన్య ప్రజలు

పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన జనం
అభిమానం చాటుకుంటున్న వైఎస్ హయంలో లబ్ధి పొందిన పేదలు
ఇడుపులపాయ నుంచి షర్మిల వెంటే పాదయాత్ర
ఇచ్చాపురం వరకు నడుస్తామని వెల్లడి

ఈమె పేరు సుజాత. స్వస్థలం ఖమ్మం జిల్లా భద్రాచలం. పేదరికం కారణంగా నర్సుగా పనిచేసేందుకు 1999లో సౌదీ వెళ్లారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేస్తున్న మంచి పనులను టీవీలో చూసి అభిమానిగా మారారు. అదే ఏడాది ఆమె కూతురు నారాయణమ్మకు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆసరాతో పైసా ఖర్చు లేకుండా చదువు పూర్తిచేసి ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం వెళ్లింది. సుజాత తండ్రికి ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.4 ల క్షల విలువైన ఆపరేషన్ ఉచితంగా జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌కు వచ్చిన ఈమె అక్టోబర్ 25న మళ్లీ సౌదీ వెళ్లాల్సి ఉంది. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ దాడి, జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయించడం, షర్మిల పాదయాత్ర చేయడం చూసి చలించిపోయారు. తన కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన వైఎస్ కుటుంబం కోసం షర్మిలతో పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. గత నెల 18 నుంచి షర్మిలతో పాటు యాత్రలో పాల్గొంటున్నారు.

ఈయన పేరు ధవళ గిరిబాబు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈయన లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 12 ఏళ్లు పనిచేశారు. వైఎస్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం రాష్ట్రాన్ని మార్చేస్తుందని నమ్మారు. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక 2010లో భారత్‌కు తిరిగి వచ్చిన ఈయన జగన్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన గిరిబాబు.. షర్మిల పాదయాత్ర చేస్తుండడంతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడవాలని భావించారు. లండన్‌లో ఉద్యోగం కన్నా రాష్టంలో వైఎస్ అందించిన సువర్ణపాలన జగన్ ద్వారా మళ్లీ వస్తే అంతే చాలని, జగన్‌ను సీఎంగా చూడడమే తన లక్ష్యమని చెబుతున్నారు.

ఈమె ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం వైదిన గ్రామం నుంచి వచ్చిన దయామణి. జబ్బు చేయడంతో వెన్ను వంగిపోయింది. వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద లక్ష రూపాయలతో ఆపరేషన్ అయింది. లేచి నిలబడలేని పరిస్థితి నుంచి నడిచేలా చేసిన వైఎస్ రుణాన్ని.. షర్మిలతో కలిసి పాదయాత్ర చేస్తూ కొంతైనా తీర్చుకుంటానని ఈమె చెబుతున్నారు.

ఇలా ఒకరో... ఇద్దరో కాదు... దాదాపు 70 మంది షర్మిల వెంట సాగుతున్నారు. అందులో 40 మంది వరకు వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఏదోరకంగా లబ్ధి పొందిన వారే! వీరంతా మంగళవారం నాటికి షర్మిలతో కలిసి 451.1 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొంది... ఆయన మీద అభిమానాన్ని పాదయాత్ర ద్వారా చాటుకుంటున్నారు. తమ కుటుంబాలను వదిలి వందల కిలోమీటర్ల మేర రాజన్న కూతురుతో కదం కదిపారు. మహిళలు, వృద్ధులు, యువకులు, ఉద్యోగాలకు సెలవు పెట్టి వచ్చిన వారు సైతం ఎందరో ఈ పాదయాత్రలో కనిపిస్తున్నారు. 


మంగళవారం షర్మిల తనతోపాటు ఇడుపులపాయ నుంచి కాలినడకన వస్తున్న వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని నాగులాపురం వద్ద చెట్టుకింద రాళ్లపై కూర్చొని తనతో ఎందుకు రావాలనిపించిందో వారిని అడిగి తెలుసుకున్నారు. వీరితోపాటు అనేక మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ప్రమీల అనే మహిళ వైఎస్ సీఎం అయిన తర్వాత సొంతిల్లు కట్టుకున్నారు. రూ.60 వేల రుణం మాఫీ అయింది. దీంతో ఇప్పుడు తన కొడుకుతో కలిసి పాదయాత్ర చేస్తోంది. ప్రకాశం జిల్లా గురువారెడ్డి పాలెంకు చెందిన 55 ఏళ్ల రమణమ్మ రాజన్నపై అభిమానంతో మరో ఏడుగురు తన ఊరి వాళ్లను తీసుకొచ్చి మరీ పాదయాత్రలో ఇడుపుల పాయ నుంచి నడిచి వస్తున్నారు. 

ఇక ప్రకాశం జిల్లాకు చెందిన చెన్ను విజయ అనే గృహిణి తన కుమారుడిని రెసిడె న్షియల్ స్కూల్‌లో చేర్పించి షర్మిలతో పాదయాత్ర చేస్తుంటే.. వైజాగ్‌కు చెందిన పేరిచర్ల ఝాన్సీ జగన్ కుటుంబంపై అభిమానంతో ప్రతి జిల్లాలో రెండ్రోజులు షర్మిల వెంట నడుస్తున్నారు. జగన్ మీద అభిమానం పెంచుకున్నందుకు మహిళా గ్రూపు నుంచి తన తల్లిపేరు తీసివేయడంతో అక్కతో కలిసి నడవాలని వచ్చినట్లు రాఘవేంద్ర అనే యువకుడు చెప్పాడు. ఇలాగే గుంటూరుకు చెందిన చింతా సుబ్బారెడ్డి, కోడూరు వాసి కృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వాసి జ్యోతుల నవీన్ ఆయన స్నేహితులు, కృష్ణా జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి, కడప నుంచి రాజగోపాల రెడ్డి, మాచ్చవరానికి చెందిన గజ్జెల వెంకట కృష్ణారెడ్డి, అనంతపురానికి చెందిన వన్నూరమ్మ, కడప నుంచి షఫీ, ధర్మవరం నుంచి నారాయణ, కోడుమూరు నుంచి శ్రీనివాస యాదవ్, కడప నుంచి సరస్వతి... ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా వైఎస్ కుటుంబానికి అభిమానులుగా మారారు. అదే అభిమానంతో జగన్‌ను సీఎంగా చూడాలన్న లక్ష్యంతో అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేసుకుంటూ కర్నూలుకు వచ్చారు. షర్మిలతో కలిసి ఇచ్ఛాపురం వరకు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామని, జగన్‌ను సీఎంగా చూస్తామని వారు ధీమాగా చెబుతున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...